తీరంలో కొత్త మొలక! | Sea moss cultivation begins in coastal areas | Sakshi
Sakshi News home page

Sea moss: తీరంలో కొత్త మొలక!

May 14 2025 5:33 AM | Updated on May 14 2025 5:37 PM

Sea moss cultivation begins in coastal areas

సముద్రపు నాచు సాగుకు శ్రీకారం 

మామిడికుదురు మండలంలో తొలి అడుగు  

చైనా, జపాన్‌లో పెరుగుతున్న డిమాండ్‌ 

ఆహార ఉత్పత్తిగా గుర్తింపు... 

బిస్కెట్‌లు, పాస్తా, న్యూడిల్స్‌ తయారు 

నాచుతో పంట పొలాలు.. తోటలకు సేంద్రియ ఎరువు 

పశుగ్రాసాలు.. చేపల మేతలలో సైతం వినియోగం 

విజయవంతమైతే జిల్లాకు పర్యావరణంగా మేలు 

ఆక్వాతో ధ్వంసమవుతున్న తీరం  

ఆక్వాకు ప్రత్యామ్నాయం కానున్ననాచు ఉత్పత్తి  

సాక్షి, అమలాపురం:  సముద్ర నాచు (సీ వీడ్‌) సాగు మరోసారి తెరపైకి వచ్చింది. గతంలోనూ ఈ సాగు ఉన్నప్పటికీ అనుకున్న స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో పెద్దగా వెలుగులోకి రాలేదు. ఇటీవల కాలంలో గుజరాత్‌ సముద్ర నాచు (Seaweed) తయారీ విధానం విజయవంతం కావడంతో రాష్ట్రంలోని తీర ప్రాంతాల్లో ఈ సాగు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం సాగుతోంది. దీనిలో భాగంగా కోనసీమ జిల్లా ఈ సాగుకు అనుకూలమైన ప్రాంతంగా గుర్తించడంతో శాస్త్రవేత్తలు, మత్స్యశాఖ అధికారులు ఇక్కడ ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే మామిడికుదురు మండలంలో ఒక ఔత్సాహిక రైతు సాగు ప్రారంభించారు. 

తీరంలో ఈ సాగు విజయవంతం అయితే ఆక్వాకు ప్రత్యామ్నాయ సాగుగా మారడంతోపాటు ఆక్వా వల్ల పర్యావరణానికి కలుగుతున్న హాని తగ్గుతుంది. సముద్రపు నాచు సాగుకు గతంలో ఒకసారి మంచి గుర్తింపు వచ్చింది. అయినా పాత పద్ధతిలో సాగు చేయడం వల్ల అనుకున్న స్థాయిలో విజయవంతం కాలేదు. ఈ సాగు విజయవంతం అయితే తీర ప్రాంతాల్లో మత్స్యకారులకు, మహిళలకు, ఆక్వా రైతులకు స్థిరమైన ఆదాయం ఇచ్చేలా మారనుంది. మరీ ముఖ్యంగా కష్టాల వనామీ వంటి పంటలకు ప్రత్యామ్నాయం కానుంది.

జిల్లాలో సఖినేటిపల్లి మండలం అంతర్వేది నుంచి ఐ.పోలవరం మండలం భైరవపాలెం వరకు సుమారు 90 కిలోమీటర్ల తీరం ఉంది. ఏడు మండలాల్లో తీర ప్రాంతం ఉంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కాకినాడ జిల్లా కన్నా కోనసీమలోనే ఆక్వాసాగు అధికం. సముద్ర నాచు సాగు చేపట్టేందుకు అనువైన స్థలం, వాతావరణం ఇక్కడ ఉంది. మామిడికుదురు మండలం గొల్లపల్లి, కరవాకల మధ్య ఈ సాగును ఒకరు మొదలు పెట్టారు.  

అతి విలువైనది 
సముద్ర నాచు చాలా విలువైనది. జపాన్, చైనాలో దీనిని ఆహారంగా తీసుకుంటారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ దీనికి ప్రాధా­న్యం పెరుగుతోంది. ఈ నాచు పోషకాల నిధిగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మందులు, ఎరువులు, పశువుల దాణాగా ఉపయోగిస్తున్నారు. బిస్కెట్లు, పాస్తా, నూడుల్స్‌ కూడా తయారు చేస్తున్నారు.  

నాచు రకాలు         
సముద్ర నాచులో గ్రేసిలేరియా, కప్పాఫైకస్, ఉల్వా, సర్గాస్సమ్‌ అనే రకాలు ముఖ్యమైనవి. ఇవి ఆకుపచ్చ, ఎరుపు, మట్టి రంగుల్లో ఉంటాయి. వీటిలో కప్పాఫైకస్‌ అల్వారెజీ రకం ఒకటి. దీని ద్వారా కేరాజినన్‌ అనే పదార్థాన్ని సేకరిస్తారు. ఇది ఆహార పదార్థాలు, ఔషధాలు, సౌందర్య సాధనాలలో వాడతారు. 

అలాగే గ్రేసిలేరియా ఎడ్యులిస్‌ రకం నుంచి అగర్‌ అనే పదార్థాన్ని సేకరిస్తారు. ఇది మైక్రో బయాలజీ, ఆహార పరిశ్రమ, ఔషధాల తయారీలో విస్తతంగా ఉపయోగిస్తారు. ఈ రెండు జాతులు రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయం కానున్నాయి. జిల్లాలో ఈ ప్రాజెక్టులకు గ్రీన్‌ క్లైమేట్‌ ఫండ్, నాబార్డ్‌ నిధులు అందిస్తాయని జిల్లా యంత్రాంగం చెబుతోంది.

కోనసీమ అనుకూలం 
సముద్రపు నాచు సాగు పైలట్‌ ప్రాజెక్టును కోనసీమ జిల్లాలో ఏర్పాటు చేయనున్నారు. తొలుత మలికిపురం మండలం తూర్పుపాలెంలో దీనిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తరువాత జిల్లాలో అనువైన స్థలాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయాలనే ఆలోచనతో జిల్లా యంత్రాంగం ఉంది. దీనిలో భాగంగా ఇటీవల సముద్రపు నాచు సాగులో నిపుణులు, సీఎస్‌ఐఆర్, సీఎస్‌ఎంసీఆర్‌ఐ, మండపం, తమిళనాడు శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో బృందం కోనసీమలోని పలు మండలాల్లోని తీర ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో  పరిశీలించింది. 

జిల్లాలో కాట్రేనికోన మండలంలోని కొత్తపాలెం, పల్లం, నీళ్లరేవు, చిర్రయానం, గచ్చకాయల పోర, ఉప్పలగుప్తం మండలంలోని ఎన్‌.కొత్తపల్లి, ఎస్‌.యానం, వాసాలతిప్ప, మామిడికుదురు మండలం గోగన్నమఠం, కరవాక, గొల్లపాలెం, మలికిపురం మండలం తూర్పుపాలెం, సఖినేటిపల్లి మండలంలోని చింతల మోరి, కేశవదాసుపాలెం, అంతర్వేది, గొంది, అల్లవరం మండలం నక్కా రామేశ్వరం, కొమరగిరిపట్నం, ఓడలరేవు, రెబ్బనపల్లి తదితర గ్రామాలలో సముద్రపు నాచు సాగుకు అనువైన ప్రదేశాలను నిపుణుల బృందం పరిశీలించింది.  

వనామీకి ప్రత్యామ్నాయం 
సముద్ర నాచు సాగు విజయవంతం అయితే వనామీ సాగుకు ప్రత్యామ్నాయంగా మారనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.  సముద్ర నాచు నిలకడైన ఆదాయమని మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు. సముద్ర నాచు సాగుకు నాలుగు అడుగుల నీరు అవసరం.  పంట దిగుబడి వచ్చేందుకు 45 నుంచి 60 రోజులు పట్టనుంది. ప్రణాళికాబద్ధంగా సాగు చేస్తే ఏడాదికి నాలుగైదు పంటలు పండించే అవకాశముంది. ప్రస్తుత మార్కెట్‌లో కేజీ రూ.25 వరకు ధర ఉండగా, ఎకరాకు రూ.40 వేలకు తక్కువ కాకుండా ఆదాయం వస్తుందని అంచనా. 

పైలట్‌ ప్రాజెక్టుగా.. 
సముద్ర నాచు సాగుకు అనువైన ప్రదేశాలను ఎంపిక చేసిన తర్వాత డీఆర్‌డీఏ, మత్స్యశాఖ ఆధ్వర్యంలో సముద్ర తీర ప్రాంతాలలో పైలట్‌ ప్రాజెక్టుల్లో సాగు ప్రారంభిస్తారు. స్వయం సహాయక సంఘాల మహిళలు, సంప్రదాయ మత్స్యకారులు, యువకులలో ఔత్సాహికులను గుర్తించి వారికి సముద్రపు నాచు సాగులో శిక్షణ ఇవ్వడం, మార్కెటింగ్‌ సదుపాయాలు కల్పించడం ద్వారా సాగు విజయవంతం చేస్తాం.  
– ఆర్‌.మహేష్ కుమార్, కలెక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement