Software Engineers: కష్టాలు వెంటాడుతున్నా ‘తగ్గేదే లే’.. ఒక్కోమెట్టూ ఎక్కుతూ..

Rural Youth Excelling As Software Engineers - Sakshi

సాఫ్ట్‌వేర్లుగా రాణిస్తున్న గ్రామీణ యువకులు

తల్లిదండ్రుల ప్రోత్సాహం, ప్రభుత్వ సహకారంతో ఉన్నత చదువులు 

పెద్దపెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు నెలకు రూ.లక్షల్లో వేతనాలు

ఆర్థికంగా స్థిరపడినా స్వగ్రామాలవైపే అందరి చూపులు

ఊరి రుణం తీర్చుకుంటున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు

సేవా కార్యక్రమాల్లో తరిస్తూ.. ఆదర్శంగా నిలుస్తున్న వైనం

పేదరికం అడ్డొచ్చినా, కష్టాలు వెంటాడుతున్నా వెనక్కి తగ్గలేదు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, ప్రభుత్వ సహకారంతో ఉన్నత విద్యనభ్యసించారు. ఒక్కోమెట్టూ ఎక్కుతూ ఇంజినీర్లుగా స్థిరపడ్డారు. ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. తాము సంపాదించిన మొత్తంలో కొంత స్వగ్రామాలకు, మరికొంత పేద విద్యార్థులకు వెచ్చిస్తూ సేవా కార్యక్రమాల్లో తరిస్తున్నారు.. వెంకటగిరి నియోజకవర్గంలోని సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు. బిడ్డలు పెద్దవాళ్లయిన తర్వాత పేగుబంధాన్ని మరిచి తల్లిదండ్రులను ఒంటరివాళ్లను చేస్తున్న ఈ రోజుల్లో.. తాము ఉన్నతంగా స్థిరపడినా కుటుంబానికి వెన్నంటే ఉంటున్నారు. పుట్టిన ఊరి రుణం తీర్చుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. గ్రామీణ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లపై ‘సాక్షి’ స్పెషల్‌ ఫోకస్‌.
చదవండి: వింత అచారం: వరుడు వధువుగా.. వధువు వరుడిగా..

వెంకటగిరి(తిరుపతి జిల్లా): ఒకప్పుడు పల్లెటూళ్లంటే పాడుబడిన పూరిళ్లు.. చదువూసంధ్యలేని ప్రజలు. ఇప్పుడు కాలం మారింది. చదువుపై ఆసక్తి పెరిగింది. తాము పడ్డ కష్టాలు బిడ్డలు పడకూడదని తల్లిదండ్రులు నిశ్చయించుకుంటున్నారు. కూలిపనులు చేసి కూడా పైసాపైసా కూడబెట్టి ఉన్నత చదువులు చదివిస్తున్నారు. వారి ఆకాంక్షలు నెరవేరుస్తూ బిడ్డలు ఉన్నత స్థానాల్లో స్థిరపడుతున్నారు. సాఫ్ట్‌ వేర్‌ ఇంజినీర్లుగా, డాక్టర్లుగా రాణిస్తున్నారు. వెంకటగిరి నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్లినా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లే దర్శనమిస్తున్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, ప్రభుత్వ ఫీజురీయింబర్స్‌మెంట్‌తో ఉన్నత చదువులు చదువుతున్నారు. సీనియర్లను స్ఫూర్తిగా తీసుకుని జూనియర్లు కూడా ఇంజీనీరింగ్‌ వైపు అడుగులు వేస్తున్నారు. లక్షల్లో వేత నాలు పొందుతూ ఊరి రుణం తీర్చుకుంటున్నారు.

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లకు కేరాఫ్‌ అడ్రస్‌ కమ్మవారిపల్లె 
నియోజకవర్గంలోని డక్కిలి మండలం, కమ్మవారిపల్లిలోనే 45 మంది సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు ఉన్నారు. 120 ఇళ్లు ఉన్న ఈ గ్రామంలో చాలామంది ఉన్నత విద్యనభ్యసించి వివిధ హోదాల్లో స్థిరపడ్డారు. దళితవాడకు చెందిన పెంచలయ్య కుమార్తె జ్యోతి ఎంబీబీఎస్, కుమారుడు ప్రసాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా రాణిస్తున్నారు. ఓపిక ఉన్నంత వరకు  కూలి పనులు చేస్తామని చెబుతున్నారు. తమ బిడ్డల సంపాదనతో ఇంట్లో అన్ని సౌకర్యాలు సమకూరాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

డక్కిలి మండలం, కొత్తనాలపాడు గ్రామానికి చెందిన పీ.కృష్ణయ్య పైసాపైసా కూడబెట్టి తన కుమారుడు వెంకటేశ్వర్లును ఎంసీఐ వరకు చదివించాడు. ప్రస్తుతం వెంకటేశ్వర్లు చెన్నై హెచ్‌సీఎల్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌గా పనిచేస్తున్నారు. నెలకు రూ.1.8 లక్షల వేతనం. 
వెంకటగిరి మండలం, సిద్ధవరం గ్రామానికి చెందిన సుబ్బరాయుడుకు రాజేష్‌, రాఘవ ఇద్దరు కుమారులు. ఉన్న ఎకరా పొలాన్ని విక్రయించి పిల్లలను నెల్లూరులోని ప్రముఖ విద్యాసంస్థల్లో ఇంటర్మీడియెట్‌ చదివించాడు. అనంతరం ప్రభుత్వం అందించిన సహకారం, ఫీజురీయింబర్స్‌మెంట్‌తో ఇంజినీరింగ్‌ వరకు చదివించాడు. తండ్రి కలలను సాకారం చేస్తూ బెంగళూరు, చెన్నైలో సాఫ్ట్‌వేర్లుగా స్థిరపడ్డారు.

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగంపై మక్కువ ఎక్కువ 
నియోజకవర్గంలోని డక్కిలి మండలం, ఆల్తూరుపాడు గ్రామంలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం పొందిన కే.చైతన్య, చంద్రశేఖర్‌రెడ్డి తదితర యువకుల స్ఫూర్తితో పదులు సంఖ్యలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాల్లో స్థిరపడుతున్నారు. రూ.లక్షల్లో జీతాలు ఉండడంతో తాము కూడా సాఫ్ట్‌వేర్‌గా ఎదగాలన్న కసి స్థానికుల నుంచి వ్యక్తమవుతోంది. మోపూరు, పాతనాలపాడు, కోత్తనాలపాడు, చాపలపల్లి, మిట్టపాళెం, కమ్మపల్లి, వల్లివేడు, యాతలూరు వంటి గ్రామాల్లోని ప్రతివీధిలో ఇద్దరోముగ్గురో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు ఉండడం గమనార్హం. తల్లిదండ్రలు కూడా తమ బిడ్డలు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లుగానే స్థిరపడాలని కోరుకుంటున్నారు.

కరోనా కష్టకాలంలో వన్నెతగ్గని ఉద్యోగం 
రెండేళ్లుగా కరోనా కష్టాల్లోనూ సాఫ్ట్‌వేర్‌ రంగానికి ఎక్కడా డిమాండ్‌ తగ్గలేదు. సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు తమ ఉద్యోగులను ఇళ్ల నుంచి (వర్క్‌ ఫ్రం హోం) విధులు చేయించుకున్నాయి. కమ్మవారిపల్లి, కోత్తనాలపాడు, మోపూరు, ఆల్లూరుపాడు, డక్కిలి గ్రామాల్లో వందల మంది సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు ఇళ్ల నుంచే తమ విధులు నిర్వహించారు. తల్లిదండ్రలతో పాటు బంధువులకు దగ్గరగా జీవనం సాగించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top