సమన్వయంతో పనిచేయాలి | Supreme Court directed AP Govt And State Election Commission to work in coordination | Sakshi
Sakshi News home page

సమన్వయంతో పనిచేయాలి

Jan 26 2021 4:45 AM | Updated on Jan 26 2021 4:45 AM

Supreme Court directed AP Govt And State Election Commission to work in coordination - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: పంచాయతీ ఎన్నికల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం సమన్వయంతో పనిచేయాలని సుప్రీంకోర్టు సూచించింది. పంచాయతీ ఎన్నికల విషయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిర్ణయాన్ని సమర్థిస్తూ హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్, జస్టిస్‌ రుషీకేష్‌ రాయ్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఎన్నికల వాయిదాకు నిరాకరించింది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల వివాదంలో, ఎన్నికల కమిషనర్‌ నిర్ణయాల్లో జోక్యం చేసుకోబోమని పేర్కొంది.

ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గి వాదనలు వినిపిస్తూ.. ఈ నెల 16న ప్రారంభమైన కరోనా వ్యాక్సినేషన్‌లో భాగంగా లక్షలాది మంది ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు టీకా ఇవ్వాల్సిన ప్రక్రియ పూర్తికాక ముందే ఎన్నికల నిర్వహణ సరికాదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వ్యాక్సినేషన్‌ కార్యక్రమం జరుగుతుండగా ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని అన్నారు. కరోనా వ్యాక్సిన్‌ భద్రత, పకడ్బందీ పంపిణీ బాధ్యత పోలీసులదేనని, వారికి ఫిబ్రవరి తొలివారంలో వ్యాక్సిన్‌ ఇవ్వాల్సి ఉందని తెలిపారు.

వైద్యులు, పారామెడికల్‌ సిబ్బంది, ఉపాధ్యాయులు.. ఇలా ఎన్నికలతో ముడిపడి ఉన్న అనేక మంది సిబ్బందికి వ్యాక్సిన్‌ ఇవ్వాల్సి ఉందన్నారు. ఎన్నికల విధుల్లో పాలుపంచుకోబోయే 94 వేల మంది పోలీసులు సహా ఐదు లక్షల మంది సిబ్బందికి వ్యాక్సిన్‌ వేయాల్సి ఉందన్నారు. ఎన్నికలు, వ్యాక్సినేషన్‌ ముఖ్యమేనన్న హైకోర్టు.. ఆ రెండింటిలో ఏది ముందు జరపాలి అన్న విషయాన్ని స్పష్టంగా చెప్పలేదని, వ్యాక్సినేషన్‌ కాకుండా ఎన్నికల విధుల్లో పాల్గొనాలని పోలీసులకు చెప్పలేం కదా అని ముకుల్‌ రోహత్గి కోర్టుకు తెలిపారు.  

వాస్తవాలు వివరిస్తున్నాం.. 
ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఇలాగే కోర్టుకు వస్తున్నారని ధర్మాసనం వ్యాఖ్యానించగా.. వాస్తవం వివరిస్తున్నామని ముకుల్‌ రోహత్గి తెలిపారు. దేశంలో ఎక్కడా ఎన్నికలు జరగడం లేదా అని ధర్మాసనం ప్రశ్నించగా.. వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ఓ పద్ధతిగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోందని రోహత్గి వివరించారు. విజయవంతంగా వ్యాక్సినేషన్‌ పూర్తి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. హెల్త్‌ వర్కర్స్‌కు జనవరి చివరికల్లా వ్యాక్సినేషన్‌ పూర్తవుతుందని, ఆ తర్వాత కనీసం నాలుగు వారాలు సమయం ఇచ్చి.. మార్చి 1 నుంచి ఎన్నికల నిర్వహణ చేపట్టేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. తాము ఏ కోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకం కాదని వ్యాక్సినేషన్‌ నేపథ్యంలోనే వాయిదా కోరుతున్నామని ధర్మాసనానికి తెలిపారు.  

ప్రతి ఒక్కరి విధుల్ని మేం నిర్ణయించలేం 
జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌ స్పందిస్తూ.. ‘వాస్తవ పరిస్థితి వేరేలా ఉండి ఉండొచ్చు. కానీ, మహమ్మారి సమయంలోనూ కేరళలో ఎన్నికలు జరిగాయి. ప్రతి ఒక్కరి విధులను మేం నిర్ణయించలేము. కొన్ని నిర్ణయాలు ఎన్నికల కమిషనర్‌ తీసుకోవాల్సి ఉంటుంది’ అని అభిప్రాయపడ్డారు. ఎన్జీవోల తరఫు సీనియర్‌ న్యాయవాది పరాగ్‌ త్రిపాఠి వాదనలు వినిపిస్తూ.. మూడు వారాల పాటు ఎన్నికలు వాయిదా వేయాలని కోరారు. కేరళలో ఎన్నికల అనంతరం కేసులు పెరిగిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్‌ వ్యవహారంలో ఇతరుల జోక్యం తగదన్న ధర్మాసనం.. అథారిటీల మధ్య ఇగో వల్లనే ఈ పరిస్థితికి (లాలెస్‌నెస్‌) కారణంగా భావిస్తున్నామని పేర్కొంది.

మూడు వారాలు వాయిదా వేయాలని పరాగ్‌ చేసిన విజ్ఞప్తిని కూడా ధర్మాసనం తోసిపుచ్చింది. పిటిషన్‌ను కొట్టివేస్తున్నామని పేర్కొంది. వైద్యుల తరఫు సీనియర్‌ న్యాయవాది సాజన్‌పూవయ్య వాదనలు ప్రారంభించగా.. వైద్యులంటే గౌరవం ఉందని, కానీ అందరిలాగానే వాయిదా కోరుతున్నారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఉద్యోగుల తరఫున సీనియర్‌ న్యాయవాది బీహెచ్‌ మర్లపల్లే వాదనలు ప్రారంభిస్తుండగా.. ఉద్యోగుల వైఖరిని ధర్మాసనం తప్పుపట్టింది. బహిరంగ ప్రకటనలు చేయడం సరికాదని పేర్కొంది. మార్చిలో ఎన్నికలు నిర్వహించాలని మర్లపల్లే విజ్ఞప్తి చేశారు. అసలు ఉద్యోగుల జోక్యమే సరికాదని పేర్కొన్న ధర్మాసనం పిటిషన్లు కొట్టివేస్తున్నట్లు పేర్కొంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement