
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఉభయ గోదావరి జిల్లాల్లోని పలు గిరిజన గ్రామాల నుంచి ప్రజలను ఖాళీ చేయిస్తున్నారని, చట్ట ప్రకారం సరైన పరిహారం కూడా చెల్లించడం లేదంటూ స్వచ్ఛంద సంస్థ ‘శక్తి’ డైరెక్టర్ పి.శివరామకృష్ణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. పోలవరం ప్రభావిత కుటుంబాలను బలవంతంగా ఖాళీ చేయించకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఈ వ్యాజ్యంపై సోమవారం ప్రధాన న్యాయమూర్తి (సీజే) అరూప్ కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.
ఈ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది చింతల సుమన్ వాదనలు వినిపిస్తూ.. ఎవరినీ బలవంతంగా ఖాళీ చేయించడం లేదని, చట్ట ప్రకారమే వ్యవహరిస్తున్నామని తెలిపారు. దీనికి స్పందించిన ధర్మాసనం పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పునరావాసం కల్పించకుండా గిరిజన ప్రజలను ఆయా గ్రామాల నుంచి ఖాళీ చేయించకుండా అధికారులకు సూచించాలని సుమన్‌కు ధర్మాసనం తెలిపింది. తదుపరి విచారణను ఈ నెల 24కి వాయిదా వేసింది. పిటిషనర్ తరఫున న్యాయవాది కేఎస్ మూర్తి వాదనలు వినిపించారు.