‘మత్తు’ వదిలిస్తున్న ‘ఆపరేషన్‌ నయా సవేరా’ 

SEB Special Activity For Drug Prevention - Sakshi

ఎస్‌ఈబీ ప్రత్యేక కార్యాచరణ

దాడులు.. అవగాహన కార్యక్రమాలు 

రాష్ట్ర వ్యాప్తంగా 2,176 కిలోల గంజాయి స్వాధీనం

కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పైలట్‌ ప్రాజెక్టుగా అమలు 

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఏళ్ల తరబడి ఉన్న మాదకద్రవ్యాల ‘మత్తు’ వదిలించేందుకు స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ) రంగంలోకి దిగింది. గంజాయి తదితర మాదకద్రవ్యాల నిరోధానికి ‘ఆపరేషన్‌ నయా సవేరా’ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన సేవలను అందిస్తూ ముందుకు సాగుతున్న తరుణంలో సమాజంలో మాదకద్రవ్యాలు రుగ్మతగా మారాయి. దీంతో ఈ మహమ్మారిని నిర్మూలించాలంటూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించడంతో డీజీపీ డి.గౌతమ్‌ సవాంగ్‌ సూచనల మేరకు ఎస్‌ఈబీ ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఎస్‌ఈబీ కమిషనర్‌ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందాలను ఏర్పాటు చేశారు. మాదకద్రవ్యాల రవాణా, వినియోగాన్ని కట్టడి చేసేందుకు పైలట్‌ ప్రాజెక్టుగా ‘ఆపరేషన్‌ నయా సవేరా’ పేరుతో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో విస్తృత కార్యక్రమాలు చేపట్టారు.

గతనెల 25 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించిన విస్తృత దాడుల్లో గుంటూరు జిల్లాలో 22 కేసులు నమోదు చేసి 44 మందిని అరెస్టు చేయడంతోపాటు 59.7 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కృష్ణాజిల్లాతోపాటు విజయవాడ నగరంలో 10 కేసులు నమోదు చేసి 12 మందిని అరెస్టు చేసి 19 కిలోల గంజాయిని స్వా«దీనం చేసుకున్నారు. గతనెల 29న గుంటూరు అర్బన్, విజయవాడలో ఎస్‌ఈబీ బృందాలు దాడులు నిర్వహించి 4 గ్రాముల ఎండీఎంఏ (సింథటిక్‌ డ్రగ్స్‌) స్వాధీనం చేసుకుని నలుగురుని అరెస్టు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 174 మందిపై 69 కేసులు నమోదు చేసి 2,176 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

కృష్ణా, గుంటూరు జిల్లాలపై ఫోకస్‌ 
గంజాయి ఇతర మాదకద్రవ్యాలను అరికట్టేందుకు పైలట్‌ ప్రాజెక్టుగా కృష్ణా, గుంటూరు జిల్లాలపై ప్రధానంగా ఫోకస్‌ పెట్టినట్టు ఎస్‌ఈబీ కమిషనర్‌ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ ‘సాక్షి’కి చెప్పారు. ఈ రెండు జిల్లాల్లోను క్షేత్రస్థాయిలో 179 కార్యక్రమాలు నిర్వహించి 24 వేలమందికి అవగాహన కలి్పంచినట్టు తెలిపారు. డ్రగ్స్‌ ప్రమాదంపై ర్యాలీలు, సదస్సులు, హోర్డింగ్‌ల ఏర్పాటు చేశామన్నారు. మత్తు పదార్థాల గురించి తెలిస్తే కంట్రోల్‌ రూమ్‌లకు సమాచారం అందించాలని ఆయన కోరారు.

చదవండి:
పరువు కోల్పోయేకంటే ఇదే బెటర్..  
జగనన్నను కలిశాకే.. ఈ కాళ్లకు చెప్పులు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top