ఆదాయార్జన శాఖలు లక్ష్యాలను చేరుకోవాలి | Revenue generating departments must meet targets | Sakshi
Sakshi News home page

ఆదాయార్జన శాఖలు లక్ష్యాలను చేరుకోవాలి

Apr 17 2026 5:17 AM | Updated on Apr 17 2026 5:17 AM

Revenue generating departments must meet targets

ఆదాయార్జన శాఖలు లక్ష్యాలను చేరుకోవాలి 

ఆర్థిక శాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు

సాక్షి, అమరావతి: ఆదాయార్జన శాఖలు రెవెన్యూ లక్ష్యాలను చేరుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి లక్ష్యాలను సాధించేందుకు వీలుగా మైక్రో, మాక్రో స్థాయిలో ప్రణాళికలు అమలుచేయాలన్నారు. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికల ద్వారా పూర్తిస్థాయి ఉత్పాదకతను చేరుకోవాలని ఆర్థికశాఖకు సూచించారు. 

15 శాతం మేర వృద్ధి రేటు లక్ష్యాన్ని చేరుకునేలా క్షేత్రస్థాయి వరకూ ఈ ప్రణాళికల్ని అమలుచేయాలని సీఎం స్పష్టంచేశారు. సచివాలయంలో ఆర్థిక శాఖపై గురువారం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సంక్షేమ క్యాలెండర్‌కు అనుగుణంగానే పథకాలను అమలుచేస్తామని అన్నారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన నిధులపై దృష్టిపెట్టాలని ఆయన సూచించారు.  

జనగణనలో అందరూ భాగస్వాములు కావాలి
రాష్ట్రంలో గురువారం ప్రారంభమైన స్వీయ జనగణనలో కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తన వివరాలను ఆన్‌లైన్‌ పోర్టల్‌ ద్వారా నమోదు చేసుకున్నారు. హౌస్‌ లిస్టింగ్‌– హౌస్‌ సెన్సెస్‌లో భాగంగా ఈ ప్రక్రియ గురువారం ప్రారంభమైంది.  se.census.gov.in వెబ్‌సైట్‌ ద్వారా ముఖ్యమంత్రి వివరాలను నమోదు చేశారు. మొత్తం 33 ప్రశ్నలతో కూడిన ఈ సెల్ఫ్‌ ఎన్యూమరేషన్‌ ప్రక్రియను ఏపీ జనగణన డైరెక్టర్‌ జె.నివాస్‌ ముఖ్యమంత్రికి వివరించారు. 

మరోవైపు.. రాష్ట్రంలో ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని దేవదాయ శాఖపై జరిగిన సమీక్షలో చంద్రబాబు అధికారులను ఆదేశించారు. శ్రీవాణి నిధులతో రాష్ట్రవ్యాప్తంగా నిర్మించనున్న ఐదువేల దేవాలయాలను రెండేళ్లలో పూర్తిచేయాలన్నారు. తిరుమల తరహాలోనే ఇతర దేవాలయాల్లోనూ అన్నప్రసాదం అందించాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement