దళిత, మైనార్టీల ఆత్మగౌరవంపై బాబు సర్కార్‌ ‘బూటు’ దెబ్బ | Three Dalit And Minority Youths Charged With Third Degree In Tenali Town, Check Story For More Details Inside | Sakshi
Sakshi News home page

దళిత, మైనార్టీల ఆత్మగౌరవంపై బాబు సర్కార్‌ ‘బూటు’ దెబ్బ

May 27 2025 5:30 AM | Updated on May 27 2025 4:25 PM

Three Dalit and minority youths charged with third degree in Tenali town

తెనాలి పట్టణంలో ముగ్గురు దళిత, మైనారిటీ యువకుల పైన థర్డ్‌ డిగ్రీ 

నడి రోడ్డుపై..పట్టపగలే..ప్రజల కళ్లెదుటే.. అరికాళ్లపై లాఠీలతో స్వైరవిహారం

ఒక సీఐ బూటు కాలితో తొక్కిపెట్టగా.. మరో సీఐ దాష్టీకం   

ఆలస్యంగా వెలుగులోకి.. సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌ 

బరితెగింపులో సీఎం చంద్రబాబు బాటలోనే రాష్ట్ర పోలీస్‌లు 

రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలులో హద్దుమీరుతున్న వైనం 

పోలీసుల తీరు ముమ్మాటికీ హక్కుల ఉల్లంఘనే అంటున్న దళిత సంఘాలు.. బాధ్యులపై ఎట్రాసిటీ 

చట్టంకింద కేసు నమోదు చేయాలని డిమాండ్‌ 

చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే విచారణ 

జరిపి పోలీసులపై చర్య తీసుకోవాలని సూచన

అంబేడ్కర్‌ మహనీయుడు రాసిన రాజ్యాంగాన్ని కాలరాసి.. రెడ్‌బుక్‌ రాజ్యాంగం రాక్షసత్వాన్ని ఆచరణలో చూపిస్తూ.. పట్టపగలే.. ఆటవిక పాలనకు అచ్చమైన ప్రతిరూపంలా.. కూటమి ఏడాది దాష్టీక పాలనలో దమనకాండకు అద్దంపడుతూ.. దళిత, మైనారిటీ, బడుగు యువకులపై పోలీస్‌ లాఠీ కర్కశత్వం చూపింది ఒక సీఐ కొడుతుంటే.. ఇంకో సీఐ కాళ్లతో తొక్కి కదలకుండా పట్టుకుంటాడు.. మరో పోలీసు వీడియో తీస్తాడు. ఇంకో పోలీసు విరిగిన లాఠీల స్థానంలో ఎడతెగని ఉత్సాహంతో కొత్త కట్టెలు అందిస్తాడు.. చుట్టూ ఉన్న పోలీసులు దెబ్బలు తింటున్న దళిత, ముస్లిం యువకులను చూసి పగలబడి నవ్వుతుంటారు. ఇదీ కూటమి పాలనలో దళితులు, ముస్లింలు, బడుగుల పట్ల చంద్రబాబు సర్కారు దాష్టీకానికి నిలువెత్తు రూపం

ఈ రాష్ట్రంలో మహనీయుడు అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగమే అమల్లో ఉందా లేక రెడ్‌ బుక్‌ పేరిట ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను, మైనారిటీలను బహిరంగంగా చితక్కొట్టే లోకేష్‌ రాజ్యాంగం అమల్లోకి వచ్చిందా?  కొట్టీ కొట్టీ చివరికి లాఠీలు విరిగిపోతే కొత్త లాఠీలు తెచ్చుకుని మరీ కొట్టడం స్టేట్‌ టెర్రరిజం కాదా ? ఇది హృదయం లేని పాలన కాదా ?  దళితులు, ముస్లింలు, బడుగులను తాళ్లతో కట్టేసి, బహిరంగంగా లాఠీలతో చావమోదడమే విజయమని మీరు భావిస్తుంటే... చంద్రబాబూ మీరు ఈ గద్దెకు అర్హులు కాదు. మీది పాలన కాదు పీడన తెనాలి నడిరోడ్డుపై పోలీసుల చేతుల్లో చావుదెబ్బలు తిన్న ఆ పేద దళిత, ముస్లిం యువకుల అరుపులు మీకు వినిపించకపోతే.. ప్రాణభయంతో అన్నా కొట్టొద్దు అంటూ విలపించిన వారి కన్నీళ్లు మీకు కనిపించకపోతే... ఆ యువకుల ఒంటినుంచి కారిన రక్తపు బిందువులే రేపు మీ పాలనను కడతేర్చే మహా విప్లవమైవుతాయి.. తస్మాత్‌ జాగ్రత!

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న సీఎం చంద్రబాబు బాటలోనే పోలీసులు బరితెగించి దళిత, మైనార్టీలు, బడుగులపై విరుచుకుపడుతున్నారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి నుంచి క్షేత్రస్థాయి కానిస్టేబుల్‌ వరకు రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలులో పోటీ పడుతున్నారు. కంచే చేసు మేసిన చందంగా చట్టాన్ని పరిరక్షించాల్సిన పోలీసులే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్న వైనం గుంటూరు జిల్లా తెనాలిలో చోటుచేసుకుంది. మానవ హక్కులను నడి వీధిలో నేలరాస్తూ పోలీస్‌ లాఠీ స్వైర విహారం చేసింది. 

ముగ్గురు దళిత, మైనారిటీ యువకులపై శరీరాలపై వీరంగం వేసింది. బహిరంగంగా నలుగురూ చూస్తుండగానే కర్కశంగా విరుచు­కుపడింది. యువకులను రోడ్డుపై కూర్చోబెట్టి.. ఇద్దరు పోలీసు అధికారులు లాఠీలతో విచక్షణారహితంగా కొట్టిన ఘటన మంత్రి నాదెండ్ల మనోహర్‌ ఇలాకా గుంటూరు జిల్లా తెనాలిలో జరిగింది. యువకుల అరికాళ్లపై పోలీసులు కర్కశంగా లాఠీలతో చితకబాదిన వీడియో సోమవారం వైరల్‌ అయింది. దీనిని చూస్తుంటే ప్రతి ఒక్కరికీ ఒళ్లు గగుర్పొడుస్తోంది. 

అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? ఆటవిక రాజ్యంలో ఉన్నామా? అనే ఆందోళన కలుగుతోంది. గత నెలలో జరిగినదిగా భావిస్తున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల చేతిలో చావుదెబ్బలు తిన్నది దళిత, మైనారిటీ యువకులు. వీరిలో ఇద్దరిది తెనాలి కాగా, మరొకరు మంగళగిరికి చెందినవాడని తెలిసింది. వీరిని చిత్రహింసలకు గురిచేసింది తెనాలి టౌ టౌన్‌ సీఐ రాములునాయక్, త్రీటౌన్‌ సీఐ రమేష్‌బాబు. 

జనం చూస్తుండగానే.. వేడుకున్నా వదలకుండా...
తెనాలి త్రీ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్‌ కన్నా చిరంజీవి (పీసీ 6068)పై ఏప్రిల్‌ 24వ తేదీ రాత్రి నలుగురు యువకులు హత్యా­యత్నం చేశారని టూటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితుడిగా పేర్కొన్న వేము నవీన్‌ పోలీసులకు దొరకలేదు. చేబ్రోలు జాన్‌ విక్టర్‌ (తెనాలి చెంచుపేట), దోమా రాకేష్‌ (తెనాలి ఐతానగర్‌), షేక్‌ బాబులాల్‌ (అలియాస్‌ కరిముల్లా, కల్లా, మంగళగిరి)లను ఏప్రిల్‌ 27వ తేదీ రాత్రి అరెస్టు చేసినట్టుగా రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు.  

అంటే అరెస్టు చూపిన రెండురోజుల ముందే అదుపులోకి తీసుకుని ఏప్రిల్‌ 25న ముగ్గురు నిందితులను తెనాలి జయప్రకాష్‌నగర్‌లో టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు రెండు ఫర్లాంగుల దూరంలోనే నడిరోడ్డుపై కూర్చోబెట్టి అరికాళ్లపై తీవ్రంగా కొట్టారు. మూడు రోజుల పాటు దళిత, మైనార్టీ యువకులను అదుపులో ఉంచుకుని తెనాలి వీధులన్నీ తిప్పుతూ విచక్షణారహితంగా కొట్టినట్లు కొందరు చెబుతున్నారు. టూ టౌన్‌ సీఐ రాములు నాయక్‌ అతి కర్కశంగా యువకుల కాళ్లపై బూటు కాళ్లతో ఎక్కి తొక్కిపెడితే.. త్రీ టౌన్‌ సీఐ రమేష్‌­బాబు థర్డ్‌ డిగ్రీ ప్రయోగించడం గమనార్హం. ప్రస్తు­తం ఈ కేసులో నిందితులు రిమాండులో ఉన్నారు.

రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం తగదు
పోలీసు అధికారులు రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం సరికాదు. జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛను హరించేలా ప్రవర్తించడం తప్పు. తెనాలి ఐతానగర్‌ యువత తప్పు చేసి ఉంటే న్యాయస్థానంలో ప్రవేశపెట్టాలే తప్ప నడిరోడ్డుపై బహిరంగంగా దాడి చేయడం తగదు. ఈ ఘటనను ప్రభుత్వం ఎలాగూ పట్టించుకోదు. జాతీయ ఎస్సీ కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్, రాష్ట్ర ఎస్సీ కమిషన్‌ స్పందించి బాధితులకు న్యాయం చేయాలి.     
– మాల వెంకటేష్, మాల విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

కాళ్లలో రాడ్లు ఉన్నాయని చెబుతున్నా..
ప్రమాదం కారణంగా తన కాళ్లలో, చేతుల్లో రాడ్లు వేశారని దోమ రాకేష్‌ చెబుతున్నా సీఐలు పట్టించుకోలేదు. కాళ్లు పట్టుకుని ప్రాధేయపడినా పోలీసులు కనికరించలేదు. ఈ ఘటన తెనాలి ప్రజలను భయాందోళ­నలకు గురిచేసింది. కాగా,  ఏదైనా కేసులో అరెస్టు చేసిన నిందితులను కొట్టే అధికారం పోలీసులకు లేదని అనేకసార్లు న్యాయస్థానాలు సైతం చీవాట్లు పెట్టినా రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న పోలీసుల్లో మార్పు రాలేదని పలువురు హక్కుల నేతలు మండిపడుతున్నారు.

హక్కుల ఉల్లంఘనే..
దళిత యువకులు, మరే వ్యక్తిపైన అయినా పోలీసులు థర్డ్‌ డిగ్రీ పద్ధతులు (శారీరక హింస, కొట్టడం, హింసించడం వంటివి) ప్రయోగించడం రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించడమే అవుతుంది. తెనాలి పోలీసుల తీరును మానవ హక్కుల ఉల్లంఘనగా పరిగణించాలని దళిత సంఘాల నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 ప్రతి వ్యక్తికి జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛను ప్రసాదించింది. ఆర్టికల్‌ 14 చట్టం ముందు సమానమేనని, దళిత యువకులు, ఏ ఇతర సముదాయానికి చెందిన వ్యక్తులపై అయినా వివక్షతో కూడిన హింస చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. ఆర్టికల్‌ 15 జాతి, కులం, మతం, లింగం, జన్మస్థానం ఆధారంగా వివక్ష చూపడాన్ని నిషేధించింది. దళితులను లక్ష్యంగా చేసుకుని హింస చేయడం ఈ ఆర్టికల్స్‌ను ఉల్లంఘించడమే అవుతుంది.

క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ (సీపీసీ)లోని సెక్షన్‌ 41 ప్రకారం అరెస్టు చేసే సమయంలో పోలీసులు తగిన కారణం లేకుండా హింసను ఉపయోగించకూడదు. థర్డ్‌ డిగ్రీ పద్ధతులు నిబంధనలకు విరుద్ధం. సెక్షన్‌ 176 ప్రకారం.. కస్టడీలో హింస, మరణం జరిగితే, దానిపై మేజిస్ట్రేట్‌ విచారణ నిర్వహించాలని స్పష్టంగా ఉంది. 

⇒ ఇండియన్‌ పీనల్‌ కోడ్‌(ఐపీసీ) సెక్షన్‌ 323 ప్రకారం స్వచ్ఛందంగా శారీరక హాని కలిగించడం, సెక్షన్‌ 324 ప్రకారం ఆయుధాలతో, హానికరమైన పద్ధతుల్లో గాయపరచడం, సెక్షన్‌ 341 అకారణంగా వ్యక్తిని నిర్బంధించడం, సెక్షన్‌ 506 బెదిరింపులు, ఒప్పుకోవాలని బలవంతం చేయడం నేరం.

⇒ ప్రధానంగా షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ ట్రైబ్స్‌ (అత్యాచారాల నివారణ) చట్టంృ 1989 (ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌) ప్రకారం.. దళితులపై హింస, అవమానం  నేరంగా పరిగణిస్తారు. సెక్షన్‌ 3(1) ప్రకారం దళితులను లక్ష్యంగా చేసుకుని శారీరకంగా, మానసికంగా హింసించడం కఠిన శిక్షకు దారితీస్తుంది. పోలీసులు దళితులను హింసిస్తే అది వివక్షతో కూడిన నేరం. మానవ హక్కుల చట్టంృ1993 ప్రకారం పోలీసుల హింసపై జాతీయ, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లు విచారణ జరిపి చర్యలకు సిఫార్సు చేయవచ్చు.

పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లాలంటేనే బాధితులు భయపడే పరిస్థితులు
కేవీపీఎస్‌ విమర్శ
ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా.. అమాయక దళిత, మైనారిటీ యువకులను తెనాలి ఐతానగర్‌ నడి రోడ్డులో పోలీసులు తీవ్రంగా కొట్టడంపై సమగ్ర విచారణ జర­పాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్‌) రాష్ట్ర డీజీపీ హరీష్‌­కుమార్‌గుప్తాను కోరింది. అందరూ చూస్తుండగానే ఇంతటి దారుణానికి ఒడిగట్టడం దుర్మార్గమని పేర్కొంది. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వం అండతో పోలీసులు సాగిస్తున్న దమనకాండకు ఈ దాష్టీకం ఒక నిదర్శనమని ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ మేరకు ఆ లేఖను కేవీపీఎస్‌ రాష్ట్ర కార్యదర్శి అండ్ర మాల్యాద్రి సోమవారం మీడియాకు విడుదల చేశారు. 

‘తెనాలి ఘటన ప్రజలను భయభ్రాంతులకు చేసేలా ఉంది. నేరం చేస్తే న్యాయస్థానాలకు అప్పచెప్పాలి గాని, ఇంత క్రూరంగా కొడతారా? ఇది హక్కుల ఉల్లంఘనే. యువకుల తల్లిదండ్రులు వెళ్లి అడిగితే మీపైనా కేసులు పెడతామని పోలీసులు బెది­రించారు. దళితులు అయినందునే దాష్టీకం చూపి­­స్తున్నారు. అమాయకులపై అక్రమ కేసు­లు బనాయించి కర్కశంగా ప్రవర్తిస్తు­న్నారు. రాష్ట్రంలో న్యాయం కోసం పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలంటేనే బాధితులు భయపడే పరిస్థితి ఉంది’ అని మాల్యాద్రి పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement