Vijayawada: శిశువు మృతిపై బంధువుల ఆందోళన

Protest Over Stillborn Baby In Front Of Vijayawada Old Govt Hospital - Sakshi

లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రసవం కోసం ప్రభుత్వాస్పత్రికి వస్తే, మృత శిశువును చేతిలో పెట్టారంటూ బుధవారం బాధితురాలి బంధువులు పాత ప్రభుత్వాస్పత్రి మాతా శిశు విభాగం ఎదుట ఆందోళనకు దిగారు. సేకరించిన వివరాల ప్రకారం నందిగామకు చెందిన జి.మమతకు పురిటినొప్పులు రావడంతో  ప్రసవం కోసం ఈ నెల 13వ తేదీ సాయంత్రం విజయవాడ పాత ప్రభుత్వాస్పత్రికి వచ్చారు. ఆమె నార్మల్‌ డెలివరీ అవుతుందని భావించిన వైద్యులు అబ్జర్వేషన్‌ రూమ్‌లో ఉంచారు. ఆమె బుధవారం ఉదయం నార్మల్‌ డెలివరీ అయింది. అయితే పుట్టిన శిశువు మృతి చెంది ఉండటంతో విషయాన్ని బంధువులకు తెలిపారు. ఇప్పటివరకూ ఆరోగ్యంగా ఉన్న శిశువు పుట్టగానే ఎలా మృతి చెందుతుందని, వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే శిశువు మృతి చెందిందంటూ మృతశిశువును పెట్టుకుని ఆస్పత్రి  ఎదుట నిరసన తెలిపారు.  

విచారణకు ఐదుగురు సభ్యుల కమిటీ 
పాత ప్రభుత్వాస్పత్రి ప్రసూతి విభాగంలో మృతశిశువు ప్రసవంపై విచారణకు ఐదుగురు సభ్యులతో కమిటీ వేసినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ యేకుల కిరణ్‌కుమార్‌ తెలిపారు. ఈ కమిటీలో గైనకాలజీ విభాగం ప్రొఫెసర్‌ డాక్టర్‌ పి.హిమబిందు, అనస్థీషియా విభాగాధిపతి డాక్టర్‌ టి.సూర్యశ్రీ, డిప్యూటీ సూపరింటెండెంట్‌  డాక్టర్‌ వి.సుధీర్‌బాబు, సివిల్‌సర్జన్‌ ఆర్‌ఎంఓ డాక్టర్‌ ఎ.హనుమంతరావు, ఏఆర్‌ఎం డాక్టర్‌ ఎస్‌.మాధవీలతతో కూడిన కమిటీ అన్ని అంశాలపై విచారణ జరపనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కమిటీ నివేదిక ఆధారంగా తగు చర్యలు తీసుకుంటామని డాక్టర్‌ కిరణ్‌కుమార్‌ తెలిపారు.  

వైద్యుల తప్పులేదు 
శిశువు మృతి విషయంలో వైద్యుల తప్పిదం లేదు. శిశువు మెడకు మూడుసార్లు పేగు చుట్టుకుని ఉండటంతో ఊపిరి ఆడక మృతి చెంది ఉండవచ్చు. సాధారణంగా  కొందరికి  ఒక మెలిక పేగు మెడకు చుట్టుకుని ఉంటుంది. కానీ ఈ శిశువుకు మూడు మెలికలు చుట్టుకుంది. బాధితులు ఫిర్యాదు చేస్తే, విచారణ చేస్తాం. 
–డాక్టర్‌ నాగేశ్వరరావు, 
డిప్యూటీ సూపరింటెండెంట్, పాత ఆస్పత్రి

చదవండి: భార్య అనుమతి లేకుండా ఆమె ఫోన్‌ కాల్స్‌ రికార్డు చేయడం నేరం: హైకోర్టు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top