నీరు మిగిల్చిన కన్నీరు 

Two Children Deceased Due To Sink In Water In AP At Srikakulam - Sakshi

ఉప్పుటేరులో పడి ఇద్దరు చిన్నారులు మృతి

రాఖీ పౌర్ణమి నాడు విషాదం  

నీరు కన్నీరు మిగిల్చింది. రాఖీ పౌర్ణమి నాడు ఉప్పుటేరు అన్నాచెల్లెళ్ల కుటుంబాల్లో విషాదం నింపింది. తండ్రులతో పాటు విహారానికి వెళ్లిన బిడ్డలు తిరిగి ఇంటికి రాలేకపోయారు. చందమామ వంటి రూపాలు, ముద్దుగారే మాటలతో ఇళ్లంతా సందడిగా తిరిగిన పిల్లలు నిశ్శబ్దమైపోయారు. అమ్మానాన్న ఊరెళితేనే తట్టుకోలేని ప్రాయంలో వారిని శాశ్వతంగా వదిలి వెళ్లిపోయారు.

సోంపేట: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం సిరిమామిడి గ్రామానికి సమీపంలో గల ఉప్పుటేరులో పడి కారాగి హర్షిత్‌ (6), దున్న శ్రీశాంత్‌ (8) అనే ఇద్దరు బాలలు మృతి చెందారు. రాఖీ పండగ రోజు జరిగిన ఈ విషాదం ఇద్దరు అన్నాచెల్లెల కుటుంబాల్లో తీరని శోకం మిగిల్చింది. పోలీసులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన కారాగి ప్రకాష్, దున్న కాంతారావులు బావబామ్మర్దులు. కారాగి ప్రకాష్‌ చెల్లి నీలవేణిని కాంతారావుకు ఇచ్చి వివాహం చేసి ఉన్నారు. ఆదివారం సాయంత్రం బావబామ్మర్దులు పిల్లలు కారాగి హర్షిత్, దున్న శ్రీశాంత్‌లతో పాటు సముద్ర తీరానికి వెళ్లారు.

తీరంలోని ఉప్పుటేరు వద్ద పిల్లలను కూర్చోబెట్టి అక్కడే ఉండమని చెప్పి వారు సముద్రం వైపు వెళ్లారు. తండ్రులు దగ్గర లేకపోవడంతో పిల్లలిద్దరూ ఉప్పుటేరులో స్నానానికి దిగారు. నీటి లోతును అంచనా వేయలేక మునిగిపోయారు. తండ్రులు అక్కడకు వచ్చి చూసే సరికి పిల్లలు లేకపోవడంతో కంగారు పడి అంతా వెతికారు. ఉప్పుటేరు చిన్నారులు కాస్త తేలుతూ కనిపించడంతో వారికి బయటకు తీసి స్థానికుల సాయంతో హరిపురం సామాజిక ఆస్పత్రికి హుటాహుటిన తరలించారు. అయితే అప్పటికే చిన్నారులు మృతి చెందినట్లు వైద్యులు చెప్పడంతో వారు గుండెలవిసేలా రోదించారు. ఇద్దరు చిన్నారుల మృతితో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. 

కారాగి ప్రకాష్, కల్పనలకు హర్షిత్‌ తో పాటు మూడేళ్ల పాప ఉంది. ఆదివారం ఉదయమే తన అన్నకు ఆ చిన్నారి రాఖీ కట్టింది. సాయంత్రానికి ఆ బాలుడు చనిపోయాడనే వార్త తెలిసి ఆ కుటుంబం కంటికి మింటికి ఏకధారగా రోదించింది. దున్న కాంతారావు, దున్న నీలవేణిలకు శ్రీశాంత్‌తో పాటు మరో ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. పెద్ద కుమారుడిని ఉప్పుటేరు మింగేయడంతో ఆ కుటుంబం బోరున విలపించింది. సోంపేట సీఐ డీవీవీ సతీష్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. బారువ ఎస్‌ఐ రమేష్, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చదవండి: ఊరెళ్లిపోదాం అన్న కాసేపటికే.. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top