మటన్‌ మార్ట్‌ల ప్రతిపాదన లేదు

Sidiri Appala Raju Comments on Mutton Marts - Sakshi

అది శాఖాపరమైన పరిశీలన

రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మటన్‌ మార్ట్‌ల ఏర్పాటు ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో లేదని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి అప్పలరాజు స్పష్టం చేశారు. ఈ విషయంలో విపక్షాలు, ఎల్లో మీడియా అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ఒక ప్రకటనలో విమర్శించారు. సర్టిఫై చేసిన మత్స్య ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో ఇప్పటికే ఆక్వాహబ్‌లు, స్పోక్స్, మినీ అవుట్‌లెట్స్‌ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అదేరీతిలో అపరిశుభ్ర వాతావరణంలో అమ్మకాలు జరుగుతున్న మాంసపు ఉత్పత్తులను సర్టిఫై చేసి పరిశుభ్ర వాతావరణంలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని శాఖాపరంగా ఆలోచన చేసినట్లు పేర్కొన్నారు. ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్న వారి ద్వారానే హైజినిక్‌ కండిషన్‌లో నగరాలు, పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన మినీ రిటైల్‌ అవుట్‌లెట్ల ద్వారా నాణ్యమైన మాంసపు ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని భావించినట్లు తెలిపారు.

వీటిద్వారా ఈ రంగంలోనే స్థిరపడిన యువతకు సబ్సిడీపై ఆర్థిక చేయూత ఇవ్వడం ద్వారా వారిని సమర్థులైన వ్యాపారులుగా తీర్చిదిద్దాలని ఆలోచించినట్లు తెలిపారు. ఇది శాఖాపరంగా పరిశీలనలో ఉందే తప్ప ప్రతిపాదనస్థాయిలోగానీ, ప్రభుత్వ పరిశీలనలోగానీ లేదని పేర్కొన్నారు. వీటిపై ఇప్పటివరకు ప్రభుత్వంగానీ, సీఎం వైఎస్‌ జగన్‌గానీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. మత్స్య ఉత్పత్తుల వినియోగాన్ని పెంచేందుకు ఆక్వాహబ్‌ల తరహాలోనే నాణ్యమైన మాంసపు ఉత్పత్తుల విక్రయాల ద్వారా వాటికి బ్రాండ్‌ ఇమేజ్‌ తీసుకురావాలని ఆలోచించినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో వీటిని ఏర్పాటు చేయాలన్న ఆలోచన లేదని స్పష్టం చేశారు. విపక్షాలతో పాటు సోషల్‌ మీడియాలో కొంతమంది పనిగట్టుకొని రాద్ధాంతం చేయడం తగదని ఆయన పేర్కొన్నారు.

ధైర్యంగా ఉండండి బహ్రెయిన్‌ కార్మికులతో మాట్లాడిన మంత్రి అప్పలరాజు
కాశీబుగ్గ: బహ్రెయిన్‌లో ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులతో మంత్రి డాక్టర్‌ అప్పలరాజు కాశీబుగ్గలోని తన క్యాంపు కార్యాలయం నుంచి ఆదివారం ఫోన్‌లో మాట్లాడారు. ‘ఉపాధికోసం వెళితే.. చిత్రహింసలు’ శీర్షికన ఆదివారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం చూసి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఏపీ నాన్‌ రెసిడెన్షియల్‌ తెలుగు అసోసియేషన్‌తో మాట్లాడి అక్కడి ప్రభుత్వంతో చర్చిస్తామని తెలిపారు. పనిచేసే చోట ఇబ్బందుల దృష్ట్యా స్వదేశానికి, అందులో మన ప్రాంతానికి వచ్చేయాలని అనుకుంటే మాట్లాడతామని, మన ప్రభుత్వం తరఫున పూర్తి సాయం అందిస్తామని చెప్పారు. కార్మికులు, కుటుంబసభ్యులు ధైర్యంగా ఉండాలని, అక్కడి పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు తమకు తెలియజేయాలని సూచించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top