
అపరిశుభ్ర పరిసరాలతో పందులు, దోమలు వ్యాప్తి
40 మంది జ్వర బాధితులు.. 15 మందికి తీవ్ర అస్వస్థత
ఆత్మకూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఏపీ బాలికల గురుకుల పాఠశాలలో విషజ్వరాలు ప్రబలిన విషయం శనివారం వెలుగులోకి వచ్చింది. విద్యార్థులు మూడు రోజులుగా జ్వరాలతో బాధపడుతున్నారు. సుమారు 40 మంది విద్యార్థినులు జ్వరాల బారిన పడగా.. పాఠశాల ప్రిన్సిపాల్ కెజియా రూత్ 20 మంది విద్యార్థినులను శుక్రవారం వారి ఇళ్లకు పంపినట్లు సమాచారం. జ్వర తీవ్రత అధికంగా ఉండడంతో కొందరు విద్యార్థినులు వాంతులు చేసుకున్నారు. తీవ్ర అస్వస్థతకు గురైన 15 మంది విద్యార్థినులను పోలీస్ వాహనాల్లో పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు.
పాఠశాల వెనుక మున్సిపల్ డంపింగ్ యార్డు ఉండడం, ముందు వైపు ప్రహరీ లేకపోవడంతో అప్పుడప్పుడు పందులు సంచరిస్తుంటాయి. దీంతో దోమలు వ్యాప్తి చెంది జ్వరాలు ప్రబలినట్లు విద్యార్థినులు చెబుతున్నారు. కలెక్టర్ ఆదేశాలతో ఆర్డీఓ బి.పావని, డీఎస్పీ కె వేణుగోపాల్, సీఐలు ఎం గంగాధర్, కె వేమారెడ్డి, ఎస్సై ఎస్‌కే జిలానీ గురుకుల పాఠశాలకు చేరుకున్నారు. జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.శేషారత్నం ఆధ్వర్యంలో విద్యార్థినులకు చికిత్సలు చేయించారు.
జాయింట్ కలెక్టర్ కార్తీక్ పాఠశాలను శనివారం మధ్యాహ్నం సందర్శించి, పరిస్థితిని సమీక్షించారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినులను పరామర్శించారు. అపరిశుభ్రత వల్ల జ్వరాలు సోకాయా లేదా ఫుడ్ పాయిజన్ వల్ల జరిగిందా అనే విషయాలపై ముమ్మర దర్యాప్తు చేయనున్నట్లు ఆయన తెలిపారు. కాగా, విద్యార్థినులు అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.