టీడీపీ మంత్రి అనుచరుల రాక్షసకాండ | TDP Minister Ram Prasad followers attacks | Sakshi
Sakshi News home page

టీడీపీ మంత్రి అనుచరుల రాక్షసకాండ

Mar 23 2026 4:46 AM | Updated on Mar 23 2026 4:46 AM

TDP Minister Ram Prasad followers attacks

స్పృహ కోల్పోయిన కసినేని రామానుజులమ్మ

మారణాయుధాలతో చెలరేగిన పచ్చగూండాలు 

మాధవరం గురికానివాండ్లపల్లెపై దాడి 

దొరికినవారిని దొరికినట్టు చితక్కొట్టి భీతావహం

పోలీసుల సమక్షంలోనే దాడులు

రాయచోటి: అన్నమయ్య జిల్లా రాయచోటి రూరల్‌ మండలం మాధవరం గురికానివాండ్లపల్లెలో టీడీపీ మంత్రి రాంప్రసాద్‌ అనుచరులు మరో రాక్షస కాండ సాగించారు. మారణాయుధాలతో చెలరేగిపోయారు. కట్టెలు, రాడ్లు, రాళ్లు, మందుబాటిళ్లతో దాడులు చేశారు. నివాస గృహాల్లో పిల్లలు, పెద్దలు, మహిళలు అన్న తేడా లేకుండా దొరికిన­వారిని దొరికినట్టు చితక్కొట్టి తీవ్రంగా గాయపరి­చారు. దాడిలో 20 మందికిపైగా గ్రామస్తులు గాయపడ్డారు. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ఘటన గ్రామంలో యుద్ధవాతావరణాన్ని తలపించింది. 

సేకరించిన వివరాల ప్రకారం.. గురికానివాండ్లపల్లెకు  2023లో అంగన్‌వాడీ కేంద్రం మంజూరైంది. అయితే స్థానికంగా ఉన్న ఒకరు కోర్టుకు వెళ్లి స్టే తేవడంతో అప్పట్లో నిర్మాణ పనులు ఆగిపోయాయి. తరువాత కూట­మి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్మించిన పునాదులను పెకలించేందుకు మంత్రి అనుచరులు యత్నిస్తున్నారు. దీనిలోభాగంగానే మంత్రి అనుచరులు జేసీబీతో ఆదివారం ఆ గ్రామానికి వచ్చారు. పునాదులు పెకలించేందుకు యత్నించడంతో గ్రామస్తులు అడ్డుకు­న్నారు. దీంతో మంత్రి అనుచరుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. 

వెంటనే రాయచోటి నుంచి  20 వాహనాల్లో పచ్చ గూండాలు భారీగా గ్రామానికి చేరుకుని గ్రామస్తులపై దాడులకు తెగబడ్డారు. మారణాయు­ధాలతో స్వైరవిహారం చేశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న పోలీసులు చేష్టలుడిగి చోద్యం చూస్తుండిపో­యా­రు. కనీసం నిలువరించకుండా ప్రేక్షకపాత్ర పోషించారు. దాడుల్లో బాలినేని మనోజ్‌ తలకు బలమైన గాయాల­య్యాయి. కసినేని రామాను­జులమ్మ  స్పృహ­తప్పి పడి­పో­యారు. చంటిబిడ్డ తల్లి  రెడ్డిరాణి తీవ్రంగా గాయపడ్డారు. పెయింటర్‌ మల్లికార్జున, అనారోగ్యంతో మంచాన ఉన్న వృద్ధుడు రామదాసుతో­పాటు మరో 15మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు.    

మంత్రి అనుచరుల దురాగతమే
మంత్రి రాంప్రసాద్‌ రెడ్డి అనుచరులు వంద మందికిపైగా వచ్చి మా గ్రామస్తులపై దాడి చేశారు. సిద్దార్థగౌడ్‌ అనే వ్యక్తి తనవెంట వచ్చిన వారితో కలిసి ఈ దాడికి తెగబడ్డారు. ఇలాంటి దాడులను అరికట్టాల్సిన పోలీసులు చోద్యం చూశారే తప్ప నిలువరించలేదు.   – విశ్వనాథ నాయుడు, ఎంపీటీసీ, మాధవరం  

Advertisement
 
Advertisement
Advertisement