
చదువుకు వయస్సు అడ్డంకి కాదని నిరూపించిన దేవాంగం రామకృష్ణ
73 ఏళ్ల వయస్సులో ఇంగ్లిష్‌లో డాక్టరేట్
డీఈగా ఉద్యోగ విరమణ చేసిన
అనంతరం ఎస్కేయూలో ఎంఏ ఇంగ్లిష్
అదే సబ్జెక్టులో పీహెచ్‌డీ పూర్తి
శుక్రవారం డాక్టరేట్‌ను ప్రదానం చేసిన వర్సిటీ అధికారులు
జీవిత లక్ష్యాన్ని సాధించానంటున్న రామకృష్ణ
భుజాన స్కై బ్యాగ్‌ను తగిలించుకుని వడివడిగా క్లాస్ రూం వైపు వెళుతుంటే ఎవరో విద్యార్థి అనుకుంటే పొరబడినట్లే.. అలాగని వయసు బేరీజు వేసుకుని ప్రొఫెసర్ అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఇంతకూ అతను ఎవరంటారా? పంచాయతీరాజ్ శాఖలో ఇంజినీర్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన దేవాంగం రామకృష్ణ. చదవాలనే సంకల్పంతో నిత్య విద్యార్థిగా మారి ఇంగ్లిష్‌లో పీహెచ్‌డీ పొందారు. నేటి తరానికి స్ఫూర్తిదాయకంగా నిలిచిన రామకృష్ణ ప్రస్థానంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
అనంతపురం: ఉన్నత చదువులు అభ్యసించడానికి వయసు అడ్డంకి కాదని నిరూపించారు పంచాయతీ రాజ్ శాఖ విశ్రాంత ఇంజినీర్ దేవాంగం రామకృష్ణ. 73 సంవత్సరాల వయస్సులో శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని ఇంగ్లిష్ విభాగంలో డాక్టరేట్ పొందారు. ఇంగ్లిష్ విభాగాధిపతి డాక్టర్ వూటికంటి మాధవి పర్యవేక్షణలో ‘ఏ స్టడీ ఆఫ్ రేసిసమ్, ఫెమినజం, అండ్ కల్చరిజమ్ ఇన్ ద వర్క్స్ ఆఫ్ చిమ మంద’ అంశంపై పరిశోధనకు గాను శుక్రవారం ఆయనకు ఎస్కేయూ పరీక్షల విభాగం అధికారులు డాక్టరేట్ అందజేశారు. ఈ అంశంపై పలు జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్‌ను ఆయన ప్రచురించారు.
మారుమూల పల్లె నుంచి..
శ్రీసత్యసాయి జిల్లా నల్లమాడ మండలంలోని కురుమాల గ్రామానికి చెందిన దేవాంగం రామకృష్ణ... అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. 1980లో సివిల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమో పూర్తి చేసి, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఉన్నత చదువులు అభ్యసించలేక అదే ఏడాది పంచాయతీరాజ్ విభాగంలో వర్క్ ఇన్‌స్పెక్టర్‌గా చేరారు. విధుల్లో భాగంగా డ్రాఫ్ట్‌మెన్, అసిస్టెంట్ ఇంజినీర్‌గా పదోన్నతి దక్కింది. డీఈఈగా పనిచేస్తూ ఉద్యోగ విరమణ పొందారు.
పీజీ సెట్‌లోనూ మెరుగైన ర్యాంకు..
చదవుకోవాలనే ఆసక్తి రామకృష్ణను నిత్య విద్యార్థిగా మార్చేసింది. 2018లో ఎస్కేయూ సెట్‌లో గణనీయమైన ర్యాంకు సాధించి ఇంగ్లిష్ విభాగంలో అడ్మిషన్ పొందారు. 2020లో పీజీ పూర్తి చేశారు. రీసెట్ రాసిన అనంతరం 2022లో పీహెచ్‌డీ అడ్మిషన్ పొందారు. 69 సంవత్సరాల వయస్సులో పీహెచ్‌డీ అడ్మిషన్ పొందడానికి నిబంధనలు అడ్డు తగిలాయి. దీంతో ఇంగ్లిష్ విభాగాధిపతి డాక్టర్ వి. మాధవి చొరవ తీసుకుని ఉన్నతాధికారులతో చర్చించారు. వయస్సు నిబంధనను సడలించి అడ్మిషన్ కల్పించారు. అప్పటి నుంచి రోజూ క్రమం తప్పకుండా విభాగానికి హాజరై అందరినీ అబ్బురపరిచేవారు. వయసులో తన కంటే చిన్నవారిని గౌరవిస్తూ.. ప్రొఫెసర్ల పట్ల వినయవిధేయతలు చాటుకుంటూ స్టూడెంట్ నంబర్ వన్‌గా అందరితో ఆత్మీయంగా పిలిపించుకునేవారు.
మాకు అందరికీ స్ఫూర్తినిచ్చారు
పీజీలో దేవాంగం రామకృష్ణ క్రమం తప్పకుండా తరగతులకు హాజరయ్యేవారు. పీహెచ్‌డీలో అడ్మిషన్ తీసుకుని ఒక వైపు పరిశోధన చేస్తూనే..మరో వైపు పీజీ (ఇంగ్లిష్) విద్యార్థులకు తరగతులు తీసుకున్నారు. 74 సంవత్సరాల వయస్సులోనూ ఎంతో చురుగ్గా అన్ని అంశాలను అధ్యయనం చేశారు. మా విద్యార్థులకు, అధ్యాపకులందరికీ రామకృష్ణ ఎంతో స్పూర్తినిచ్చారు. – డాక్టర్ వూటికంటి మాధవి, ఇంగ్లిష్ విభాగాధిపతి
ఎస్కేయూ చరిత్రలోనే నూతన అధ్యాయం
74 సంవత్సరాల వయస్సులో పీహెచ్‌డీ చేయాలనుకోవడం అభినందనీయం. ఎస్కేయూ పరిధిలో అతి ఎక్కువ వయస్సులో పీహెచ్‌డీ పూర్తి చేసిన వ్యక్తిగా రామకృష్ణ ఖ్యాతి దక్కించుకున్నారు. ఎస్కేయూ చరిత్రలోనే ఇది నూతన అధ్యాయం. చదవాలనే ఆకాంక్ష ఉంటే వయస్సు అడ్డు కాదని నిరూపించిన రామకృష్ణకు అభినందనలు.
– ప్రొఫెసర్ జి. వెంకటనాయుడు, రెక్టార్, ఎస్కేయూ