విశాఖ భూ కుంభకోణం: సిట్‌ విచారణ ప్రారంభం

SIT Begins Probe Into Visakhapatnam Land Scam - Sakshi

సర్క్యూట్‌ హౌస్‌లో కమిటీ సమావేశం 

మూడు నెలల్లో దర్యాప్తు పూర్తికి సన్నాహాలు  

సాక్షి, మహారాణిపేట (విశాఖ దక్షిణ): తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విశాఖలో చోటుచేసుకున్న భూ కుంభకోణాలపై వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) విచారణ మళ్లీ మొదలైంది. కరోనా వల్ల ఈ ఏడాది మార్చి నెల నుంచి విచారణ నిలిచిపోయింది. ప్రస్తుతం వైరస్‌ తీవ్రత తగ్గుముఖం పట్టడంతో సిట్‌ చైర్మన్‌ డాక్టర్‌ విజయకుమార్‌ శనివారం విశాఖ చేరుకుని కమిటీతో భేటీ అయ్యారు. ప్రభుత్వ సర్క్యూట్‌ హౌస్‌లో చైర్మన్‌ విజయకుమార్, సభ్యులు వై.వి.అనురాధ, భాస్కరరావు సమావేశమై దర్యాప్తుఫై చర్చించారు. కమిటీ ఇప్పటికే మధ్యంతర నివేదిక ప్రభుత్వానికి సమర్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో రెండు, మూడు నెలల్లో విచారణ పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. గతంలో సిట్‌ వద్ద పనిచేసిన ఉప కలెక్టర్‌ శేష శైలజ, తహసీల్దార్‌ తిరుమలరావుకు ఇటీవల బదిలీ అయ్యింది. వారి స్థానంలో సిట్‌కు అవసరమైన సిబ్బందిని నియమించేందుకు ఉన్నతాధికారులు సన్నాహాలు చేస్తున్నారు.  

సిట్‌ దృష్టికి 1400ల దరఖాస్తులు 
గత ఏడాది అక్టోబర్‌లో సిట్‌ను ప్రభుత్వం నియమించింది. అనంతరం నవంబర్‌ ఒకటి నుంచి 7వ తేదీ వరకు సిట్‌ బృందం సిరిపురం వుడా ఆడిటోరియంలో దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 1400ల దరఖాస్తులురాగా ఇప్పటి వరకు 400లు ఫిర్యాదులకు సంబంధించి విచారణ పూర్తి చేశారు. ఇంకా 1000 దరఖాస్తులపై దర్యాప్తు చేపట్టాల్సి ఉంది. రెండు, మూడు నెలల్లో వీటి విచారణ పూర్తి చేయాలన్న లక్ష్యంతో సిట్‌ బృందం పనిచేస్తోంది. ఎన్‌వోసీలు, భూ స్థితి మార్పు, రికార్డుల  ట్యాంపరింగ్, ప్రభుత్వ స్థలాలు ప్రైవేటు వ్యక్తులకు, సంస్థలకు కట్టబెట్టడం... తదితర అంశాలపై విచారిస్తున్నారు.
 
13 మండలాల్లో భూ కుంభకోణాలు 
జిల్లాలోని 13 మండలాల్లో గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో భూ కుంభకోణాలు జరిగినట్టుగా సిట్‌ బృందం గుర్తించింది. విశాఖ రూరల్, ఆనందపురం, పద్మనాభం, భీమిలి, నగర పరిధిలోని మహారాణిపేట, ములగాడ, గోపాలపట్నం, సీతమ్మధార, గాజువాక, పెదగంట్యాడ, సబ్బవరం, పరవాడ, పెందుర్తి మండలాల్లో భూ కుంభకోణాలు జరిగాయని గతంలో ఆరోపణలు వచ్చాయి.

గత ప్రభుత్వ హయాంలో భూ రికార్డులు తారుమారు చేయడం, ట్యాంపరింగ్, వెబ్‌ల్యాండ్‌లో పేర్లు మార్పు చేయడం, అక్రమంగా ఎన్‌వోసీలు జారీ చేయడం, భూ సర్వే నెంబర్లు దిద్దడం, ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం, జిరాయితీ భూముల్లో పెద్దల పేర్లు చేర్చడం, తాత ముత్తాతల నుంచి భూమి స్వాధీనంలో ఉన్నప్పటికీ రాత్రికి రాత్రే పేర్లు మార్పు చేయడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఎన్‌వోసీలు కూడా ఇబ్బడిముబ్బడిగా జారీ చేసేశారు. స్వాతంత్య్ర సమరయోధులు, ఎక్స్‌సరీ్వసెమెన్‌లకు చెందిన భూములను ఇతరులకు ఇచ్చే విషయంలోనూ ఎన్‌వోసీలు ఇష్టారాజ్యంగా జారీ చేసేశారు. వీటిని కూడా సిట్‌ పరిశీలించనుంది. సమగ్రంగా దర్యాప్తు చేపట్టి నివేదిక సిద్ధం చేయడంపై దృష్టి సారిస్తున్నారు.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top