ప్రజలెన్నుకున్నవి కావు.. పాలకులెంచుకున్న ప్రభుత్వాలివి | Political analyst Parakala Prabhakar On Andhra Pradesh Govt | Sakshi
Sakshi News home page

ప్రజలెన్నుకున్నవి కావు.. పాలకులెంచుకున్న ప్రభుత్వాలివి

May 3 2026 5:29 AM | Updated on May 3 2026 5:29 AM

Political analyst Parakala Prabhakar On Andhra Pradesh Govt

ఎన్నికల ప్రక్రియ అపహాస్యం

ఏపీలో ఈసీ లెక్కల ప్రకారమే 132 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు

మే 13 రాత్రి 2.15 గంటల్లో 17,19,482 ఓట్లు పోలయ్యాయి

ఇదెలా సాధ్యమో పాలకులుగానీ, ఈసీగానీ చెప్పడంలేదు

పౌరుడిని చంపకుండా పౌరసత్వాన్ని చంపడమే ఎస్‌ఐఆర్‌ 

ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పరకాల ప్రభాకర్‌

అనంతపురం/అనంతపురం కల్చరల్‌: దేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియను పాలకులు అపహాస్యం చేసి.. ప్రజల అభీష్టానికి విలువ లేకుండా చేశారని ప్రముఖ ఆర్థికవేత్త, రాజకీయ విశ్లేషకులు పరకాల ప్రభాకర్‌ అన్నారు. దేశం ప్రమాదంలో ఉందని, రానున్న రోజుల్లో స్వేచ్ఛగా మాట్లాడే రోజులు ఉండవని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి వికేంద్రీకరణ చర్చా వేదిక ఆధ్వర్యంలో శనివారం అనంతపురంలో ‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపై కీలక చర్చలు’ అనే అంశంపై వేర్వేరు సదస్సులు జరిగాయి. జీఆర్‌ ఫంక్షన్‌ హాలులో సలీం మాలిక్‌ నిర్వహణలో జరిగిన మొదటి సదస్సుకు ఆత్మీయ అతిథిగా విచ్చేసిన పరకాల ప్రభాకర్‌.. ‘రాజ్యాంగం–ఎన్నికలు–ప్రజాస్వామ్యం’, ‘స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌’ అనే అంశాలపై మాట్లాడారు. ఒకప్పుడు ప్రజలు ఎవరిని పాలకులుగా ఎన్నుకోవాలని ఆలోచించే వారని.. కానీ, ఇప్పుడు ఎవరు ఓటర్లుగా ఉండాలని పాలకులు ఆలోచిస్తున్నారని చెప్పారు. 

ఏపీలో ఇటీవలి ఎన్నికల్లో నిమిషానికి మూడుకంటే ఎక్కువ ఓట్లు పడ్డాయని.. ఎన్నికల సంఘం ఇచ్చిన లెక్కల ప్రకారమే 132 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని, ఇదెలా సాధ్యమో పాలకులుగానీ, ఈసీ కానీ చెప్పడంలేదన్నారు. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందన్నారు. ప్రజలు తాము వేద్దామనుకున్న వారికి వారి ఓట్లు పడ్డాయో లేదో తెలియడంలేదన్నారు. ఇలాంటి వాటిని ప్రజలు నిలదీయాలని పరకాల కోరారు. తెల్లవారుజామున 2 గంటల వరకు పోలింగ్‌ జరిగినట్లు ఏపీ ఎన్నికల సంఘం సీఈఓ ప్రకటించారని.. 2024 మే 13 రాత్రి 2.15 గంటల్లో 4.16 శాతం (17,19,482) ఓట్లు పోలయ్యాయన్నారు. ఇక తుది పోలింగ్‌ శాతం ప్రకటించడానికి ఏకంగా నాలుగు రోజుల సమయం పట్టడం మరిన్ని అనుమానాలకు తావిస్తోందని చెప్పారు. మొత్తం మీద అదనంగా 51,83,249 ఓట్లు నమోదయ్యాయనిపరకాల చెప్పారు. 90 శాతం నమోదైతేనే రీపోలింగ్‌ జరుపుతారని, కానీ ఏకంగా 130 శాతానికి పైగా నమోదైనా ఎలాంటి రీపోలింగ్‌ జరపలేదన్నారు. హిందూయేతరులను ఓటర్ల జాబితా నుంచి తొలగించేందుకే స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ చేపడుతున్నారని తెలిపారు. పౌరుడిని చంపకుండా పౌరసత్వాన్ని చంపడమే ఎస్‌ఐఆర్‌ అని విమర్శించారు.

అమరావతిలో రూ.లక్షల కోట్ల వృథా..
ఇక అమరావతిని బలవంతంగా రుద్దుతూ రూ.లక్షల కోట్ల ప్రజాధనాన్ని వృథా చేస్తున్నా మే«ధావులు స్పందించకపోవడం బాధాకరమని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొ. రామచంద్రయ్య అన్నారు. అమరావతికి పెట్టే ఖర్చుతో రాష్ట్రంలోని 15 నగరాలను అద్భుతంగా అభివృద్ధి చెయొచ్చన్నారు. అమరావతికి జనం వచ్చే అవకాశమేలేదని కుండబద్దలు కొట్టారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన విశ్రాంత ప్రిన్సిపాల్‌ ఆచార్య పురుషోత్తమరెడ్డి మాట్లాడుతూ.. అబద్ధాలపైనే ప్రభుత్వాలను ఏర్పాటుచేస్తున్నారని, ఎక్కడా పారదర్శకతలేదని ఆరోపించారు. చంద్రబాబు చెబుతున్న సంపద సృష్టి అంటే ధరలు పెంచడం, పన్నులు రెట్టింపు చేయడమేనని విమర్శించారు. ఇక రెండో సదస్సు ‘ప్రజలకు దూరమవుతున్న వైద్యం’ అనే అంశంపై మానవ హక్కుల వేదిక రాష్ట్ర నాయకులు ఎస్‌ఎం బాషా అధ్యక్షతన జరిగింది.  

Advertisement
 
Advertisement
Advertisement