ప్రజలకు ఇసుక అందుబాటులో ఉండాలి

Sand Should Be Available To The Public Merugu Nagarjuna - Sakshi

జిల్లా అభివృద్ధికి సమష్టి కృషి

వేసవిలో తాగునీటి ఇబ్బందులు

లేకుండా చర్యలు తీసుకోవాలి

సంక్షేమ ప«థకాలు అర్హులందరికీ అందాలి

డీఆర్‌సీలో ఇన్‌చార్జ్‌ మంత్రి మేరుగ నాగార్జున 

ఒంగోలు అర్బన్‌: జిల్లాల పునర్విభజన తర్వాత పెద్ద జిల్లాగా ఏర్పడిన ప్రకాశం జిల్లా అభివృద్ధికి అధికార యంత్రాంగం సమష్టిగా కృషి చేయాలని రాష్ట్ర సంఘిక సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. స్పందన భవనంలో ఇన్‌చార్జ్‌ మంత్రి అధ్యక్షతన శుక్రవారం డీఆర్‌సీ (జిల్లా సమీక్ష సమావేశం) నిర్వహించారు. దీనిలో ఇన్‌చార్జ్‌ మంత్రి మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య రాకుండా నీటి సరఫరా సక్రమంగా చేయాలన్నారు. గృహాల నిర్మాణాలతో పాటు ప్రజలకు ఇసుక కొరత లేకుండా నిరంతరం అందుబాటులో ఉంచేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

ఇళ్ల నిర్మాణాలకు స్థానికంగా ఎడ్ల బండ్లు, టైర్‌ బండ్లపై ఇసుక తీసుకెళ్లే వారిపై సెబ్‌ అధికారులు చర్యలు తీసుకోవడం మంచిది కాదన్నారు. అటువంటి చర్యలపై అందరు ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక అవసరాల కోసం జీవో ప్రకారం ఇసుకను తీసుకెళ్తే అడ్డుకోవడం వలన ప్రజలకు ఇబ్బందులు రావడంతో పాటు ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్నారు.  పంచాయతీ అధికారులు ఇసుక రవాణాను పర్యవేక్షించాలన్నారు. జిల్లాలో నాలుగు ఇసుక డిపోలే అందుబాటులో ఉంచడంపై జేపీ వెంచర్స్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. నియోజకవర్గానికి ఒక ఇసుక డిపో ఉండాలన్నారు. ఇసుక సరఫరాలో విఫలమైతే ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని హెచ్చరించారు.  

తాను ఇన్‌చార్జ్‌ మంత్రిగా ప్రకాశం జిల్లాకు ఉండటం సంతోషంగా ఉందని తనకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించి జిల్లా అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని అన్నారు. గ్రామాల్లో ప్రభుత్వ భూములు, శ్మశాన భూములు ఆక్రమణలకు గురి కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎస్‌ఎన్‌పాడు ఎమ్మెల్యే ఒంగోలు శివారు ప్రాంతం అయిన పేర్నమిట్టలో ఆంధ్రకేసరి యూనివర్శిటీ స్థలం కూడా ఆక్రమణలకు గురవుతున్నట్లు సమావేశంలో తెలిపారు.

యూనివర్శిటీ భూములను పరిరక్షించాలని ఇన్‌చార్జ్‌ మంత్రి కలెక్టర్‌కు తెలిపారు. చెరువులు, కుంటలు ఆక్రమణలకు గురి కాకుండా సరిహద్దుల్లో కందకాలు తవ్వాలని సూచించారు. కమ్యూనిటీ, ఏరియా ఆస్పత్రులతో పాటు జిల్లా ఆస్పత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా పర్యవేక్షణ ఉండాలన్నారు. సదరమ్‌ సర్టిఫికెట్ల జారీలో అక్రమాలు జరిగాయనే ఫిర్యాదులపై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. 

పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ వేసవిలో ప్రజలకు తాగునీటి సమస్యల రాకుండా పైప్‌లైన్‌ లేని ప్రాంతాల్లో ప్రజల అవసరాల మేరకు ట్యాంకర్లతో నీటిని సరఫరా చేయాలన్నారు. నీటి సరఫరాలో మూగ జీవాలను పరిగణలోకి తీసుకుని నీటిని అందించాలని అధికారులకు సూచించారు. ఆర్‌డబ్ల్యూఎస్, పశుసంవర్ధక శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు.  

పశ్చిమ ప్రాంతంలోని ఎమ్మెల్యేలు తాగునీటి సమస్యను ప్రధానంగా ప్రస్తావించారని, సమస్యను అధిగమించేందుకు అధికారులు పక్కా ప్రణాళికతో పరిష్కరించాలన్నారు. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. వెలిగొండ ప్రాజెక్టు బాధితుల సర్వే ప్రక్రియ త్వరగా పూర్తి చేసి నిర్వాసితులకు నష్టపరిహారం అందేలా చూడాలన్నారు. కనిగిరిలో ఈ సంవత్సరంలో ట్రిపుల్‌ ఐటీ క్లాసు ప్రారంభించేందుకు తాత్కాలిక ప్రాతిపదికన అవసరమైన వసతులు కల్పించాలని ఆ మేరకు అధికారులు దృష్టి సారించాలని అన్నారు. 

గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు మాట్లాడుతూ ట్యాంకర్లతో నీటి సరఫరా చేసినందుకు చెల్లించాల్సిన బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని త్వరితగతిన చెల్లించాలని కోరారు. చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములను ఆక్రమణలకు గురికాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వాగులు, వంకల నుంచి సారవంతమైన మట్టిని పొలాలకు చేరవేసుకునేందుకు రైతులకు అనుమతి ఇవ్వాలని కోరారు. సదరమ్‌ సర్టిఫికెట్ల జారీలో అక్రమాలపై చర్యలు తీసుకోవాలన్నారు. వెలిగొండ మొదటి దశ కింద ఎత్తిపోతల పథకం పనులు త్వరగా చేపట్టేందుకు టెండర్లు నిర్వహించాలన్నారు. కాకర్ల ముంపు ప్రాంత వాసులకు వెంటనే పరిహారం అందచేయాలని కోరారు. అదేవిధంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ఉన్న నాటు సారాను అరికట్టాలన్నారు.  

దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ మాట్లాడుతూ ఓటీఎస్‌ కింద నగదు చెల్లించిన పేదలకు ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ నిలిచిపోయిందని, వెంటనే ప్రక్రియను ప్రారంభించి లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్‌ చేయాలన్నారు. దొనకొండ, కురిచేడు మండలాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించాలన్నారు. దర్శి నగర పంచాయతీలో జల జీవన్‌ మిషన్‌ కింద మంజూరైన రూ.6.50 కోట్ల నిధులు వెనక్కి వెళ్లకుండా పనులు చేపట్టాలని కోరారు. పింఛన్‌ పంపిణీలో సాంకేతిక సమస్యలు పరిష్కరించాలన్నారు. పంచాయతీల్లో చేపట్టిన పనులకు బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. 

ఎమ్మెల్సీ పోతుల సునీత మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్టు త్వరగా ప్రారంభించి జిల్లాలో సాగు, తాగునీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలన్నారు. ఇసుక సరఫరాలో సెబ్‌ అధికారుల తీరుతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందన్నారు. సీజనల్‌ వ్యాధులు అరికట్టేందుకు సంబంధిత అధికారులు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలన్నారు. 

కలెక్టర్‌ ఏఎస్‌ దినేష్‌ కుమార్‌ మాట్లాడుతూ డీఆర్‌సీ సమావేశాల్లో చర్చించిన అంశాలను అధికార యంత్రాంగం దృష్టి సారించి ఫలితాలు సాధించాలన్నారు. గత డీఆర్‌సీలో ప్రస్తావించిన అంశాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న వాటిని కార్యరూపంలోకి తీసుకురావాలన్నారు. కమిటీ సభ్యుల సూచనల మేరకు వారి సమస్యల పరిష్కారానికి అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ అభిషిక్త్‌ కిషోర్, జిల్లా రెవెన్యూ అధికారి పులి శ్రీనివాసులు అన్నీ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. 

మార్కాపురం ఎమ్మెల్యే కుందురు నాగార్జున రెడ్డి మాట్లాడుతూ మార్కాపురంలో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. నెలకు రెండు పంచాయతీలను లక్ష్యంగా పెట్టుకుని సమగ్రమైన ప్రణాళికతో తాగునీటికి శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. సెర్ప్‌ ప్రోత్సాహంతో స్వయం సహాయక సంఘాల ద్వారా పరిశ్రమలు స్థాపించేలా చూడాలన్నారు. 

పీడీసీసీ బ్యాంకు చైర్మన్‌ మాదాసి వెంకయ్య మాట్లాడుతూ అనధికారిక చేపల ఉత్పత్తి కేంద్రాలను అరికట్టాలని కోరారు. ప్రభుత్వానికి ఆదాయం వచ్చే వాటికి చట్టబద్ధత కల్పించాలన్నారు. శిథిలావస్థకు చేరిన తుఫాను షెల్టర్లను తొలగించి నూతనంగా నిర్మాణాలు చేయాలన్నారు. శింగరాయకొండలో దేవదాయ భూములుగా నమోదైన రెండు వేల ఎకరాల భూముల సమస్యను పరిష్కరించాలని కోరారు. టంగుటూరులో తాగునీటి సమస్యను పరిష్కరించాలన్నారు. 

కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇంటింటికీ కుళాయిల ఏర్పాటు కోసం రూ.136 కోట్లతో చేపట్టిన పనులు మధ్యలోనే నిలిచిపోయాయని కమిటీలో తెలిపారు. తిరిగి ఆ పనులు సత్వరమే చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ట్రిపుల్‌ ఐటీ తాత్కాలిక భవనాల నిర్మాణాలకు రూ.25 కోట్లు కేటాయించాలన్నారు. కనిగిరి రెవన్యూ డివిజన్‌ పరిధిలో వచ్చే ప్రభుత్వ కార్యాలయ సేవలు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. కంబాలదిన్నె పాఠశాలలో చెట్ల కింద తరగతులు నిర్వహిస్తున్నారని, నాడు–నేడు కింద పాఠశాలను అభివృద్ధి చేయాలని కోరారు. 

సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌ బాబు మాట్లాడుతూ ఆంధ్రకేసరి యూనివర్శిటీ స్థలం ఆక్రమణలకు గురికాకుండా చూడాలన్నారు. ప్రమాదాలకు నిలయంగా మారిన ఒంగోలు–పొదిలి రహదారిని నాలుగు లైన్ల రహదారిగా అభివృద్ధి చేయాలన్నారు. గుండ్లకమ్మ నుంచి ఆయా ప్రాంతాలకు తాగునీటి సరఫరా చేసే పైపులైన్‌లు మరమ్మతులు చేయాలని కోరారు. గుండ్లకమ్మ రిజర్వాయర్‌లో చేపల అక్రమ వేటను అరికట్టాలన్నారు. పారిశ్రామికవాడ నుంచి వచ్చే ఆదాయంలో 40 శాతం నిధులు స్థానిక ప్రాంతాలకు కేటాయించి అభివృద్ధి చేయాలన్నారు. ఉప్పుగుండూరులో 100 పడకల ఆస్పత్రికి ప్రతిపాదనలు పంపాలని కోరారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top