
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తుల స్టోరేజి సమస్యకు చెక్ పడింది. ప్రభుత్వ ప్రోత్సాహంతో పెద్దఎత్తున స్టోరేజి సామర్థ్యాన్ని పెంచుకుంటున్న రాష్ట్ర గిడ్డంగుల సంస్థ వ్యాపార విస్తరణతో లాభాల బాటపట్టింది. టీడీపీ హయాంలో పట్టించుకోకపోవడంతో లాభాలంటే ఏమిటో ఎరుగని సంస్థ ఇప్పుడు రికార్డు స్థాయిలో లాభాలు ఆర్జిస్తోంది. 4 వేల టన్నుల సామర్థ్యంతో 1958లో ఏర్పాటైన గిడ్డంగుల సంస్థ 2018 నాటికి 6 లక్షల టన్నుల సామర్థ్యానికి చేరుకుంది. అంటే 6 లక్షల టన్నులకు చేరుకోడానికి ఏకంగా 60 ఏళ్లు పట్టింది. ప్రభుత్వరంగ సంస్థల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తుండటంతో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ సామర్థ్యం పెరగడంతోపాటు వ్యాపార లావాదేవీలు సైతం ఊహించని స్థాయిలో పెరిగాయి.
2019–21 మధ్య కొత్తగా 2.40 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో కూడిన గోదాములు అందుబాటులోకి రాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22)లో మరో 72,600 టన్నుల సామర్థ్యంతో కూడిన గోదాములను ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తోంది. ప్రభుత్వరంగ సంస్థల అవసరాల కోసం రాష్ట్ర గిడ్డంగుల సంస్థను నోడల్ ఏజెన్సీగా ప్రభుత్వం నియమించింది. దీనివల్ల అందుబాటులో ఉన్న ప్రైవేట్ గోదాములను అద్దెకు తీసుకుని వ్యవసాయ ఉత్పత్తుల్ని నిల్వ చేసే వెసులుబాటు కలిగింది. ఆ మేరకు మరో 8.15 లక్షల టన్నుల సామర్థ్యంతో ప్రైవేట్ గోదాములు అందుబాటులోకి వచ్చాయి.
కలిసొచ్చిన పంట ఉత్పత్తుల సేకరణ
ధరలు పతనమవుతున్న సమయంలో మార్కెట్‌లో జోక్యం చేసుకుని కనీస మద్దతు ధర లభించని వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం రూ.3 వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. గడచిన రెండేళ్లలో ఈ విధంగా మార్కెట్‌లో కనీస మద్దతు ధర దక్కని వ్యవసాయ ఉత్పత్తులను పెద్దఎత్తున సేకరించి రైతులను ఆదుకుంది. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో ఆహార ఉత్పత్తుల సేకరణ జరుగుతుండటంతో వాటిని నిల్వ చేసేందుకు గోదాముల అవసరం ఏర్పడింది. దీంతో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ పెద్దఎత్తున గోదాములు నిర్మించడం కలిసొచ్చింది. పౌర సరఫరాల సంస్థ, మార్క్‌ఫెడ్, నాఫెడ్ వంటి ప్రభుత్వ రంగసంస్థలు సేకరించిన ఉత్పత్తులను వీటిలో నిల్వ చేసుకునే అవకాశం ఏర్పడింది. దీంతో ఊహించని స్థాయిలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ వ్యాపారలావాదేవీలు పెరిగాయి.
రికార్డు స్థాయిలో వ్యాపార లావాదేవీలు
టీడీపీ హయాంలో ఏనాడూ రూ.100 కోట్ల మార్కు దాటని గిడ్డంగుల సంస్థ వ్యాపారం 2019–20లో రూ.135.27 కోట్లకు చేరింది. తద్వారా రూ.51.70 కోట్లు, 2020–21లో రూ.188.90 కోట్ల వ్యాపారంతో రూ.84.57 కోట్ల లాభాలను గిడ్డంగుల సంస్థ ఆర్జించింది. 2021–22లో తొలి అర్ధ సంవత్సరంలో ఇప్పటికే రూ.97.75 కోట్ల వ్యాపారం చేసింది. ఈ ఏడాది లాభాలు సైతం రూ.100 కోట్ల మార్కును దాటుతుందని అంచనా వేస్తున్నారు.
మంచి లాభాలొస్తున్నాయి
గతంలో ఇంత పెద్దఎత్తున వ్యాపారం వ్యాపారం చేయలేదు. ప్రభుత్వ ప్రోత్సాహంతో గోదాముల సామర్థ్యాన్ని పెంచుకోగలిగాం. గతంలో ఎన్నడూ లేనివిధంగా వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వం పెద్దఎత్తున కొనుగోలు చేస్తుండటం వల్ల వాటిని నిల్వ చేసేందుకు మా గోదాములు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఆ మేరకు వ్యాపార లావాదేవీలు పెరగడంతో సంస్థకు మంచి లాభాలొస్తున్నాయి. గోదాముల సంఖ్యను మరింతగా పెంచుకునేందుకు కృషి చేస్తున్నాం.
– శ్రీకంఠనాథరెడ్డి, వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ