ఉద్దానంలో అద్భుత ద్వీపం, కానీ సంబంధాలు రావట్లే!

special story on uddanam Andhra pradesh - Sakshi

ఉత్తరాంధ్రలో ఏకైక లంక గ్రామం పూడిలంక

అపురూపమైన ప్రకృతి అందాలతో అలరారుతున్న గ్రామం

అక్కడి ప్రజల జీవన శైలీ ప్రత్యేకమే

పర్యాటక అభివృద్ధికి బోలెడు అవకాశాలు

చుట్టూ జలనిధి.. పక్కనే సముద్ర తీరం.. చిత్తడి నేలలు.. ఓ మూలన మడ చెట్లు.. బుళుక్‌ బుళుక్‌మనే బుల్లి కెరటాల సవ్వడులు.. పక్షుల కిలాకిలా రావాలు.. తెరలు తెరలుగా తాకే చిరుగాలి.. అల్లంత దూరాన నువ్వుల రేవు బ్రిడ్జి.. అక్కడి నుంచి చూస్తే విసిరేసినట్టుండే బెస్త గ్రామాలు.. ఎత్తైన బెండి కొండలు.. వీటిమధ్య ఓ అద్భుత ద్వీపంలా అలరారే పూడిలంక గ్రామం ప్రకృతి ప్రేమికులను రా.. రమ్మని స్వాగతం పలుకుతుంటుంది. పర్యాటకంగా కాస్తంత అభివృద్ధి చేస్తే ఎందరినో అక్కున చేర్చుకుని అలరిస్తానంటోంది. ఆ ఊరి సంగతుల వైపు మనమూ ఓ లుక్కేద్దాం పదండి.

పూడిలంక గ్రామానికి వెళ్లే మట్టి గట్టు 

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/వజ్రపుకొత్తూరు రూరల్‌: సిక్కోలుకు వరదలొస్తే మొట్టమొదట ఉలిక్కిపడే గ్రామమిది. వారధి లేని కారణంగా సమస్యల ముఖచిత్రంతోనే ఈ గ్రామం శ్రీకాకుళం జిల్లా వాసులకు పరిచయం. అందరికీ కనిపించే ఆ మట్టి బాట దాటి ఊళ్లోకి అడుగు పెడితే మరో ప్రపంచం తెరుచుకుంటుంది. అపురూపమైన అందాలతో మర్చిపోలేని అనుభూతులను ఇస్తుంది. వంతెన నిర్మించి.. పర్యాటకంగా అభివృద్ధి చేస్తే పూడిలంక గ్రామం సిక్కోలు కీర్తి కిరీటంలో మరో కలికితురాయిగా నిలబడిపోతుంది. వజ్రపుకొత్తూరు మండలంలోని పూడిలంక ఉత్తరాంధ్రలోనే ఏకైక లంక గ్రామం. బోటు ప్రయాణం, ప్రజల జీవన శైలి పర్యాటకులు మదిని దోచేస్తుంటాయి. 

ఏడు కుటుంబాలతో మొదలై...
దాదాపు 110 ఎకరాల విస్తీర్ణంలో 180 ఏళ్ల కిందట కేవలం 7 కుటుంబాలతో ఈ గ్రామం ఆవిర్భవించిందని చెబుతారు. ప్రస్తుతం గ్రామంలోని కుటుంబాల సంఖ్య 68. ఏళ్ల తరబడి ఇక్కడి ప్రజలు ప్రకృతి వ్యవసాయ పద్ధతిలోనే పంటల్ని సాగు చేస్తున్నారు. ఈ గ్రామం పేరు చెప్పి ఎలాంటి పంటలు విక్రయించినా హాట్‌కేకుల్లా అమ్ముడుపోతాయి. ప్రధానంగా ఈ గ్రామంలో వరి, రాగులు, దేశవాళీ టమాటా, వంకాయ, జీడి పంటలను పండిస్తున్నారు. సరైన రహదారి లేకపోవడంతో బయటకు వెళ్లి కూలి పనులు చేసుకోలేని పరిస్థితుల్లో గ్రామ ప్రజలు ఈ పంటలను సాగు చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు.

గత ప్రభుత్వం హయాంలో రూ.1.30 కోట్లతో అరకొరగా నిర్మించిన రోడ్డు 

పుట్టెడు కష్టాలకూ నిలయం
ఈ గ్రామం ప్రకృతి అందాలకే కాదు పుట్టెడు సమస్యలకు నిలయంగానే ఉంది. గ్రామం చుట్టూ సముద్రం నీరు ఉండటంతో కొన్నేళ్ల క్రితం జయశ్రీ సాల్ట్‌ కంపెనీ కాలిబాట నిర్మించింది. అయితే, వరదల ఉధృతికి కాలిబాట పాడైపోయింది. 2018లో అప్పటి ప్రభుత్వం రూ.1.30 కోట్లతో కాలిబాట నిర్మాణానికి శంకుస్థాపన చేసింది. పనులు చేపట్టినా నిధులు సరిపోలేదని అర్ధంతరంగా ఆపేశారు. ఈ గ్రామానికి పల్లివూరు నుంచి కిలోమీటరుకు పైగా బోటు ప్రయాణం చేయాల్సిందే. విపత్తుల సమయంలో ప్రజలు బాహ్య ప్రపంచానికి రావడానికి అనేకకష్టాలు పడుతున్నారు.సరైన రోడ్లు, కాలిబాటలు లేకపోవడంతో బోటుపై ప్రయాణం చేయాల్సిన పరిస్థితి. చిన్నపాటి వరదలు, తుపాన్లు సంభవించినపుడు వారికి బయట ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోతాయి. అత్యవసర పరిస్థితిల్లో స్థానిక యువకులే బాధితులను మంచంపై మోసుకువస్తారు. గ్రామంలో ప్రాథమిక పాఠశాల మాత్రమే ఉండటంతో అక్కడి పిల్లలు ప్రాథమిక విద్య వరకే పరిమితమవుతున్నారు. గ్రామంలో సుమారు 300 మంది జనాభా ఉండగా కేవలం ఒక్కరు మాత్రమే ఇంజినీరింగ్‌ పూర్తి చేశారు. మరో యువకుడు ఆర్మీలో కొలువు సాధించాడు. స్థానికంగా ఉపాధి కరువవ్వడంతో యువకులు కువైట్, దుబాయ్, సింగపూర్, ఖాండ్లా,  పారాదీప్, కోల్‌కతా, హైద్రాబాద్, చెన్నై తదితర ప్రాంతాలకు వలసపోతున్నారు.

ఆల్చిప్పలకు భలే డిమాండ్‌
మగవారు వ్యవసాయ, కూలి పనులు చేస్తే..మహిళలు మాత్రం గ్రామం చుట్టూ ఉన్న ఉప్పు పరలో దొరికే ఆల్చిప్పలను సేకరిస్తూ జీవనం సాగిస్తున్నారు. వీటి మాంసానికి మంచి డిమాండ్‌ ఉండటంతో మహిళలు వాటిని సేకరిస్తూ సోల రూ.5 చొప్పున అమ్ముతున్నారు. కేజీ ఆల్చిప్పల మాంసం రూ.250 ధర పలుకుతుంది. కాగా పరలో దొరికే గుల్లలను కూడా సేకరించి అమ్ముతారు. వీటిని సున్నం, ముగ్గు తయారీకి వినియోగిస్తారు. ట్రాక్టర్‌ గుల్లలు రూ.4,500 నుంచి రూ.6 వేల వరకు ధర పలుకుతాయి. దీంతో పాటుగా పశు పోషణకు అధిక ప్రాధాన్యమిస్తారు. 

ఆల్చిప్పల మాంసం
ఆల్చిప్పలే ఆధారం:ఉప్పు పరలో దొరికే కన్ను చిప్పలను సేకరించి వాటిలో ఉండే మాంసాన్ని అమ్ముకుని జీవనోపాధి సాగిస్తున్నాం. రోజాంతా ఈ చిప్పలను సేకరిస్తే రూ.200 నుంచి రూ.300వరకు వస్తుంది. కన్ను చిప్ప మాంసం మూలవ్యాధికి మందుగా పని చేస్తుంది. వీటిని తినేందుకు చాలామంది ఆసక్తి చూపడంతో మంచి గిరాకీ ఉంది –బొర్ర సావిత్రి, గృహిణి

కాలిబాట పూర్తి చేయండి
జయశ్రీ సాల్ట్‌ కంపెనీ నిర్మించిన కాలిబాట వరదల ఉద్ధృతికి పాడైంది. టీడీపీ హయాంలో రూ.1.30 కోట్లతో కాలిబాట నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దాదాపుగా 350 మీటర్లు వరకు పనులు జరగ్గా అర్ధంతరంగా ఆగిపోయాయి. అధికారులు స్పందించి కాలిబాట పనులు పూర్తి చేయాలి.– బత్సల దుర్యోధనరావు, రైతు

సంబంధాలు రావడం లేదు 
గ్రామానికి పూర్తిగా రహదారి లేకపోవడంతో యువతీ యువకులకు పెళ్లిళ్లు కుదరడం లేదు. ఊళ్లో వారికి పిల్లలను ఇచ్చేందుకు ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో చాలామంది ఆవివాహితులుగా మిగిలిపోతున్నారు.
– బొర్ర పార్వతి, గృహిణి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top