న్యాయ రాజధానిని ఏర్పాటు చేయాల్సిందే 

Rayalaseema Atma Gourava rally with thousands of people in Kurnool - Sakshi

కర్నూలులో వేలాది మందితో రాయలసీమ ఆత్మగౌరవ ర్యాలీ  

కర్నూలు (సెంట్రల్‌): కర్నూలులో న్యాయ రాజధానిని ఏర్పాటు చేసే వరకు పోరాటం చేస్తామని రాయలసీమ విద్యార్థి, యువజన సంఘాల జేఏసీ ప్రకటించింది. తక్షణమే కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ వేలాది మంది విద్యార్థులు, మహిళలు, న్యాయవాదులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రజా సంఘాల నేతలు మంగళవారం రాయలసీమ ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు.

కర్నూలులోని రాజ్‌విహార్‌ సర్కిల్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు భారీ ర్యాలీ జరిగింది. మూడు రాజధానులకు మద్దతుగా తక్షణమే కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన వక్తలు మూడు రాజధానులకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న సీఎం వైఎస్‌ జగన్‌ ఆశయంతో ఏకీభవిస్తున్నామన్నారు.

రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు వెంటనే కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు అంగీకరించాలని.. లేదంటే వచ్చే ఎన్నికల్లో వారి భరతం పడతామని జేఏసీ నేతలు హెచ్చరించారు. కలెక్టరేట్‌ ఎదుట మానవహారంగా ఏర్పడి న్యాయ రాజధాని ఆకాంక్షను తెలియజేశారు. ర్యాలీ జరుగుతున్న సమయంలో భారీ వర్షం కురిసినా ర్యాలీ నిర్వహించడం విశేషం.

జేఏసీ నిర్వహించిన ర్యాలీకి బార్‌ అసోసియేషన్‌ నాయకులు ఎంఆర్‌ కృష్ణ, ఓంకార్, నారాయణ విద్యాసంస్థల డీన్‌ లింగేశ్వరరెడ్డి, సీవీ రామన్‌ విద్యాసంస్థల అధినేత చంద్రశేఖర్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకుడు నక్కలమిట్ట శ్రీనివాసులు, ఎంవీఎస్‌ అధ్యక్షుడు వెంకటేష్, కాంట్రాక్ట్‌ అధ్యాపకుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఏసుదాసు, రిటైర్డ్‌ ఉద్యోగులు రోషన్‌ అలీ, అజయ్‌కుమార్‌ మద్దతు ప్రకటించారు.  

ఈ నెల చివరి వారంలో లక్ష గొంతుకల పొలికేక 
కాగా కర్నూలులో న్యాయ రాజధానిని ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో నవంబర్‌ చివరి వారంలో లక్ష గొంతుకల పొలికేక సభను నిర్వహిస్తామని విద్యార్థి, యువజన సంఘాల జేఏసీ నాయకులు ప్రశాంత్, శ్రీరాములు, చంద్రప్ప, సునీల్‌రెడ్డి ప్రకటించారు. ఈ కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీలు, విద్యార్థి, యువజన, ప్రజా సంఘాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, బార్‌ అసోసియేషన్లను ఆహ్వానిస్తామన్నారు. రాయలసీమకు సీఎం వైఎస్‌ జగన్‌ హయాంలో తప్ప న్యాయం జరగదన్నారు. ఇప్పుడు సాధించుకోలేకపోతే మరెప్పుడూ శ్రీబాగ్‌ ఒడంబడిక ప్రకారం హైకోర్టు రాదన్నారు.  

శ్రీబాగ్‌ ఒడంబడికకు ప్రాణం పోసిన నేత వైఎస్‌ జగన్‌ 
1953లో మద్రాసు నుంచి విడిపోయిన ఆంధ్ర రాష్ట్రానికి శ్రీబాగ్‌ ఒడంబడిక ప్రకారం కర్నూలులో రాజధానిని, గుంటూరులో హైకోర్టును ఏర్పాటు చేశారని బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎంఆర్‌ కృష్ణ తెలిపారు. అయితే 1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడ్డాక శ్రీబాగ్‌ ఒడంబడికను విస్మరించి కర్నూలులో ఉన్న రాజధానిని హైదరాబాద్‌కు తరలించారన్నారు.

2014లో ఏపీ, తెలంగాణ విభజన సమయంలో మళ్లీ శ్రీబాగ్‌ ఒడంబడిక ప్రకారం రాయలసీమలో రాజధాని లేదా హైకోర్టును ఏర్పాటు చేయాలని కోరితే సీఎంగా ఉన్న చంద్రబాబు కనీసం పట్టించుకోలేదన్నారు. అమరావతిపై ప్రేమతో రాజధానితోపాటు హైకోర్టును అక్కడే పెట్టేందుకు చర్యలు తీసుకున్నారని ధ్వజమెత్తారు. వైఎస్‌ జగన్‌ సీఎం అయిన తరువాత మళ్లీ శ్రీబాగ్‌ ఒడంబడికకు ప్రాణం పోశారని.. అందులో భాగంగానే కర్నూలును న్యాయ రాజధానిని చేశారని కొనియాడారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top