 
													శింగనమల నియోజకవర్గంలో చెలరేగిపోతున్న మట్టిమాఫియా
బుక్కరాయసముద్రం మండలం పసలూరు జగనన్న కాలనీలో మట్టి దోపిడీ
ఓ ముఖ్య ప్రజాప్రతినిధి తల్లి అండతో రెచ్చిపోయిన అక్రమార్కులు
ఈ ఫొటో చూసి చెరువో, నీటి కుంటో అని అనుకుంటే మీరు పొరపడినట్లే. బుక్కరాయసముద్రం మండలం పసులూరు లేఔట్‌లోని జగనన్న కాలనీ ఇది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఇక్కడ పెద్ద సంఖ్యలో ఇంటి నిర్మాణాలు చేపట్టే క్రమంలో పునాదుల వరకు నిర్మాణం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇష్టారాజ్యంగా మట్టి తవ్వకాలు చేపట్టారు. రాబందుల్లా మారి పునాది మట్టిని సైతం తరలించేశారు.

లక్ష్మీదేవి అనే మహిళ అనంతపురంలో మూడు దశాబ్దాలుగా అద్దె ఇంట్లో ఉంటూ చిన్నాచితక పనులు చేసుకుంటూ పొట్ట పోసుకుంటోంది. గత ప్రభుత్వంలో పసులూరులోని జగనన్న లేఔట్‌లో ఆమెకు స్థలం కేటాయించి ఇల్లు మంజూరు చేశారు. అప్పట్లోనే పునాది వరకు ఇంటి నిర్మాణం జరిగింది. సొంతింటి కల నెరవేరుతోందని లక్ష్మీదేవి ఆనందపడుతున్న సమయంలోనే ప్రభుత్వం మారడంతో ఆమె కల పటాపంచలైంది. ఇంటి చుట్టూ ఎర్రమట్టిని ‘తమ్ముళ్లు’ మేసేయడంతో నేడు ఇంటి స్థలమే నామరూపాల్లేకుండా పోయింది. దీంతో ఆమె ఆవేదన అంతా ఇంతా కాదు.
అనంతపురం: అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలంలోని పసలూరు గ్రామంలో గత ప్రభుత్వ హయాంలో 33 ఎకరాల్లో అధునాతన సౌకర్యాలతో జగనన్న లేఔట్‌ను ఏర్పాటు చేశారు. అనంతపురం నగరంలో అద్దె ఇళ్లలో నివసిస్తూ అవస్థలు పడుతున్న రెండు వేల మంది నిరుపేదలకు ఇక్కడ ఇళ్లపట్టాలు పంపిణీ చేశారు.
ఒక్కో ఎకరాకు రూ.13 లక్షలు వెచ్చించి ప్రభుత్వమే భూమిని కొనుగోలు చేసి పేదలకు ప్లాట్లు పంపిణీ చేసింది. కోట్లాది రూపాయలు వెచ్చించి రోడ్లు, విద్యుత్ సౌకర్యం కల్పించింది. అప్పట్లోనే 600 ఇళ్లకు పునాదుల వరకూ నిర్మాణం కూడా పూర్తి చేసింది.
నామరూపాల్లేకుండా.. 
కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎర్రమట్టి దోపిడీకి తెరలేపిన ‘తమ్ముళ్లు’ పసలూరు జగనన్న లేఔట్‌పై పడ్డారు. అనంతపురం నగరానికి 9 కిలోమీటర్ల దూరంలోనే ఉండడంతో ఇదే అదనుగా జేసీబీ, టిప్పర్లతో రాత్రీ పగలూ తేడా లేకుండా టిప్పర్ ఎర్రమట్టిని రూ.7 వేలకు అమ్మి సొమ్ము చేసుకున్నారు. రోజూ 100 టిప్పర్ల లెక్కన రూ.7 లక్షల చొప్పున జేబుల్లోకి వేసుకున్నారు. 
ఇష్టారాజ్యంగా తమ్ముళ్లు సాగించిన మట్టి దోపిడీతో జగనన్న లేఔట్ నేడు నామరూపాల్లేకుండా పోయింది. లేఔట్‌లోని ఇళ్ల పునాదుల చుట్టూ అడుగుల లోతుకు తవ్వడంతో నివాసయోగ్యానికి ఏ మాత్రమూ అనుకూలంగా లేదు. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టినా మళ్లీ లేఔట్ వేసేందుకు సాధ్యం కాని దుస్థితి నెలకొంది.
సింహభాగం సొమ్ము ‘అమ్మ’కే.. 
కూటమి అధికారంలోకి వచ్చాక శింగనమల నియోజకవర్గ పరిధిలో మట్టికొండలు కరిగిపోతున్నాయి. ఇసుక, గ్రావెల్, మట్టితో సహా దొరికిన సహజ సంపదనంతా లూటీ చేస్తున్నారు. కీలక ప్రజాప్రతినిధి తల్లికి ప్రతి నెలా రూ. లక్షల్లో ముట్టజెబుతూ ముఠాలుగా ఏర్పడి మరీ తరలిస్తున్నారు. ‘అమ్మ’ ఆశీర్వాదంతో పగలూ, రాత్రి తేడా      లేకుండా ఎర్రమట్టిని తరలిస్తూ జేబులు నింపుకుంటున్నారు. 
పసలూరు జగనన్న కాలనీలో కొల్లగొట్టిన ఎర్రమట్టి సొమ్ములో సింహభాగం ‘అమ్మ’కే సమర్పించినట్లు తెలిసింది. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం చూసీచూడనట్లు ఉండడం గమనార్హం. ఎర్రమట్టి టిప్పర్లు పసలూరు, కొత్తపల్లి, ఉప్పరపల్లి గ్రామాల మీదుగా రాకపోకలు సాగించడంతో ఆ మార్గమంతా అధ్వానంగా మారింది. అయినా అటు వైపు కన్నెత్తి చూసేందుకు కూడా అధికారులు ధైర్యం చేయలేకపోతున్నారు.
సెంటు భూమి ఇవ్వని బాబు సర్కారు.. 
చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత పేదలకు ఒక్క సెంటు భూమి ఇవ్వలేదు. అదిగో.. ఇదిగో అంటూ కాలం వెళ్లదీస్తోంది. ఈ క్రమంలోనే గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన స్థలాలను సైతం తమ్ముళ్లు మాయం చేయడంతో బాధితులు ఆవేదన చెందుతున్నారు.  

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
