Palasa: లక్ష్మీపురంలో ప్రతి ఇంటిలో ఒక ప్రభుత్వ ఉద్యోగి

Srikakulam District: Every Household Has a Government Employee in Lakshmipuram - Sakshi

అత్యధిక శాతం ఉపాధ్యాయులే

వివిధ ప్రభుత్వ శాఖల్లో గ్రూప్‌ వన్‌ ఆఫీసర్లు   

పలాస: శ్రీకాకుళం జిల్లా లక్ష్మీపురం.. పలాస మండలంలోని ఓ చిన్న గ్రామం. జాతీయ రహదారికి అతి సమీపంలోని పచ్చని పొలాల మధ్య కొలువుదీరి ఉంటుందీ ఊరు. 356 గడపలు ఉన్న ఈ పల్లెకు ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ ప్రతి ఇంటిలోనూ ఓ ప్రభుత్వ ఉద్యోగి కనిపిస్తాడు. అందులో అధిక శాతం మంది ఉపాధ్యాయులే. సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో కూడా ఈ ఊరి వారు చక్కగా రాణించారు. ఈ గ్రామానికి చెందిన వ్యక్తులు ఒకసారి ఎమ్మెల్యేగా, సమితి అధ్యక్షులుగా కూడా పనిచేశారు. 

ఊరిలో 90 శాతం మంది అక్షరాస్యులు కావడం గమనార్హం. కేవలం అక్షరాస్యులుగానే కాకుండా చదువుకున్న ప్రతి ఒక్కరూ ఉన్నత ఉద్యోగాలు సాధించడం విశేషం. ఒకరికి మించి ఒకరు ఉపాధ్యాయ రంగంలో అత్యధిక శాతం ఉద్యోగులు కాగా గ్రూప్‌ వన్‌ అధికారులు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు, డాక్టర్లు, ఇంజినీర్లు, ఎన్‌ఆర్‌ఐలు, ఆర్మీలోనూ ఈ ఊరి వారు ఉద్యోగులుగా ఉన్నారు. ఆర్డీవో స్థాయి అధికారులు కూడా ఉన్నారు. ఈ గ్రామంలో మొత్తం 1213 మంది జనాభా ఉన్నారు. 356 ఇళ్లు ఉన్నాయి. గ్రామంలో అన్నీ పక్కా భవనాలతో అన్ని వీధుల్లో కూడా సిమెంటు రోడ్లతో ఊరిని చూడచక్కగా తీర్చిదిద్దుకున్నారు.  

గతమెంతో ఘనం.. 
ఈ గ్రామానికి సుమారు 200 ఏళ్ల చరిత్ర ఉంది. పలాస మండలం తర్లాకోట జమిందారీ పాలనలో ఈ గ్రామంలోనే మస్తాదారు ఉండేవాడు. భూమి శిస్తు వసూలు చేసి జమిందారుకు ఇచ్చేవాడు. ఇక్కడ మస్తాదారు ఉండటంతో తరచుగా తర్లాకోట జమీందారు వచ్చి వెళ్తుండేవాడని గ్రామానికి చెందిన సీనియర్‌ సిటిజన్లు చెబుతున్నారు. అలా రాకపోకలు ఎక్కువగా సాగడంతో ఈ గ్రామంలోనే జమీందారు క్యాంపు కోర్టు కూడా నిర్వహించేవాడని స్థానికులు చెబుతున్నారు. ఈ గ్రామంలో ముందుగా సవర లక్ష్మయ్య అనే గిరిజన కుటుంబం ఉండేదని, అతని పేరు వల్లనే లక్ష్మీపురం అని నామకరణం చెందిందని ఇక్కడి వారు చెబుతుంటారు. ఈ గ్రామంలోని దువ్వాడ వంశానికి చెందిన ఒక ధనిక రైతు కుటుంబంతో తర్లాకోట జమీందారుకు మిత్తరికం కూడా ఉండేదని, తర్లాకోట జమీన్‌లో లక్ష్మీపురం గ్రామానికి ఈ విధంగా ఒక ప్రత్యేకత ఉండేదని గ్రామ పెద్దలు చెబుతున్నారు.  


మా ఇంటిలో ఇద్దరం ఉద్యోగస్తులమే
 
మాకు వ్యవసాయ భూములు ఉన్నాయి. సుమారు 10 ఎకరా లు ఉంది. అయినా మా కుటుంబంలో ఇద్దరికీ ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి. నేను ఉపాధ్యాయునిగా ఉద్యోగ విరమణ చేశాను. మా అన్నయ్య సత్యనారాయణ ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం నేనే స్వయంగా వ్యవసాయం చేస్తున్నాను.   
– బమ్మిడి వాసుదేవరావు, రిటైర్డ్‌ టీచర్, లక్ష్మీపురం,పలాస మండలం 

ఉపాధ్యాయుల ఊరు
మా గ్రామంలో అత్యధిక స్థాయిలో ఉపాధ్యాయులు ఉన్నారు. నేను కూడా ఉపాధ్యాయ కొలువు సంపాదించేవాడిని. ముందుగా వేరే రంగంలో స్థిర పడిపోవడం వల్ల అటువైపు వెళ్ల లేకపోయాను. ఇప్పుడు జనరేషన్‌ కూడా ప్రభుత్వ ఉద్యోగాలవైపే మక్కువ చూపుతున్నారు. పోటీ పడి చదువుతున్నారు. వ్యవసాయ భూములు ఉన్నా ఉద్యోగాలే చేస్తున్నారు. మా గ్రామంలో ఇంటికి ఒకరు, ఇద్దరు ఉద్యోగస్తులు ఉన్నారు.  
– అల్లు రమణ, ఎంఏబీపీఈడీ, లక్ష్మీపురం, పలాస మండలం 


స్వయం కృషితోనే ఉద్యోగాలు 

మా గ్రామంలో ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగాలు పొందారంటే దానికి కారణం స్వయం కృషి, పట్టుదల, పోటీ తత్వం ప్రధాన కారణం. వివిధ ప్రభుత్వ శాఖల్లోని అన్ని రంగాల్లో కూడా మా గ్రామానికి చెందిన వారు ఉన్నారు. నేను కూడా ముందుగా గ్రూప్‌ వన్‌కి ఎంపికయ్యాను. అడిషనల్‌ ఎస్పీగా విశాఖపట్నంలో విధులు నిర్వహిస్తున్నాను. క్రమ శిక్షణతో విద్యను అభ్యసిస్తే ప్రభుత్వ ఉద్యోగం చాలా సులభంగా వస్తుందని మా గ్రామమే దానికి ఒక ఉదాహరణ.    
– బమ్మిడి శ్రీనివాసరావు, అడిషనల్‌ ఎస్పీ (స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ జాయింట్‌ డైరెక్టర్‌) విశాఖ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top