 
													సాక్షి, ప్రకాశం: జిల్లాలోని కొత్తపట్నం మండలం ఈతముక్కల పల్లెలో కుల బహిష్కరణ కలకలం రేపింది. గ్రామంలోని ఒక స్థల వివాదంలో నాయుడు బ్రహ్మయ్య అనే వ్యక్తి తలదూర్చుతున్నాడనే కారణంతో గ్రామస్తులు అతనిపై బహిష్కరణ ప్రకటన చేశారు. దీంతో రెండు రోజుల్లో జరగాల్సిన ఆయన కొడుకు పెళ్లికి కూడా ఆటంకం కలిగే పరిస్థితి ఏర్పడింది.
కరోనా కాలంలో బయటి వ్యక్తులు గ్రామంలోకి గ్రామంలోని వ్యక్తులు బయటికి వెళ్లవద్దని గ్రామస్తులు తీర్మానం చేసుకున్నారు. బ్రహ్మయ్య కుటుంబాన్ని బహిష్కరిస్తున్నట్లు గ్రామంలో చాటింపు వేశారు. దీంతో గ్రామంలో తనకు జరిగిన అన్యాయాన్ని బ్రహ్మయ్య సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తన ఆవేదనను వ్యక్తం చేశాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు గ్రామాన్ని సందర్శించి పెద్దలను పిలిచి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
