పీఎస్‌ఎల్‌వీ సీ54’కు కౌంట్‌డౌన్‌ 

PSLV C54 rocket launch On 26th November - Sakshi

రేపు ఉదయం 11.56 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ54 రాకెట్‌ ప్రయోగం   

సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) తిరుపతి జిల్లా సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ54 ఉపగ్రహ వాహక నౌకకు శుక్రవారం ఉదయం 10.26 గంటలకు కౌంట్‌డౌన్‌ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. 25.30 గంటల కౌంట్‌డౌన్‌ కొనసాగాక శనివారం ఉదయం 11.56 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ54 రాకెట్‌ను ప్రయోగించేందుకు సర్వం సిద్ధమైంది.

ఈ ప్రయోగానికి సంబంధించి గురువారం షార్‌లోని బ్రహ్మప్రకాష్‌ హాల్లో ఎంఆర్‌ఆర్‌ కమిటీ చైర్మన్‌ బీఎన్‌ సురేష్‌ ఆధ్వర్యంలో మిషన్‌ రెడీనెస్‌ రివ్యూ(ఎంఆర్‌ఆర్‌) సమావేశం నిర్వహించారు. ల్యాబ్‌ చైర్మన్‌ ఆర్ముగం రాజరాజన్‌ ఆధ్వర్యంలో తుది విడతగా రాకెట్‌కు తనిఖీలు నిర్వహించి లాంచ్‌ రిహార్సల్స్‌ చేపట్టారు.

అనంతరం కౌంట్‌డౌన్‌ సమయాన్ని శుక్రవారం ఉదయం 10.26 గంటలకు,  ప్రయోగ సమయాన్ని శనివారం ఉదయం 11.56 గంటలకని అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రయోగం ద్వారా తొమ్మిది ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపనున్నారు. ఇందులో ఇస్రోకు చెందిన ఈఓఎస్‌–06 ఉపగ్రహంతో పాటు ఎనిమిది ఉప గ్రహాలను వాణిజ్యపరంగా ప్రయోగిస్తోంది.

శుక్రవారం ఉదయం 10.26 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభమయ్యాక రాకెట్‌ నాలుగో దశ, రెండో దశలో ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను చేపట్టనున్నారు. షార్‌ నుంచి ఇది 87వ ప్రయోగం. పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ సిరీస్‌లో 56వ ప్రయోగం. పీఎస్‌ఎల్‌వీ ఎక్స్‌ల్‌ వెర్షన్‌లో 24వ ప్రయోగం కావడం విశేషం.  
 
షార్‌ కేంద్రానికి చేరుకోనున్న ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌  
ఇస్రో చైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ శుక్రవారం బెంగళూరు అంతరిక్ష కేంద్ర ప్రధాన కార్యాలయం నుంచి శ్రీహరికోటకు చేరుకోనున్నారు. పీఎస్‌ఎల్‌వీ సీ54 రాకెట్‌కు ఆయన మరోమారు తనిఖీలు నిర్వహించి కౌంట్‌డౌన్‌ను స్వయంగా పర్యవేక్షిస్తారు.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top