సింగిల్‌ బిడ్‌కే సై.. | PPP contract for cath lab services in GGH Hospitals In AP | Sakshi
Sakshi News home page

సింగిల్‌ బిడ్‌కే సై..

May 3 2026 4:58 AM | Updated on May 3 2026 4:58 AM

PPP contract for cath lab services in GGH Hospitals In AP

అస్మదీయ సంస్థకు పదేళ్ల పాటు జీజీహెచ్‌ల్లో క్యాథ్‌ల్యాబ్‌ పీపీపీ సేవల కాంట్రాక్టు  

‘ముఖ్య’నేత సతీమణి సిఫార్సు చేసిన ఈ సంస్థకు ఇప్పటికే పలు జీజీహెచ్‌లు కేటాయింపు

ఇదే సంస్థకు 2018లోనూ పదేళ్ల పాటు పలు జీజీహెచ్‌ల క్యాథ్‌ల్యాబ్‌ బాధ్యతలు

కాకినాడ జీజీహెచ్‌కు రూ.7 కోట్లతో క్యాథ్‌ల్యాబ్‌ సమకూర్చిన గత ప్రభుత్వం

ఈ సేవల ద్వారా ఇక్కడ ఆరోగ్యశ్రీ నుంచి నెలకు రూ.30 లక్షలకు పైగా ఆదాయం

అయితే, అస్మదీయ సంస్థ జీజీహెచ్‌కు చెల్లించే ఫెసిలిటీ చార్జ్‌ రూ.3 లక్షలే

సాక్షి, అమరావతి: వడ్డించే వాడు మనోడైతే.. అన్నట్లుగా ఉంది రాష్ట్రంలో కాంట్రాక్టుల కేటా­యింపుల తీరు. ఎన్ని నిబంధనలున్నా మనోళ్ల­యితే ప్రభుత్వ పెద్దలు ముందూవెనుకా ఆలోచించకుండా అస్మదీయ కంపెనీలకు పీపీపీ ప్రాజెక్టుల రూపంలో ప్రజా సంపదను దోచిపెడుతున్నారు. వైద్య వర్గాల్లో ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారిన కాంట్రాక్టు కథాకమామిషు ఏమిటంటే.. 2014–19 మధ్య పదేళ్ల కాలపరిమితితో వైద్య­శాఖలో కాంట్రాక్టులు కట్టబెట్టిన సంస్థలకు, ఇప్పుడు మరో పదేళ్లకు కట్ట­బెట్టే­స్తున్నారు. ఈ క్రమంలో ‘ముఖ్య’నేత సతీమణి సిఫార్సుతో ఇప్పటికే పలు జీజీ­హెచ్‌ల్లో పీపీపీ క్యాథ్‌ల్యాబ్‌ సేవలు అందిస్తున్న ఓ సంస్థకు మరిన్ని జీజీ­హెచ్‌ల్లోనూ క్యాథ్‌ల్యాబ్‌ కాంట్రాక్టును కట్ట­బెట్ట­బో­తు­న్నారని ఆరోపణలు వస్తున్నాయి. కాకినాడ, శ్రీకాకుళం, నెల్లూరు, తిరుపతి జీజీహెచ్‌ల్లో పీపీపీ క్యాథ్‌ల్యాబ్‌లకు ఇటీవల వైద్యశాఖ టెండరు పిలిచింది. కాకినాడ జీజీహెచ్‌కు గత ప్రభుత్వంలోనే దాదాపు రూ.7 కోట్లతో క్యాథ్‌ల్యాబ్‌ను సమకూర్చారు. అంటే కాకినాడలో ప్రైవేట్‌ సంస్థ దీన్ని ఆపరేషన్, మెయింటెనెన్స్‌ చేస్తే చాలు.. మిగిలిన చోట్ల కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థే క్యాథ్‌ల్యాబ్‌ సమకూర్చి సేవలు అందించాలి. జనవరిలో తొలిసారి టెండరు పిలిచి రద్దుచేశారు. రెండోసారి పిలిచిన టెండరులో ఇప్పటికే పలు జీజీహెచ్‌ల్లో క్యాథ్‌ల్యాబ్‌ సేవలు అందిస్తున్న సంస్థ మాత్రమే బిడ్‌ వేసింది. బిడ్‌ను వైద్యశాఖ ఆమోదించింది. ఇక కాంట్రాక్టు అవార్డ్‌ చేయడమే తరువాయి.

అస్మదీయుడికి మేలు చేసేందుకు..
కాకినాడ జీజీహెచ్‌లో రూ.కోట్ల విలువైన పరికరాన్ని గత ప్రభుత్వమే సమకూర్చింది. ఇలా అప్పట్లో అనంతపురం, కర్నూలు జీజీహెచ్‌లకు సమకూర్చిన క్యాథ్‌ల్యాబ్‌లను ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్వహిస్తున్నారు. వీటిలో రోగులకు అందించే సేవలకు ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వం ఫీజులు చెల్లిస్తుంది. గుండె సమస్యల బాధితులకు యాంజియో, స్టెంట్లు వేయడం, వివిధ రకాల చికిత్సలకు రూ.1.50 లక్షల వరకూ బిల్లులు వస్తున్నాయి. ఇలా కర్నూలులో మూడునెలలకు రూ.కోటి వరకూ నిధులు సమకూరుతున్నాయి. అనంతపురంలోనూ దాదాపు ఇదే పరిస్థితి ఉంటోంది. ఈ లెక్కన పరిశీలిస్తే ఒక్కోచోట నెలకు రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల వరకూ ఆరోగ్యశ్రీ ఆదాయమే ఉంటోంది. అయితే, కాకినాడ క్యాథ్‌ల్యాబ్‌ను ప్రభుత్వమే నిర్వహించడానికి ఎంతో మెరుగైన అవకాశాలున్నప్పటికీ దీనితో పాటు, మిగిలిన చోట్ల పీపీపీలో అస్మదీయ సంస్థకు కట్టబెట్టాలని ప్రభుత్వం పెద్దలు నిర్ణయించారు. దీంతో ‘ముఖ్య’నేత కార్యాలయం డైరెక్షన్‌ మేరకు వైద్యశాఖ ప్రతిపాదనలు సిద్ధంచేసినట్లు తెలిసింది. 

డీఎంఈలో తొలుత రూపొందించిన ప్రతిపాదనల్లో కాకినాడ కాంట్రాక్టు దక్కించుకునే సంస్థ ఫెసిలిటీ చార్జ్‌ కింద నెలకు రూ.6 లక్షల మేర ఆస్పత్రికి చెల్లించాలని, ఇతర నిబంధనలు కఠినంగా రూపొందించారు. అయితే, ఆ నిబంధనలు కాంట్రాక్టర్‌కు మేలు చేసేలా లేవని, నిబంధనల్లో పెద్దఎత్తున మార్పులు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఆపరేషన్, మెయింటెనెన్స్‌ చేస్తూ ఆస్పత్రికి కాంట్రాక్టు సంస్థ నెలకు రూ.3 లక్షలు చెల్లిస్తే చాలని మార్చడంతో, అస్మదీయ సంస్థ రూ.వెయ్యి మేర అదనంగా కోట్‌ చేసినట్లు తెలుస్తోంది. ఏఎస్‌ఆర్, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, పోలవరం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల నుంచి రోగుల తాకిడి ఎక్కువగా ఉండే కాకినాడ జీజీహెచ్‌లో నెలకు రూ.30 లక్షలకు పైగానే విలువైన క్యాథ్‌ల్యాబ్‌ సేవలు అందించే వీలుంటుందని వైద్యలు అభిప్రాయపడుతున్నారు. ఇలా పదేళ్లకు రూ.40 కోట్ల మేర కాంట్రాక్టు సంస్థకు ఆదాయం సమకూరే అవకాశం ఉంటే, కేవలం 10 శాతంలోపే ఆస్పత్రికి ఫెసిలిటీ చార్జ్‌ చెల్లించనుంది.

సింగిల్‌ బిడ్‌ వచ్చినా ఆమోదం..
ఈ నేపథ్యంలో.. ప్రభుత్వ పెద్దలు వైద్యారోగ్య శాఖను ఆదాయ వనరుగా మార్చేసుకున్నారని పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. అస్మదీయ, కమీషన్ల డీల్‌ కుదుర్చుకున్న సంస్థలకు కాంట్రాక్టులు కట్టబెట్టడానికి అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలున్నాయి. సాధారణంగా సింగిల్‌ బిడ్‌ వస్తే టెండరును రద్దుచేసి, మళ్లీ టెండరుకు వెళ్లాల్సి ఉంటుంది. కానీ, ఇందుకు విరుద్ధంగా ప్రస్తుత క్యాథ్‌ల్యాబ్‌ టెండరులో అస్మదీయ సంస్థ దాఖలు చేసిన ఒక్క బిడ్‌నే ఆమోదించి కాంట్రాక్టును అవార్డు చేయడానికి ప్రభుత్వం చకచకా పావులు కదుపుతోంది. ఇప్పుడు వైద్య వర్గాల్లో ఈ బాగోతం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement