
నిషేధిత టీఎఫ్‌ఈ, పీటీఎఫ్‌ఈ, పీఎఫ్‌ఐబీ వంటి రసాయనాల తయారీ పరిశ్రమ స్థాపన వైపు టీజీవీ గ్రూప్ అడుగులు
మంత్రి టీజీ భరత్ కుటుంబ సంస్థ ఆధ్వర్యంలో ఫ్యాక్టరీ నిర్మాణం
ప్రపంచంలోని పలు దేశాల్లో ఈ రసాయనాలు నిషేధం
తుంగభద్ర, కృష్ణా పరీవాహక ప్రాంతాలు కాలుష్యంతో సతమతం
తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్ల మందిపైగా ప్రజల తాగు నీరు కలుషితం
క్యాన్సర్, కిడ్నీ, ఊపిరితిత్తుల సమస్యలతో తీవ్ర అనారోగ్య ప్రమాదం
పంటలతో పాటు జీవరాశులకు కూడా పెను ముప్పు
టీజీ గ్రూప్ తలపెట్టిన ఫ్యాక్టరీ, పర్యావరణ విధ్వంసంపై 27 మంది శాస్త్రవేత్తల అధ్యయనం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిక పంపిన ఐదుగురు శాస్త్రవేత్తలు
14న కర్నూలు జిల్లా గొందిపర్ల సమీపంలో ప్రజాభిప్రాయ సేకరణ
ఫ్యాక్టరీ నిర్మాణం ఆపేయాలంటున్న పౌరహక్కుల సంఘాలు, వామపక్షాలు
ఇదో భయంకర కాలుష్య కథ. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో నిషేధించిన అత్యంత ప్రమాదకర రసాయనాలను ఉత్పత్తి చేసి.. వాటి వ్యర్థాలను తుంగభద్ర, కృష్ణా నదుల్లో కలిపి.. పరీవాహక ప్రాంతాల్లోని గాలి, నీటిని కలుషితం చేసి.. ప్రజలు, జీవుల ఆరోగ్యాలను గుల్లచేయబోతున్న పరిశ్రమ కథ. అధికారాన్ని అడ్డం పెట్టుకుని వ్యవస్థలను ప్రలోభపెట్టి, నిజాలు దాచిపెట్టి.. ప్రజారోగ్యం కంటే వ్యాపార సామ్రాజ్య విస్తరణ ద్వారా డబ్బు సంపాదనే పరమావధిగా పెట్టుకున్న టీజీవీ గ్రూప్ కథ!
సాక్షి ప్రతినిధి కర్నూలు: కర్నూలు జిల్లా పంచలింగాల సమీపంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ కుటుంబానికి చెందిన ఆల్కలీస్ ఫ్యాక్టరీ ఉంది. భరత్ తండ్రి, బీజేపీ సీనియర్ నాయకుడు టీజీ వెంకటేశ్ పర్యవేక్షణలో ఇది నడుస్తోంది. ఈ పరిశ్రమలో కాస్టిక్ సోడా ఉత్పత్తితో క్లోరిన్ వెలువడుతుంది. ఇది విష వాయువు. క్లోరిన్ రసాయనాలతో టెఫ్లాన్ (పీటీఎఫ్‌ఈ), క్లోరో మీథేన్ వంటి ఉత్పత్తుల యూనిట్‌ను విస్తరించేందుకు టీజీ గ్రూప్ ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
పీటీఎఫ్‌ఈ (పారీ టెట్రాక్లోరో ఇథిలిన్) తయారీలో పీఎఫ్‌వోఏ (ఫర్‌ఫ్లోరో ఆక్టనాయిక్ యాసిడ్), కార్బన్ టెట్రాక్లోరైడ్ వంటి రసాయనాలు వినియోగిస్తారు. ప్రమాదకరమైన పీఎఫ్‌వోఏను జర్మనీ, డెన్మార్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వేతో పాటు ఎన్నో దేశాలు నిషేధించాయి. ఆరోగ్యం గుల్లవుతోందని.. ఇలాంటి రసాయనాల వాడకాన్ని శాశ్వతంగా మానేయాలని 2019లో స్టాక్‌హోమ్ కన్వెన్షన్ వేదికగా 180 దేశాలు ఒప్పందం చేసుకున్నాయి.
అమెరికాలో డార్క్ వాటర్!
అమెరికాలోని వెస్ట్ వర్జీనియాలో పీఎఫ్‌వోఏ, పీఎఫ్‌ఏఎస్ (ఫర్ అండ్ పాలీ ఆల్కల్ సబ్‌స్టాన్స్) వాడకంతో ఓ గ్రామంలోని ఆవులు చనిపోయాయి. ఫ్యాక్టరీ సమీప గ్రామాలు, నదిలోని నీరు తాగడంతో అనారోగ్యానికి గురై మనుషులు, జీవరాశులు చనిపోవడంతో అమెరికా ప్రభుత్వం సైన్స్ ప్యానల్ ఏర్పాటు చేసింది. ఎమరీ యూనివర్సిటీ, నోటర్‌డామ్, లండన్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు.. 70 వేలమంది రక్త నమూనాలు సేకరించారు. పీఎఫ్‌వోఏ, పీఎఫ్‌ఏఎస్ అత్యంత ప్రమాదకరమని తేల్చారు. ఫ్యాక్టరీని మూసేయడంతో పాటు రసాయనాలను నిషేధించారు. దీనిపై ‘డార్క్ వాటర్’ పేరుతో హాలీవుడ్ సినిమా కూడా తీశారు. ఇప్పుడు అనపర్తి, టీజీ గ్రూప్ ఫ్యాక్టరీలతో మనదగ్గర కూడా అలాంటి ఘోర పరిస్థితి ఉత్పన్నం కానుంది.
బుధవారం ప్రజాభిప్రాయ సేకరణ
ఫ్యాక్టరీ ఏర్పాటుపై టీజీ గ్రూప్ ఆల్కలీస్ సమీపంలోని గొందిపర్ల వాసులతో బుధవారం ప్రజాభిప్రాయ సేకరణ జరగనుంది. కాగా, దీనికి అనుమతులు ఇవ్వొద్దని ప్రజాస్వామ్య సంఘాల ఐక్య వేదిక కన్వినర్ రామకృష్ణారెడ్డి, కో కన్వీనర్ శ్రీనివాసరావు, పౌర హక్కుల సంఘం జిల్లా కార్యదర్శి అల్లాబక్ష్, సీపీఐ, సీపీఎం నేతలు రామకృష్ణ, రామకృష్ణారెడ్డి, రాయలసీమ విద్యావంతుల వేదిక కో కన్వినర్ జీవీ భాస్కర్‌రెడ్డి డిమాండ్ చేస్తున్నారు.
అత్యంత విషపూరిత రసాయనం!
ఆల్కలీస్ ఫ్యాక్టరీ తుంగభద్ర ఒడ్డునే ఉంది. దీనికోసం నది ఎగువ భాగంలోని నీటిని వినియోగిస్తారు. వ్యర్థాలను నది దిగువ భాగంలో కలుపుతున్నట్లు తెలుస్తోంది. పీటీఎఫ్‌ఈ తయారీకి పీఎఫ్‌వోఏ, పీఎఫ్‌ఏఎస్ రసాయనాలు నీటిలో కలుస్తాయి. ఇవి తుంగభద్ర ద్వారా కృష్ణా నదిలో చేరుతాయి.
⇒ తుంగభద్ర, కృష్ణానీటిని ఏపీ, తెలంగాణకు చెందిన 2 కోట్లమందికి పైగా ప్రజలు తాగుతారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ ద్వారా లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుంది. అయితే, రసాయనాలు కలవడంతో ఈ జలాలు విషపూరితం అవుతున్నాయి. క్యాన్సర్, కిడ్నీ, గర్భధారణ ప్రేరిత రక్తపోటు, ఊపిరితిత్తులు, గుండె, రక్త సంబంధిత, పలు ప్రాణాంతక వ్యాధులు వస్తాయని, హైదరాబాద్‌కు చెందిన సైంటిస్ట్స్ ఫర్ పీపుల్ అనే సంస్థ నుంచి 27 మంది శాస్త్రవేత్తల బృందం క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి నివేదిక రూపొందించింది.
⇒ డాక్టర్ బాబూరావు, డాక్టర్ వెంకటరెడ్డి, డాక్టర్ రాంబాబు, డాక్టర్ అహ్మద్‌ఖాన్, ప్రొఫెసర్ విజయ్‌కుమార్‌లు కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మంత్రిత్వ శాఖ సెక్రటరీ తన్మయ్‌కుమార్‌కు ఈ నెల 5న నివేదికను సమర్పించారు. ఏపీ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ డాక్టర్ కృష్ణయ్య, కర్నూలు కలెక్టర్ రంజిత్‌బాషాకు కూడా నివేదిక పంపారు.
మొన్న బలభద్రపురం.. నేడు కర్నూలు
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి పరిధిలోని బలభద్రపురంలోని గ్రాసిం కంపెనీ కాస్టిక్ సోడా ప్రాజెక్టు విస్తరణకు 2023 ఫిబ్రవరిలో ప్రజాభిప్రాయ సేకరణ జరిపింది. అప్పట్లో మానవ హక్కుల వేదిక ప్రతినిధులు తీవ్రంగా వ్యతిరేకించారు. 2024 ఫిబ్రవరిలో అనుమతులు వచ్చాయి. కేంద్ర పర్యావరణ, కాలుష్య నియంత్రణ శాఖల అధికారులను ప్రలోభపెట్టి అనుమతులు తెచ్చుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ ఫ్యాక్టరీ అనుమతులను సాకుగా చూపి టీజీ గ్రూప్ కూడా పావులు కదిపేందుకు సిద్ధమైంది. భరత్ టీడీపీ కూటమి ప్రభుత్వంలో మంత్రి.. టీజీ వెంకటేశ్ బీజేపీ సీనియర్ నాయకుడు కావడం, కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉండడంతో అనుమతులు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
నివేదికలో ముప్పును తొక్కిపెట్టి
పీటీఎఫ్‌ఈ ఉత్పత్తికి ఏ రసాయనాలు ముడి పదార్థాలుగా వాడతారు? టెక్నాలజీ ఎవరి నుంచి కొనుగోలు చేస్తారు? ఎలాంటి వ్యర్థాలు వెలువడతాయి..? ప్రమాదకర రసాయనాలను ఏం చేస్తారు? అనే వివరాలను ప్రభుత్వానికి సమర్పించిన ఈఐఏ (పర్యావరణ ప్రభావ అంచనా నివేదిక)లో టీజీ గ్రూప్ స్పష్టం చేయకపోవడం గమనార్హం.
ప్రాణాలు ముఖ్యమా.. ఆదాయం ముఖ్యమా!
అత్యంత విషపూరిత రసాయనాలు వెలువడే టీజీ ఫ్యాక్టరీకి అనుమతులివ్వొద్దు. కృష్ణా జలాలు రెండు రాష్ట్రాలకు ప్రాణాధారం. తుంగభద్ర, కృష్ణా జలాలు విషపూరితం అయితే దీర్ఘకాలిక, ప్రాణాంతక వ్యాధులతో జన జీవనం ఛిన్నాభిన్నం అవుతుంది. ప్రజల ప్రాణాల కంటే ఏదీ ప్రభుత్వాలకు ముఖ్యం కాకూడదు. కేవలం ఆదాయం కోసం టీజీ భరత్, టీజీ వెంకటేశ్ కాలుష్యకారక ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నారు.
– రామకృష్ణారెడ్డి, ప్రజాస్వామ్య సంఘాల ఐక్య వేదిక కన్వినర్
గ్రామసభను కూడా రద్దు చేయాలి
ప్రపంచ దేశాలు నిషేధించిన రసాయనాలు ఇక్కడ తయారు చేయడం దుర్మార్గం ఆర్22, ఆర్23, పీటీఎఫ్‌ఈ తయారీలో సాంకేతిక, ప్రమాద నిర్వహణ వివరాలు, టీఎఫ్‌ఈ, పీఎఫ్‌ఐబీ లాంటి ప్రమాదకర రసాయనాల ప్రభావం ప్రస్తావనే లేదు. గ్రామసభను కూడా రద్దు చేయాలి.
– అల్లాబక్ష్, పౌరహక్కుల సంఘం జిల్లా కార్యదర్శి
ప్రపంచంలో నిషేధం.. మనదగ్గర అనుమతా?
ప్రజలు, జీవరాశి పాలిట అత్యంత ప్రమాదకరమైన రసాయనాలను ప్రపంచ దేశాలు నిషేదిస్తున్నాయి. కానీ, కర్నూలులో వాస్తవాలు దాచి పెట్టి అనుమతులు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. కృష్ణా జలాలు వినియోగించే ప్రాంతాలతో పాటు గాలి కాలుష్యం ద్వారా ఏపీ, తెలంగాణలో తీవ్ర ప్రభావం ఉంటుంది. గ్రామసభను రద్దు చేయాలి. కంపెనీ ప్రతినిధులతో వాస్తవాలు చెప్పించాలి. నష్టం అంచనా వేసి ప్రజల శ్రేయస్సు దృష్ట్యా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి.
– డాక్టర్ బాబూరావు, శాస్త్రవేత్త, హైదరాబాద్