అంతర్జాతీయ మార్కెట్‌కు ఉలవపాడు మామిడి

Ulavapadu Mango for the international market - Sakshi

సాక్షి, అమరావతి: ప్రకాశం జిల్లాలోని ఉలవపాడు మామిడి పండ్లను అంతర్జాతీయ మార్కెట్‌కు ఎగుమతి చేసేందుకు ఉద్యాన శాఖ కసరత్తు చేస్తోంది. నాణ్యమైన మామిడి పండ్లను ఉత్పత్తి చేసి, పెద్ద ఎత్తున వాటిని ఎగుమతి చేసేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తోంది. ఇందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు సిద్ధమైంది. ఉలవపాడు మామిడి తోటల అభివృద్ధికి ప్రత్యేకించి జాతీయ హార్టీకల్చర్‌ బోర్డు కూడా తన వంతు సహకారం అందించనుంది. 

ప్రధాన క్లస్టర్‌గా ఉలవపాడు
ఉలవపాడు మామిడికాయ దేశంలోనే ప్రసిద్ధిగాంచింది. దీని రుచి అమోఘం. ఈ కాయ బరువు కేజీ కేజీన్నర కూడా ఉంటుంది. నాణ్యతతో పాటు తీయదనానికి ఇది మారు పేరు. దీనిని అంతర్జాతీయ మార్కెట్‌కు ఎగుమతి చేసేందుకు రెండేళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఈ ఏడాది దానిని ఆచరణలో పెడుతున్నారు. దీనిలో భాగంగా ఉలవపాడును ఒక ప్రధాన క్లస్టర్‌గా అభివృద్ధి చేసి పండ్ల ఉత్పత్తి, ఎగుమతికి చర్యలు తీసుకోనున్నారు. ఇందుకోసం జాతీయ హార్టీకల్చర్‌ బోర్డు సహకారం తీసుకోవడంతో పాటు, ఉపాధి హామీ పథకం నిధులను కూడా వినియోగించుకోనున్నారు. 8 వేల హెక్టార్లలో ఇక్కడ మామిడి తోటలున్నాయి. సేంద్రీయ విధానాన్ని అవలంభించేలా ప్రభుత్వం ఇక్కడి రైతులను ప్రోత్సహిస్తోంది.

ఉద్యాన పంటల ప్రోత్సాహానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు ప్రవేశపెట్టాయి. వాటిపై క్షేత్ర స్థాయిలో ఇక్కడి రైతులకు పూర్తి అవగాహన కలిగించి, వాటిని సద్వినియోగం చేసుకునేలా చైతన్యవంతం చేస్తున్నారు. మైదాన ప్రాంతంలో ఉలవపాడు ఉన్నందున నీటి వసతికి అంతగా ఇబ్బంది లేదు. అయినప్పటికీ నీటి కుంటల ఏర్పాటుతో పాటు, ప్రతి నీటి బొట్టునూ ఒడిసి పట్టి భూగర్భ జలంగా మార్చుకునేందుకు ప్రయత్నించాలని రైతులకు ఉద్యాన శాఖ సూచించింది. ఇప్పటికే మామిడి పండ్ల ఉత్పత్తి, ఎగుమతిలో జాతీయ స్థాయిలో రాష్ట్రం అగ్రగామిగా ఉంది. పండ్లను నిల్వ చేసేందుకు సరిపడా గిడ్డంగులు, ప్రయోగశాల సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పోస్ట్‌ హార్వెస్టింగ్‌ టెక్నాలజీ, మార్కెటింగ్‌ సౌకర్యాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే విజయనగరం, గోపాలపురం, నూజివీడు, తిరుపతి ప్రాంతాల నుంచి వివిధ రకాల మామిడి పండ్లు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతవుతున్నాయి. 

కాయల్ని ఎలా ప్యాక్‌ చేయాలో శిక్షణ ఇస్తున్నాం..
ఉలవపాడు మామిడి కాయల నాణ్యతకు ఎటువంటి ఢోకా లేకుండా చేపట్టాల్సిన చర్యలపై ఆ ప్రాంత రైతులకు ప్రస్తుతం వైఎస్సార్‌ తోటబడి కార్యక్రమం కింద శిక్షణ ఇస్తున్నాం. చీడపీడల నివారణపై వారిని చైతన్య పరుస్తున్నాం. ముదురు తోటల్ని పునరుజ్జీవింపజేసేందుకు హెక్టార్‌కు రూ.17 వేలు ఇచ్చి రైతులకు అండగా నిలుస్తున్నాం. ఎగుమతిదారులు, కమీషన్‌ ఏజెంట్లకు కూడా శిక్షణ ఇచ్చి.. కాయల్ని ఎలా ప్యాకింగ్‌ చేయాలో, విదేశాలలో నిబంధనలు ఎలా ఉంటాయో వివరిస్తున్నాం.   
 – రవీంద్రబాబు, వ్యవసాయశాఖ డీడీ, ప్రకాశం జిల్లా   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top