
హైకోర్టుకు వివరించిన మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి న్యాయవాది
కేసు డైరీ, ఇతర వివరాలను తమ ముందుంచాలన్న హైకోర్టు
సాక్షి, అమరావతి: తనపై నెల్లూరు జిల్లా జలదంకి పోలీసులు నమోదు చేసిన హత్యాయత్నం కేసును కొట్టేయాలని కోరుతూ కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై హైకోర్టు గురువారం విచారణ జరిపింది. ఈ కేసు డైరీ, ఇతర వివరాలను కోర్టు ముందుంచేందుకు పోలీసులకు వెసులుబాటు ఇచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసింది. అంతకుముందు ప్రతాప్‌కుమార్‌రెడ్డి తరఫు న్యాయవాది వీఆర్ మాచవరం వాదనలు వినిపించారు.
రాజకీయ కక్ష సాధింపు, దురుద్దేశాలతోనే పిటిషనర్‌పై కేసు నమోదు చేశారన్నారు. హత్యాయత్నంతో పాటు ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద నమోదు చేసిన సెక్షన్లేవీ పిటిషనర్‌కు వర్తించవన్నారు. పిటిషనర్‌కు పలు విద్యా సంస్థలున్నాయని, వాటికి సంబంధించి రోజూవారీ కార్యకలాపాల్లో పాలు పంచుకోవాల్సి ఉందన్నారు. సంబంధంలేని వ్యవహారంలో నిందితునిగా చేర్చారన్నారు. పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ వాదనలు వినిపిస్తూ.. సిట్టింగ్ ఎమ్మెల్యేను హత్య చేయించేందుకు పిటిషనర్ కుట్ర పన్నారని తెలిపారు.
నల్లపరెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన సందర్భంగా తన విధులకు ఆటంకం కలిగించారంటూ స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ మాలకొండయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్గామిట్ట పోలీసులు తనపై నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై గురువారం విచారణ జరిగింది.
ఇదే అంశానికి సంబంధించిన కేసును కొట్టేయాలని కోరుతూ నల్లపరెడ్డి గతంలో దాఖలు చేసిన వ్యాజ్యంతో ముందస్తు బెయిల్ పిటిషన్‌ను జత చేయాలని రిజిస్ట్రీని హైకోర్టు ఆదేశించింది. రెండు వ్యాజ్యాలను కలిపి విచారిస్తామని, తదుపరి విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది.