టీడీపీని వీడని నిరాశ, నిస్పృహలు... వేర్‌ ఈజ్‌ ద ‘పార్టీ’!

TDP Leader Chandrababu actual Political situation Andhra Pradesh - Sakshi

గెలిచిన ఎమ్మెల్యేల్లోనే 30 శాతం మంది దూరం.. దూరం

అప్పట్లో హవా నడిపించిన నాయకులిప్పుడు తెరచాటుకు

రాష్ట్రంలో 68 నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జులే లేరు

పార్టీ పదవులిస్తామంటున్నా... మాకొద్దంటున్న నేతలు

చివరకు జీతాలిచ్చి మరీ అనుబంధ సంఘాలకు నియామకం

సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: చచ్చీచెడి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల్లో 20 శాతం మంది తెలుగుదేశం పార్టీతో సంబంధం లేకుండానే కొనసాగుతున్నారు. మిగిలిన వారిలోనూ ఇద్దరు ముగ్గురిది.. అంటే మరో 10 శాతానిది అంటీముట్టని వ్యవహారశైలే. వీటికి తోడు అధికారంలో ఉన్నప్పుడు అంతా తామై హవా చెలాయించిన నాయకులంతా ఇపుడు పార్టీ క్రియాశీలక వ్యవహారాలకు దూరంగా ఉండి... అజ్ఞాతాన్ని ఆశ్రయించారు.

ఎవరికి వారు ఈ పార్టీతో ఒరిగేదేమీ లేదని భావిస్తుండటంతో 68 నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జిలను కూడా నియమించలేని  దుస్థితిలో పడిపోయారు చంద్రబాబు. టీడీపీని యుద్ధానికి సిద్ధం చేయటం కుదిరే పనికాదని ఆయనకు స్పష్టంగా అర్థం కావటంతో... పొత్తుల కోసం తిరగని దారంటూ లేక తీవ్రమైన నిస్పృహకు లోనవుతున్నారు. తను చెప్పినట్టల్లా వినే జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను వ్యూహం ప్రకారం కావాలనుకున్నపుడల్లా కలుస్తూ... తామిద్దరం కలిస్తే ఏదో అద్భుతం జరిగిపోతుందనే సంకేతాలివ్వటానికి తాపత్రయపడుతున్నారు.

ప్రతిసారీ ‘ప్రజాస్వామ్య పరిరక్షణ’ ముసుగు మాత్రమే వేసుకోవాల్సి రావటం కూడా ఆయనలో నిరాశా నిస్పృహలను పెంచేస్తోంది. అది ఎప్పటికప్పుడు ఆయన మాటల్లో కనిపిస్తూనే ఉంది. కాకపోతే బాబు కొమ్ము కాయటం ఒక్కటే తెలిసిన ‘ఈనాడు’కు టీడీపీలోని ఈ అస్తవ్యస్త పరిస్థితులు కనిపించకపోవటం... వైఎస్సార్‌ ïసీపీలో అక్కడక్కడా ఉండే అసంతృప్తి మాత్రమే కనిపించటం పెద్ద విచిత్రమేమీ కాదు. 

ఇదీ టీడీపీ వాస్తవ స్థితి 
తెలుగుదేశానికి ఆది నుంచీ మీడియా బలం ఎక్కువే. పత్రికలతో ఆరంభమైన ఈ జాఢ్యం... ఎలక్ట్రానిక్‌ మీడియా విస్తరిస్తున్న కొద్దీ ఛానెళ్లకూ అంటుకుంది. బలమైన బలగాలను పెట్టుకునే ధనబలం ఉండటంతో ఈ ధోరణి సోషల్‌ మీడియాకూ వ్యాపించింది. జనంలో తప్ప అన్నిరకాల మీడియాలోనూ తెలుగుదేశం బలంగా కనిపించటానికి ఇప్పటికీ ఇదే కారణం. అగ్రనేతలు సైతం ప్రయివేటుగా మాట్లాడేటపుడు ‘పార్టీ లేదు... బొక్కా లేదు’ అంటూ వాస్తవాలు చెప్పటం... మీడియా మైకుల ముందుకు వచ్చేసరికి పాలక పక్షంపై తీవ్ర విమర్శలతో రెచ్చిపోవటం మనకి తెలియనిదేమీ కాదు.

ఫోటోలు వీడియోల కోసం మీడియా సమావేశాలు పెట్టడమే తప్ప పార్టీ పరంగా క్రియాశీలక కార్యక్రమాలేవీ లేవు. చంద్రబాబు పిలుపునిచ్చినా స్పందించే పరిస్థితి లేదు. ‘బాదుడే బాదుడు’ అనే కార్యక్రమం పెట్టినా అది ఫ్లాప్‌ కావడంతో దాని పేరు మార్చి ‘ఇదేం ఖర్మ’ నినాదం అందుకున్నారు. దానిక్కూడా పెద్ద స్పందన లేకపోవటంతో జనాన్ని తెచ్చి ఇరుకు రోడ్లపై సభలు పెట్టడం... వారిని డ్రోన్లతో చిత్రించి తన మీడియాలో బీభత్సంగా చూపించటమనే వ్యూహాన్ని ఎంచుకున్నారు. కానీ  కందుకూరులో అది బెడిసికొట్టింది. 8 మంది ప్రాణాలు కోల్పోవటంతో... జనాన్ని రప్పించడానికి కానుకల ఎర వేశారు. అక్కడ కూడా మాట నిలబెట్టుకోలేక ముగ్గురిని బలితీసుకున్నారు. 

‘కుప్పం’లోనూ ఓటమి భయం! 
175 స్థానాల్లో 68 చోట్ల ఇన్‌ఛార్జిలు లేకున్నా... ఇన్‌ఛార్జిలు ఉన్నచోట కూడా వారు కార్యకర్తలను, పార్టీని పట్టించుకోవడం లేదని నిత్యం చంద్రబాబు గగ్గోలు పెడుతున్నారు. పార్టీ మహా ఘనంగా ఉన్నట్లు చెప్పే కృష్ణా జిల్లాలోనే నాలుగు నియోజకవర్గాల్లో పార్టీని పట్టించుకునే నాథుడు లేడంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పిలిచి పార్టీ పదవులిస్తామన్నా తీసుకునేందుకు టీడీపీ నాయకులెవరూ ముందుకు రాకపోవటంతో... కొందరికి నెల వారీ జీతాలు ఇచ్చి అనుబంధ సంఘాల అధ్యక్షులుగా నియమించుకున్నారు.

ఒకప్పుడు తమది అత్యధిక సభ్యత్వం ఉన్న పార్టీ అని ఘనంగా చెప్పిన టీడీపీ అధినేత... ఇపుడు అందులో దాదాపు 20 శాతం కూడా లేరనే వాస్తవాన్ని జీరి్ణంచుకోలేకపోతున్నారు. నిజానికి 2019లో సార్వత్రిక ఎన్నికల ఘోరపరాజయం... తర్వాత జరిగిన పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్, కార్పొరేషన్‌ ఎన్నికల్లోనూ వెంటాడింది. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లోనూ అదే కథ. చివరకు 1989 నుంచి గెలుస్తూ చంద్రబాబు తన అడ్డాగా చెబుతున్న కుప్పంలోనూ టీడీపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయింది.

అక్కడి 87 శాతం పంచాయతీల్లో వైఎస్సార్‌సీపీ జెండా ఎగరేసింది. నియోజకవర్గంలోని 4 మండల పరిషత్‌ అధ్యక్ష పదవులను, నాలుగు జడ్పీటీసీ స్థానాలనూ గెలిచి క్లీన్‌ స్వీప్‌ చేసింది. కుప్పం కంచుకోట కూలిపోవటంతో దిక్కుతోచని బాబు... అక్కడ సొంత ఇల్లు కట్టుకునే ప్రయత్నాల్లో పడటమే కాక... పదేపదే తన నియోజకవర్గానికి వెళ్తూ ర్యాలీలు, సభలు నిర్వహిస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. వచ్చే ఎన్నికల్లో కుప్పం కూడా దక్కదేమోనన్న భయంతోనే... బాబు అనుకూల మీడియా ఈ ‘కుంపట్లు’ రాజేస్తోంది.  

కుంపట్లు కాదిక్కడ... దహించే కార్చిచ్చు 
రాయలసీమలో వైఎస్సార్‌ సీపీ నేతల్లో అసంతృప్తి కుంపట్లు రగులుతున్నాయనేది రామోజీ ప్రవచిత వార్త. నిజానికి అధికారంలో ఉన్న పార్టీలో స్థానికంగా దిగువన ఎంతో కొంత అసంతృప్తి ఉండటం  సహజం. దాన్ని చక్కదిద్దటానికే ప్రాంతీయ స్థాయిలో కో–ఆర్డినేటర్లు, నియోజకవర్గాల్లో సమన్వయ కర్తలు, పరిశీలకులు నిరంతరం పనిచేస్తున్నారు. వారు సమీక్షల్లో కొన్ని వర్గాలు తమ అసంతృప్తిని వ్యక్తం చేయటమనేది అసాధారణమేమీ కాదు. దీన్ని ‘రగులుతున్న కుంపట్ల’తో పోల్చిన రామోజీ రావుకు... తెలుగుదేశాన్ని దహించేస్తున్న కార్చిచ్చు మాత్రం కనపడలేదు. 

టీడీపీలో అంతర్గత పోరు విషయానికొస్తే శ్రీకాకుళం జిల్లాలో కళా వెంకట్రావు, అచ్చెంనాయుడి మధ్య విభేదాలు తారస్థాయిని చేరాయి. అచ్చెన్నాయుడిని రాష్ట్ర అధ్యక్షుడి పదవి నుంచి తప్పించాలని పార్టీ పొలిట్‌ బ్యూరో సమావేశంలోనే కళా వెంకట్రావు డిమాండ్‌  చేశారు. ఉమ్మడి విజయనగరంలో అశోక్‌ గజపతిరాజు తీరును మెజారిటీ నేతలు వ్యతిరేకిస్తుండగా... ఉమ్మడి విశాఖ జిల్లాలో గంటా శ్రీనివాసరావు బాబు పిలుపులకు స్పందించటమే మానేశారు.

విలేకరుల సమావేశాల్లో అయ్యన్న, బండారు కలిసి కనిపించినా... లోలోపల ఒకరంటే ఒకరు రగిలిపోతున్నారు. ‘తూర్పు’లో గోరంట్ల, చినరాజప్ప, యనమల, అదిరెడ్డి వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తూనే ఉంది. ‘కృష్ణా’ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే టీడీపీకి అంత మంచిది. కేశినేని నాని, బుద్ధా వెంకన్న, బోండా ఉమా, దేవినేని ఉమా వర్గాలు రోజూ రోడ్డున పడుతూనే ఉన్నాయి. రాయలసీమ జిల్లాల్లో ఆ పార్టీకి సరైన నాయకత్వమే లేదు.

చూడాల్సింది.. జనం నాడి! 
స్థానికంగా ఉండే అధికార పార్టీ నాయకుల్లో ఎంతో కొంత అసంతృప్తి సహజం. అది ఎటుతిరిగీ సర్దుకునేదే. ఇక్కడ ముఖ్యంగా చూడాల్సింది జనం ఏమనుకుంటున్నారనేది కదా? ప్రభుత్వం పట్ల, అధికారంలో ఉన్న పార్టీ పట్ల జనం ఎలా ఫీలవుతున్నారనేది కదా? ఇపుడు రాష్ట్రంలో 87 శాతం ఇళ్లకు ప్రభుత్వ పథకాలు నేరుగా చేరుతున్నాయి. గ్రామాల్లో ఇది ఏకంగా 92 శాతం.

ఆ ఇళ్లలో ఉండేవారి పేర్లతో సహా ఎవరెవరికి ఎంత మేలు చేశామో అంకెలతో సహా వివరిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. గతంలో  మాదిరి జన్మభూమి కమిటీలు లేవు. నేతల సిఫారసులు అక్కర్లేదు. అర్హతే ప్రామాణికంగా అందరికీ పథకాలు అందుతున్నాయి. జనం దీనికి జై కొడుతున్నారు కనకే... ప్రతి ఎమ్మెల్యే, సమన్వయకర్త తన నియోజకవర్గంలోని ప్రతి గడపకూ వెళ్లి వారి ఆశీస్సులు తీసుకోగలుగుతున్నాడు. 

సంస్కరణల విప్లవం 
స్వాతంత్య్రం వచ్చాక గడిచిన 75 ఏళ్లలో ఈ స్థాయి సంస్కరణలను ఈ రాష్ట్రమే కాదు! దేశంలోని ఏ రాష్ట్రమూ చూడలేదనే చెప్పాలి. సమాజంలోని ప్రతి వర్గానికీ మెరుగైన జీవితాన్నిచ్చేలా, జీవనాన్ని సులభతరం చేసేలా విప్లవాత్మక సంస్కరణలు తెచ్చారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి. ప్రతి 50 ఇళ్లకూ ఓ వలంటీరును ఏర్పాటు చేసి పింఛన్లు నేరుగా అవ్వాతాతల ఇళ్లకే పంపిస్తున్నారు.  

గ్రామ స్థాయిలో సచివాలయాలు ఏర్పాటు చేసి గ్రామ వ్యవహారాలన్నీ అక్కడే పరిష్కరించటం కాక... అక్కడే భూ రిజిస్ట్రేషన్లు కూడా జరిపే స్థాయికి తీసుకొచ్చారు. ‘నాడు–నేడు’ పేరిట కార్పొరేట్‌ను తలదన్నేలా స్కూళ్లను తీర్చిదిద్దటమే కాక... ఆసుపత్రుల రూపురేఖలూ మార్చారు. రైతు భరోసా కేంద్రాలు, విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లు వీటికి తోడవటంతో... గ్రామాల ముఖచిత్రమే మారిపోయింది. స్కూళ్లను అందంగా తీర్చిదిద్దటమే కాక.. విద్యార్థులను స్కూళ్లకు పంపించే తల్లులకు ‘అమ్మ ఒడి’ పేరిట నగదు అందజేస్తున్నారు.

విద్యా సంవత్సరం ఆరంభం కాకముందే పుస్తకాలతో పాటు యూనిఫామ్, సాక్సులు, షూ, బెల్టు ఇలా మొత్తం సెట్‌ను అందిస్తున్న జగనన్న విద్యాకానుక... మధ్యాహ్నం రుచికరమైన భోజనాన్ని అందిస్తున్న ‘జగనన్న గోరుముద్ద’... కుట్రలకు ఎదురీది తెచ్చిన ఇంగ్లీషు మీడియం... అగ్రగామి ఎడ్యుటెక్‌ సంస్థ ‘బైజూస్‌’ 5వ తరగతి నుంచీ విద్యార్థులకిస్తున్న విలువైన కంటెంట్‌... పాఠాలు సులువుగా అర్థంమయ్యేలా తెలుగు– ఇంగ్లీషుల్లో ముద్రిస్తున్న పుస్తకాలు... 8వ తరగతి విద్యార్థుల చేతికి వచ్చిన విలువైన ట్యాబ్‌లు... ఉన్నత విద్య చదువుతున్నవారికిస్తున్న విద్యాదీవెన, వసతి దీవెన... ఇవన్నీ రాష్ట్ర విద్యా రంగంపై ముఖ్యమంత్రి చూపిస్తున్న శ్రద్ధకు నిలువెత్తు నిదర్శనాలు.

‘నాడు–నేడు’లో ఇప్పటికే రూపు మార్చుకున్న స్కూళ్లలో వచ్చే ఏడాది నుంచీ ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానెల్స్‌ ఉండే డిజిటల్‌ క్లాస్‌రూమ్‌లు అందుబాటులోకి వస్తున్నాయంటే... విద్యకిస్తున్న ప్రాధాన్యం అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ చూస్తున్నారు కనకే... జనం మళ్లీ ఆశీస్సులివ్వటానికి సిద్ధంగా ఉన్నారన్నది వైఎస్సార్‌ సీపీ విశ్వాసం. 

వైద్యం, వ్యవసాయం... ఊహించని ముందడుగు 
మెరుగైన వైద్య సేవలే కాదు. ఫ్యామిలీ డాక్టర్లు సైతం ఊళ్లకే వస్తున్నారంటే ఇది ఏ స్థాయి మార్పో తెలియకమానదు. 10,032 వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లతో గ్రామాల్లోనే 12 రకాల వైద్య సేవలు, 14 రకాల పరీక్షలు, 67 రకాల మందులు అందుతున్నాయి. టెలీమెడిసిన్‌ ద్వారా నిపుణుల సేవలు చేరువయ్యాయి. 2019కి ముందు... ఆస్పత్రుల్లో శిశువులను ఎలుకలు పీక్కుతిన్న అధ్వాన్న స్థితులు, సెల్‌ఫోన్‌ వెలుతురులో సర్జరీలు చేసిన ఘటనలు చూశాక ప్రజలకు ప్రభుత్వాస్పత్రులపై నమ్మకం పోయింది.

ఈ పరిస్థితుల్ని చక్కబెడుతూ ‘నాడు–నేడు’ పేరిట రూ.16వేల కోట్లకు పైగా నిధులతో ఆసుపత్రులను సంస్కరించారు వైఎస్‌ జగన్‌. వైద్యులు, సిబ్బంది కొరత లేకుండా ఏకంగా 47వేలకు పైగా పోస్టులను భర్తీ చేశారు. ‘ఆరోగ్య శ్రీ’లో 1,059 చికిత్సలు మాత్రమే అందుబాటులో ఉండగా... ఆ సంఖ్యను ఏకంగా 3,255కు పెంచారు. ఫలితంగానే 2019 నుంచి గత ఏడాది డిసెంబర్‌ నెలాఖరు వరకూ 57 లక్షల మంది ఉచితంగా వైద్య సేవలు పొందగా... వారికోసం ప్రభుత్వం రూ.12,353 కోట్లు ఖర్చు చేసింది. అందుకే జనంలో ఈ పార్టీకి అంతటి ఆదరణ. 

దేశానికే ఆదర్శంగా... ఆర్బీకే 
సచివాలయాలకు అనుబంధంగా గ్రామ స్థాయిలో విత్తు నుంచి విక్రయం వరకు రైతులను చేయి పట్టి నడిపించేలా 10,778 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌. 14,413 మంది సిబ్బంది వీటిలో సేవలందిస్తుండగా, ప్రతి ఆర్బీకేకి ఓ వలంటీర్‌తో పాటు వీటికి 9277 మంది బ్యాంకింగ్‌ కరస్పాండెంట్లను అనుసంధానించారు. ఆర్బీకేల్లోని కియోస్‌్కల ద్వారా బుక్‌ చేసుకున్న 24 గంటల్లోనే సర్టిఫై చేసిన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులను అందిస్తున్నారు.

ఈ–క్రాపింగ్‌ కూడా ఇక్కడే అందుతోంది. అన్నీ అందించటమే కాదు. పండించిన పంటను కొనుగోలు చేయడమూ ఇక్కడే. అందుకే ఈ వ్యవస్థ ప్రపంచ దేశాలకే రోల్‌ మోడల్‌ అవుతోంది. అద్దెకు యంత్ర పరికరాలను రైతులకివ్వాలన్న సంకల్పంతో కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేశారు. 2వేల డ్రోన్లు కూడా రైతులకు అందుబాటులోకి రాబోతున్నాయి.

ఇంకా వేబ్రిడ్జ్‌లు, 2536 బహుళ ప్రయోజన కేంద్రాలు,  1134 గోదాములు నిర్మాణంలో ఉన్నాయి. నియోజకవర్గ స్థాయిలో 147 వైఎస్సార్‌ ఇంటిగ్రేటెడ్‌ అగ్రి ల్యాబ్స్‌ ఏర్పాటు చేస్తుండగా... ఇప్పటికే 70 వరకు అందుబాటులోకి వచ్చాయి. పాడి పశువుల కోసం అంబులెన్స్‌లు... స్వదేశీ గోజాతిని పెంపొదించేందుకు 58 యూనిట్లు వచ్చాయి. మరో 55 రాబోతున్నాయి. అమూల్‌ సహకార సంస్థను తెచ్చి రాష్ట్ర పాడి రైతుల కష్టానికి తగ్గ ఫలితాన్ని ఇప్పిస్తున్నారు ముఖ్యమంత్రి.  

రైతు భరోసా పేరిట ప్రతి రైతు ఖాతాలో ఏడాదికి రూ.13,500 జమ చేస్తున్న ప్రభుత్వం... వారిపై పైసా భారం పడకుండా ఉచిత పంటల బీమానూ అమలు చేస్తోంది. లక్ష లోపు పంట రుణాలు తీసుకొని సకాలంలో చెల్లించిన రైతులకు సీజన్‌ ముగియకుండానే వడ్డీ రాయితీ అందించటమే కాదు... ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతుకు సీజన్‌ ముగియకుండానే పెట్టుబడి రాయితీని, ఆ సీజన్‌ మళ్లీ వచ్చేలోగా బీమా మొత్తాన్ని అందిస్తున్నారు.

ఖర్చుకు వెనకాడకుండా రైతులకు పూర్తి ఉచితంగా పగటిపూట 9 గంటల నాణ్యమైన విద్యుత్‌ అందిస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే రైతుకు ఈ రకంగా అండగా నిలిచిన ప్రభుత్వం చరిత్రలోనే కనిపించదు. ఇప్పుడు రాష్ట్ర రైతాంగం యావత్తూ వైఎస్సార్‌ సీపీ వెంట ఉన్నదంటే కారణం ఇదే మరి. రకరకాల సంక్షేమ పథకాలతో అసహాయులకు అండగా నిలవటమే కాదు... అర్హత ఉండి కూడా ఏ పథకమైనా దక్కకపోతే వారిని గుర్తించి మరీ అందజేస్తోంది ప్రభుత్వం.

అందుకే జనమంతా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి నేరుగా కనెక్ట్‌ అవగలుగుతున్నారు. ఆ విశ్వాసంతోనే ముఖ్యమంత్రి సైతం ఈ సారి 175 స్థానాల్లోనూ ఎందుకు గెలవలేం? అనే ప్రశ్న వేసుకుని... దాన్ని సమాధానం సాధించే దిశగా తన టీమ్‌ను నడిపిస్తున్నారు. ఆ భయంతో పొత్తుల కోసం పరుగులుపెడుతున్న చంద్రబాబును ఏదో ఒకలా లేపటానికి, వైఎస్సార్‌సీపీ విషయంలో లేని గందరగోళాన్ని సృష్టించడానికి రామోజీ తనకు చేతనైనంత మేర రాస్తున్నారు. అయినా జనం నమ్మటం లేదని రగిలిపోతున్నారు. ఆ సెగలోంచి పుట్టుకువస్తున్నవే... ఈ కుంపట్లు!!.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top