గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా రాజన్న దొర బాధ్యతలు

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయాలకి అనుగుణంగా గిరిజనుల సంక్షేమానికి కృషి చేస్తానని మంత్రి పీడిక రాజన్న దొర అన్నారు. గురువారం ఆయన సచివాలయంలోని రెండవ బ్లాక్ లో గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, లాభసాటి వ్యవసాయం వైపు గిరిజనులని ప్రోత్సహిస్తామని.. విద్య, వైద్యం గిరిజనులకి అందేలా అన్ని ఐటీడీఎ పరిధిలో ఏరియా ఆసుపత్రులని నిర్మాణం చేస్తున్నామని.. ప్రతీ మండలానికి రెండు కళాశాలలు నిర్మిస్తామని రాజన్నదొర అన్నారు.
చదవండి: మంత్రిగా అంబటి రాంబాబు బాధ్యతలు
రాజకీయ నేపథ్యం:
1985లో 21 ఏళ్ల వయస్సులో జీసీసీలో జూనియర్ మేనేజర్‌గా చేరి ఉమ్మడి ఆంధ్రలో వివిధ ప్రాంతాల్లో పనిచేసిన ఆయన 2004లో స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. 2004లో కాంగ్రెస్ తరఫున సాలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయినా.. తనపై గెలిచిన టీడీపీ ఎమ్మెల్యే ఆర్‌పీ భంజ్‌దేవ్ గిరిజనుడు కాదని కోర్టులో నిరూపించి 2006లో ఎమ్మెల్యేగా అవకాశం పొందారు. 2009లో కాంగ్రెస్ తరఫున, 2014, 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నియ్యారు.