
సాక్షి, విశాఖ: ఏపీలో కూటమి ప్రభుత్వ పాలనలో సింహాచలం అప్పన్న బంగారు ఆభరణాలకు శటగోపం పెట్టారు. భక్తులు ఇచ్చిన విలువైన బంగారు ఆభరణాల అపహరణకు గురైనట్టు సమాచారం. ఆభరణాల లెక్క తేలకపోవడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వివరాల ప్రకారం.. సింహాచలం అప్పన్న ఆలయంలో లెక్కా పత్రం లేకుండా విరాళాల నిర్వహణ సేకరణ జరిగింది. దీనిపై కమిటీ వేసి విచారణ చేపట్టినా.. ఆభరణాల లెక్కను మాత్రం అధికారులు చెప్పలేదు. విచారణ కమిటీ ఏర్పాటు చేసి నాలుగు నెలలు గడుస్తున్నా లెక్కలు చెప్పకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పలు ఆభరణాలు అపహరణకు గురైనట్టు భక్తులు చెబుతున్నారు. అప్పన్న ఆలయంలో బంగారం అపహరణపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. అనుబంధ ఆలయాల్లో ఉన్న ఆభరణాలపై కూడా నీలి నీడలు కమ్ముకున్నాయి.
ఇదిలా ఉండగా.. అంతకుముందు సింహాచలం అప్పన్న ఆభరణాలపై వివాదం నెలకొంది. అప్పన్న ఆభరణాలు అపహారణకు గురయ్యాయంటూ గత ఏడాది విశాఖ జిల్లా కలెక్టర్‌కు ప్రభాకరాచారి ఫిర్యాదు చేశారు. ఆభరణాల విషయంలో వాస్తవాలు తేల్చేందుకు ఆలయ ఉన్నతాధికారులు కమిటీ వేశారు. కమిటీ ఎటువంటి విచారణ చేపట్టకపోవడంతో మరోసారి ప్రభాకరాచారి.. కలెక్టర్‌కు అర్జీ పెట్టారు. అనంతరం, కమిటీ విచారణ చేస్తుందని ఆలయ అధికారులు ప్రకటించారు. కానీ, కమిటీ సభ్యులు విచారణ చేయలేదు. భక్తులు ఇచ్చే బంగారు ఆభరణాల వివరాలు నమోదు చేసే రికార్డ్ కూడా మెయింటైన్ చేయడం లేదని ప్రభాకరాచారి ఆరోపిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగా అప్పన్న భక్తుల్లో ఆందోళన నెలకొంది.