అడవి అంటుకుంటే..  | Satellite Technology To Find Fire Accidents In Forests | Sakshi
Sakshi News home page

అడవి అంటుకుంటే.. 

Apr 11 2021 4:43 PM | Updated on Apr 11 2021 5:50 PM

Satellite Technology To Find Fire Accidents In Forests - Sakshi

మార్చి నాలుగు.. కొయ్యూరు అటవీ సెక్షన్‌ కాకరపాడు బీట్‌ పరిధిలో లుభుర్తి, బోయవుటలో అడవి కాలుతోంది. ఈ విషయాన్ని ఇక్కడి సిబ్బంది గుర్తించేలోగానే.. భారతీయ అటవీ సర్వే శాఖ (ఎఫ్‌ఎస్‌ఐ) డెహ్రాడూన్‌ నుంచి ఉపగ్రహ సహాయంతో పసిగట్టింది. వెంటనే సిబ్బంది అప్రమత్తమై ఘటనా స్థలానికి వెళ్లి మంటలను ఆర్పారు. 

మార్చి ఆరు.. కొయ్యూరు బీట్‌ సాకులపాలెం, లూసం, బలభద్రంలో అడవి కాలుతుందని సమాచారం రావడంతో సిబ్బంది ఆ ప్రాంతానికి వెళ్లారు. గ్రామస్తులతో కలిసి మంటలను ఆర్పారు. 

అదే నెలలో.. మంప బీట్‌ పరిధిలో గంగవరం, బాలరేవులలో అడవి కాలుతున్న సమాచారం రావడంతో వెంటనే అక్కడకు చేరుకొని మంటలను అదుపు చేశారు.  

కొయ్యూరు: అడవిలో అగి్నప్రమాదాల సమాచారం ఉపగ్రహం ద్వారా క్షణాల్లో చేరిపోతోందిప్పుడు. స్థానిక అటవీ శాఖ సిబ్బందికి సమాచారం వచ్చేలోగానే అటవీ సర్వే శాఖ అప్రమత్తం చేస్తోంది. గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టమ్‌ (జీపీఎస్‌)కు అనుసంధానం చేసి అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని వెంటనే గుర్తుపడుతున్నారు. ఉపగ్రహ వ్యవస్థ లేక ముందు ఎవరో వచ్చి అటవీ శాఖకు సమాచారం అందిస్తే తప్ప తెలిసేది కాదు. ఈలోపు భారీ నష్టం జరిగిపోయేది. భారతీయ అటవీ సర్వే శాఖ డెహ్రాడూన్‌ నుంచి ఉపగ్రహం ద్వారా ఎప్పటికప్పుడు అగి్నప్రమాదాలను గుర్తించి సంబంధిత జిల్లాలకు పంపడంతో పూర్తిగా విస్తరించకముందే మంటలను అదుపు చేయగలుగుతున్నారు. 

అడవిలో నిప్పు రేగితే భారీ నష్టం 
తూర్పుకనుమల్లో నూటికి 95 శాతం ఆకులు రాల్చే చెట్లున్నాయి. రాలిన ఆకులు ఎండిన తరువాత ఎవరో ఒకరు నిప్పు పెడుతున్నారు. దీని మూలంగా అడవిలో అగ్గి రాజుకుంటుంది. అదే ప్రమాదానికి దారి తీస్తుంది. పెద్ద మంటలు ఎగిసిపడి కొన్ని రకాల చెట్లను లేదా విలువైన వనమూలికలను కూడా కాల్చేస్తాయి. ఇలా ప్రతి ఏటా ప్రమాదాలు జరుగుతున్నాయి. అయితే భారతీయ అటవీ సర్వే శాఖ 2017 నుంచి ఉపగ్రహాల సాయంతో అగి్నప్రమాదాలను గుర్తిస్తోంది. దీని ఆధారంగా అధికారులు వెంటనే సంబంధిత జిల్లాల అటవీ అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. వారు వెళ్లి మంటలను ఆర్పేందుకు చర్యలు తీసుకుంటున్నారు. 

ఇన్వెంటరీ పాయింట్లలో చెట్ల గుర్తింపు 
2013లో అడవిలో ఏయే రకాల చెట్లున్నాయో తెలుసుకునేందుకు ఇన్వెంటరీ పద్ధతిని ప్రవేశపెట్టారు. దీని ద్వారా అటవీ ప్రాంతంలో చెట్లను గుర్తించేవారు. తిరిగి ఎనిమిది సంవత్సరాల తర్వాత మళ్లీ ఇప్పుడు అటవీ శాఖ గుర్తించిన కొన్ని పాయింట్లలో ఉన్న వివిధ రకాల చెట్ల వివరాలు పంపాలని ఆదేశాలు వచ్చాయి. 
వాటిని గుర్తించి పంపిస్తున్నారు. ఇక అడవిలో 30, 60, 90 సెంటీమీటర్ల లోతులో గోతులను తీసి మట్టి నమూనాలను వేర్వేరుగా సేకరిస్తున్నారు. వాటిని అనకాపల్లి భూసార సంరక్షణ కేంద్రానికి పంపిస్తున్నారు. వారి నివేదిక ఆధారంగా అక్కడ ఎలాంటి చెట్లు పెరుగుతాయో తెలుసుకొని అమలు చేస్తున్నారు. అడవి పెంపునకు ఇన్వెంటరీ పద్ధతి ఇలా ఉపకరిస్తుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement