
సాక్షి, అమరావతి: గతంలో న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా కోడి పందేల నిర్వహణను అడ్డుకుంటున్నామని హైకోర్టుకు పోలీసులు నివేదించారు. కోడి పందేలు, జూదం, ఇతర అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా కఠినంగా వ్యవహరిస్తున్నామని వివరించారు. ఇప్పటికే రెండు కేసులు కూడా నమోదు చేశామని తెలిపారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. కోడి పందేలపై ఇప్పటికే దాఖలైన పిటిషన్‌తో ఈ వ్యాజ్యాలను జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది.
ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కంచిరెడ్డి సురేశ్‌రెడ్డి బుధవారం ఉత్తర్వులిచ్చారు. సంక్రాంతి సందర్భంగా కోడి పందేలు, జూదంతో పాటు అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చర్యలు చేపట్టేలా పోలీసులను ఆదేశించాలని పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలానికి చెందిన పి.రాజవర్ధన్‌రాజు, కొప్పాక విజయరాజు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిని జస్టిస్ సురేశ్‌రెడ్డి బుధవారం విచారించారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది పరిమి రామరాయుడు వాదనలు వినిపిస్తూ.. కోడి పందేలు నిర్వహించకుండా చర్యలు చేపట్టాలని హైకోర్టు ధర్మాసనం 2017లో తీర్పునిచ్చిందన్నారు. దీనిని కఠినంగా అమలు చేసేలా పోలీసులను ఆదేశించాలన్నారు.
ప్రభుత్వ సహాయ న్యాయవాది(హోం) వాదనలు వినిపిస్తూ.. హైకోర్టు ఇచ్చిన తీర్పును ఏటా కఠినంగా అమలు చేస్తున్నామని చెప్పారు. కోడి పందేలపై ఇప్పటికే పిటిషన్ దాఖలైందని, దాని విచారణను హైకోర్టు సంక్రాంతి సెలవుల తరువాతకు వాయిదా వేసిందని వివరించారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. ఇదే అంశంపై దాఖలైన పిటిషన్‌తో ఈ వ్యాజ్యాలను కూడా జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించారు.