
రాష్ట్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయం
ఎస్‌ఈసీ నీలం సాహ్ని
సాక్షి, అమరావతి: రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికలను తొలిసారి ఈవీఎంలతో నిర్వహించే యోచన ఉందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్‌ఈసీ) నీలం సాహ్ని తెలిపారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 4కి సర్పంచులు, మార్చి 17కి పలు మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లు, మున్సిపల్ చైర్మన్ల పదవీకాలం ముగుస్తున్నందున తిరిగి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు వీలుగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ముందస్తు కార్యాచరణ షెడ్యూల్‌ను రూపొందించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో మంగళవారం పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖ అధికారులతో ఎస్‌ఈసీ నీలం సాహ్ని సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పటి వరకు కేవలం మున్సిపల్ ఎన్నికలకు మాత్రమే ఈవీఎంలు వినియోగిస్తున్నామని,పంచాయతీల్లో తొలి నుంచి బ్యాలెట్ విధానమే కొనసాగుతోందని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్ తదితర రాష్ట్రాల్లో పంచాయతీ ఎన్నికలూ ఈవీఎంలతో నిర్వహించారని, మన రాష్ట్రంలోనూ ఆ ఆలోచన ఉందని వివరించారు.
అయితే ఈవీఎంల కొనుగోలు ఖర్చుతో కూడుకున్నది కావడంతో దీనిపై రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్టు వెల్లడించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి చైర్మన్‌గా ఏర్పాటైన కమిటీ చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారని వివరించారు. పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఎన్నికల ప్రక్రియపై చర్చ జరగలేదని, కొత్త ఈవీఎంల కొనుగోలుపై మాత్రం చర్చించామని పేర్కొన్నారు.
ఈవీఎంల తయారీ సంస్థ ఈసీఐ ప్రతినిధులు కొత్త ఎస్ –3 కేటగిరి ఈవీఎం మిషన్లపై పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులకు డెమో రూపంలో వివరించారని చెప్పారు. ఒక వేళ పంచాయతీ ఎన్నికలు ఈవీఎంలతో జరిపితే 41,301 కొత్త ఈవీఎం కంట్రోల్ యూనిట్లు, 82,602 బ్యాలెట్ పేపరు యూనిట్లు కొనుగోలు చేయాల్సి ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల కమిషన్ వద్ద 10,670 ఎం –2 కేటగిరి ఈవీఎం మిషన్లు ఉన్నాయన్నారు. మున్సిపల్ ఎన్నికలు 15,730 వార్డుల్లో జరపాల్సి ఉంటుందని, ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకునే ఈవీఎంలతో కలిపి రాష్ట్ర ఎన్నికల కమిషన్ వద్ద ఉన్నవి మున్సిపల్ ఎన్నికలకు సరిపోవచ్చని పేర్కొన్నారు.