సర్దుబాటు చేస్తారా? చేతులెత్తేస్తారా? | Outsourcing Teachers Fires On Chandrababu Govt: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

సర్దుబాటు చేస్తారా? చేతులెత్తేస్తారా?

May 10 2026 4:49 AM | Updated on May 10 2026 4:49 AM

Outsourcing Teachers Fires On Chandrababu Govt: Andhra Pradesh

విజయవాడలో ఆందోళన చేస్తున్న గిరిజన అవుట్‌సోర్సింగ్‌ టీచర్లు (ఫైల్‌)

చంద్రబాబు ప్రభుత్వ తీరుతో గిరిజన అవుట్‌ సోర్సింగ్‌ టీచర్ల జీవితాల్లో చీకట్లు 

పలు కారణాలతో కొద్దిరోజులుగా ఆరుగురు మృతి 

గతంలో వీరి పట్ల మానవత్వం చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 

చంద్రబాబు మాత్రం ఎన్నికల ముందు ఆదుకుంటానని.. అధికారంలోకి వచ్చాక పట్టించుకోని వైనం 

డీఎస్సీ నియామకాలతో రోడ్డున పడుతున్న 1,118 మంది అవుట్‌ సోర్సింగ్‌ టీచర్లు 

ఏప్రిల్‌ 24తో ముగిసిన కొలువు.. జూన్‌లో రెన్యువల్‌ చేస్తారా ? చేతులెత్తేస్తారా అని డైలమా ? 

వచ్చే విద్యా సంవత్సరంలో రెగ్యులర్‌పై స్పష్టత ఇవ్వని ప్రభుత్వం  

ఇతని పేరు జర్సింగి పొట్టన్న(43). అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల గిరిజన బాలుర గురుకులంలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా సుదీర్ఘకాలం పనిచేశాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 18న విధినిర్వహణలో ఉండగానే బ్రెయిన్‌ స్ట్రోక్‌తో చనిపోయాడు. సుమారు 17 ఏళ్లు అవుట్‌ సోర్సింగ్‌ టీచర్‌గా సేవలు అందించిన అతనికి ఉద్యోగ భద్రత లేకపోగా.. అతని కుటుంబానికి ప్రభుత్వం ఆసరా కల్పించలేదు.  

⇒  ఇతని పేరు బి.చంద్రబాబు నాయక్‌. వైఎస్సార్‌ జిల్లా కడప గిరిజన బాలుర గురుకులంలో ఏడేళ్లు పీఈటీగా సేవలు అందించారు. ఈ ఏడాది మార్చి 10న బ్రెయిన్‌ స్ట్రోక్‌తో మృతి చెందారు.

సాక్షి, అమరావతి:  వీరేకాదు.. ఇంకా పీలేరు గురుకులంలో ఇంగ్లిష్‌ టీచర్‌గా ఏడేళ్లు సేవలు అందించిన ప్రకాశ్‌బాబు అనారోగ్యంతో మృతి చెందాడు. మారేడుమిల్లి గురుకులంలో పదేళ్లుగా సేవలు అందిస్తున్న చెక్క అబ్బాయిరెడ్డి రోడ్డు యాక్సిడెంట్‌లో చనిపోయారు. ఇలా గడిచిన నాలుగు నెలల్లో దాదాపు ఆరుగురికిపైగా గిరిజన అవుట్‌ సోర్సింగ్‌ టీచర్లు మృత్యువాత పడటంతో వారి కుటుంబాలు ఆధారం కోల్పోయాయి. అనారోగ్యం తదితర కారణాలతో అవుట్‌ సోర్సింగ్‌ టీచర్ల బతుకులు తెల్లారిపోతున్నా.. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం కనీస కనికరం చూపడంలేదు.

మృతి చెందిన వారికి ఇస్తామన్న రూ.15వేలు మట్టి ఖర్చులు కూడా విదల్చలేదు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మట్టి ఖర్చులతోపాటు మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.2లక్షలు ఇచ్చి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మానవత్వం చాటుకున్నారని గిరిజన అవుట్‌ సోర్సింగ్‌ టీచర్లు గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పటికే అవుట్‌ సోర్సింగ్‌ టీచర్‌ పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేయడంతో దాదాపు 8 నుంచి 15ఏళ్లుగా సేవలు అందిస్తున్నవారి జీవితాలు గాలిలో దీపంలా మారాయి.   

ఎన్నికల హామీని పూర్తిగా పక్కనపెట్టి.. 
రాష్ట్రంలోని 191 గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో మొత్తం 1,659 మంది అవుట్‌ సోర్సింగ్‌ టీచర్లు పనిచేసేవారు. ప్రభుత్వం ఇచ్చే జీతాలు చాలక, ఉద్యోగ భద్రత లేకపోవడం వంటి కారణాలతో వారిలో కొందరు ఉద్యోగాలు మానేయడంతో ప్రస్తుతం 1,143 మంది పని చేస్తున్నారు. వారి పోస్టులను ఇటీవల డీఎస్సీ ద్వారా భర్తీ చేశారు. ఆ పోస్టుల్లో 1,118 మంది రెగ్యులర్‌ టీచర్లు విధుల్లోకి చేరడంతో, అవుట్‌ సోర్సింగ్‌ టీచర్లు ఉద్యోగం కో ల్పోయి రోడ్డున పడే పరిస్థితి దాపురించింది. వీరి లో ప్రధానంగా జోన్‌–1లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలకు చెందిన అవుట్‌సోర్సింగ్‌ టీచర్లే ఎక్కువమంది ఉండడం గమనార్హం.

ఏప్రిల్‌ 24తో ముగిసిన కొలువు.. 
అవుట్‌సోర్సింగ్‌ టీచర్లను కాంట్రాక్టు పద్ధతిలోకి మార్చి ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు ఎక్కడో ఒకచోట సర్దుబాటు చేస్తామని చంద్రబాబు ఎన్నికల సమయంలో వీరికి హామీ ఇచ్చారు. ఇదే విషయమై అనేక పర్యాయాలు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, అధికారులతో అవుట్‌ సోర్సింగ్‌ టీచర్ల యూనియన్‌ నేతలు చర్చలు జరిపినా కనీస కనికరం చూపడంలేదు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేస్తూ 2024 నవంబర్‌ నుంచి దాదాపు 45 రోజులపాటు శాంతియుతంగా పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహించారు.

డీఎస్సీలో రెగ్యులర్‌ పోస్టులు భర్తీ చేసినా మీకు ఇబ్బంది లేకుండా చూస్తామని, ఎక్కడో ఒక చోట సర్దుబాటు చేస్తామని, ఉద్యోగ భద్రత కలి్పస్తామని మరోమారు ప్రభుత్వ పెద్దలు చర్చల సందర్భంగా మాట ఇవ్వడంతో ఆందోళన విరమించి విధుల్లోకి చేరారు. తీరా.. ప్రభుత్వం నమ్మించి దగా చేసిందని, హామీలు గాలికి వదిలేసి తమను రోడ్డుపైకి పడేసిందని వాపోతున్నారు. నెలల తరబడి వేతనాలు రాకపోవడంతో అవస్థలు పడుతున్న వారిని కాంట్రాక్ట్‌ పద్దతిలోకి మార్చి ఉద్యోగ భద్రత కల్పించాలని, పనికి తగిన వేతనం ఇవ్వాలని జాతీయ ఎస్టీ కమిషన్‌ సూచించినా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు.

గిరిజన గురుకులాల్లో దాదాపు 10 నుంచి 18 ఏళ్లుగా అడవి బిడ్డలకు అక్షర జ్ఞానం అందించిన వారికి ఏప్రిల్‌ 24వ తేదీతో కొలువు ముగిసింది. వేసవి సెలవులు ముగిసిన అనంతరం జూన్‌లో వారిని రెన్యూవల్‌ చేసి వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొనసాగించే విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో మరింత ఆందోళనకు గురవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement