AP: ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌

Promoted Employees Will Also Got As Per New PRC Based Salaries - Sakshi

పదోన్నతి పొందిన ఉద్యోగులకూ కొత్త పీఆర్‌సీ ప్రకారం వేతనాలు

సీఎం వైఎస్‌ జగన్‌ చొరవతో జీవో విడుదల

బకాయిలతో కలిపి చెల్లింపు

రాష్ట్ర వ్యాప్తంగా 2,096 మందికి లబ్ధి

కదిరి (శ్రీసత్యసాయి జిల్లా): పదోన్నతి పొందిన ఆర్టీసీ ఉద్యోగులందరికీ కొత్త పీఆర్‌సీ ప్రకారం వేతనాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చొరవతో ఈ నెల 24న ఉత్తర్వులు విడుదలయ్యాయి. సవరించిన కొత్త పీఆర్‌సీ ప్రకారం మార్చి 1వ తేదీన వారంతా వేతనాలు అందుకోనున్నారు. దీనికితోడు పదోన్నతి పొందిన నాటి నుంచి వారికి రావాల్సిన వేతన  బకాయిలు కూడా కొత్త పీఆర్‌సీ ప్రకారం చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ప్రజా రవాణా శాఖ(ఆర్టీసీ)లో రాష్ట్ర వ్యాప్తంగా 51,488 మంది ఆర్టీసీ ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 2,096 మందికి పదోన్నతి లభించింది. డీపీసీ నిబంధనలకు విరుద్ధంగా, ప్రభుత్వ అనుమతి లేకుండా పదోన్నతి కల్పించారంటూ ఆర్థిక శాఖ అభ్యంతరం తెలిపింది. గత ఏడాది సెప్టెంబర్‌ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త పీఆర్‌సీ వీరికి వర్తింపజేయడం కుదరదని తెగేసి చెప్పింది. పదోన్నతి పొందిన వారిని మినహాయించి 49,392 మందికి 2022 సెప్టెంబర్‌ 1 నుంచి కొత్త పీఆర్‌సీ అమలు చేస్తున్నారు. ఈ విషయాన్ని ఉద్యోగ సంఘాలు ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లాయి. 

సీఎం సానుకూలంగా స్పందించి.. వారికి న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఫలితంగా పదోన్నతి పొందిన వారికి కూడా కొత్త పీఆర్‌సీ వర్తింపజేస్తూ బకాయిలతో సహా చెల్లించేలా ఈ నెల 24న ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నిర్ణయంతో 2,096 మందికి లబ్ధి చేకూరనుంది. వీరిలో 27 మంది డిపో మేనేజర్లు, 18 మంది అసిస్టెంట్‌ డీఎంలు, 148 మంది గ్రేడ్‌–1 కండక్టర్లు, 332 మంది గ్రేడ్‌–1 డ్రైవర్లు, 197 మంది అసిస్టెంట్‌ డిపో క్లర్కులు, 345 మంది ఆర్టిజాన్‌లు, 198 మంది మెకానిక్‌లు, 322 మంది సూపర్‌వైజర్లు, 44 మంది సెక్యూరిటీ విభాగం వారితో పాటు ఇతరులు 465 మంది ఉన్నారు.

మనసున్న ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆర్టీసీ ఉద్యో­గుల దీర్ఘకాలిక డిమాండ్‌ను నెరవేరుస్తూ ఆర్టీసీ­ని ప్రభుత్వంలో విలీనం చేశారు. ఆర్థిక శాఖ అను­మతి లేకున్నా సరే 2,096 మందికి పదో­న్నతు­లు కల్పించారు. ప్రస్తుతం వారికి పే రివి­జన్‌ను క్రమబద్ధీకరించారు. మనసున్న సీఎంవైఎస్‌ జగన్‌కి ఆర్టీసీ ఉద్యోగులు ఎప్ప­టికీ మద్ద­తు­గా నిలుస్తారు.  – చంద్రయ్య, రాష్ట్ర అధ్యక్షుడు, ఆర్టీసీ వైఎస్సార్‌ యూనియన్‌

సీఎం జగన్‌కు రుణపడి ఉంటాం
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కార్మికులకు దేవుడయ్యారు. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా పదోన్నతి పొందిన మాలాంటి 2,096 మందికి కొత్త పీఆర్‌సీ అమలయ్యేలా నిర్ణయం తీసుకున్నారు. సీఎంకు ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బంది మొత్తం జీవితాంతం రుణపడి ఉంటాం.
– మోకా హరిమోహన్, అసిస్టెంట్‌ మేనేజర్, కదిరి డిపో  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top