ఏపీలో 4 వేల ‘ఈవీ’ చార్జింగ్‌ స్టేషన్లు

NREDCAP to Setup 4000 Electric Vehicle Charging Stations in Andhra Pradesh - Sakshi

ప్రభుత్వ ఉద్యోగులకు ఎలక్ట్రిక్‌ టూవీలర్ల కోసం ప్రత్యేక పథకం

తిరుపతిలో 200, విశాఖపట్నం నగరంలో 100 ఎలక్ట్రిక్‌ త్రీ వీలర్లు

ప్రస్తుతం ఉన్న ఆటోల ఇంజన్లు తీసి వాటి స్థానంలో మోటార్లు

విద్యుత్‌ సౌధలో ‘గో ఎలక్ట్రిక్‌’ ప్రచారం  

సాక్షి, అమరావతి:  ప్యాసింజర్‌ ఆటోలను రెట్రోఫిట్టింగ్‌ చేసి ఎలక్ట్రిక్‌ వాహనాలుగా మార్చే ప్రక్రియ ప్రారంభమయ్యింది. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్‌లో 4 వేల ఎలక్ట్రిక్‌ వెహికల్‌ (ఈవీ) చార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు అవసరమైన ప్రాంతాలను న్యూ రెన్యూవబుల్‌ ఎనర్జీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (ఎన్‌ఆర్‌ఈడీసీఏపీ) గుర్తించింది. అదే విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఎలక్ట్రిక్‌ టూవీలర్ల కోసం ప్రత్యేక పథకాన్ని తీసుకొచ్చింది. మరోవైపు తిరుపతిలో 200, విశాఖపట్నంలో 100 త్రీ వీలర్లను ఎలక్ట్రిక్‌ వాహనాలుగా మార్చనుంది. ప్రభుత్వ సూచనల మేరకు ఎన్‌ఆర్‌ఈడీసీఏపీ, ఆంధ్రప్రదేశ్‌ ఇంధన సంరక్షణ మిషన్‌(ఏపీఎస్‌ఈసీఎం) సంయుక్తంగా ఈ బాధ్యతలను తలకెత్తుకున్నాయి. ఈవీ వాహనాలను పరీక్షించడానికి ఒక టెస్టింగ్‌ ల్యాబ్‌ను ఏర్పాటు చేసేందుకు ఇంటర్నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఆటోమోటివ్‌ టెక్నాలజీతో నెడ్‌కాప్‌ ఒప్పందం కుదుర్చుకుంది. 

వాయిదాల్లో విద్యుత్‌ వాహనాలు 
నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్, సెంట్రల్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు నివేదిక ప్రకారం.. తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాల్లో, రాజమండ్రి, విజయవాడ నగరాలతో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో గాలి నాణ్యత ప్రామాణిక నాణ్యతకన్నా తక్కువగా ఉంది. దీనిని పెంచడానికి ద్విచక్ర వాహనాలన్నీ ఈవీలుగా మారాలి. ఈ ఉద్దేశంతో ప్రభుత్వ సూచనల మేరకు ప్రభుత్వ ఉద్యోగులకు నెడ్‌కాప్‌ వాయిదా పద్ధతిలో విద్యుత్‌ ద్విచక్ర వాహనాలను అందించడానికి ఒక పథకాన్ని రూపొందించింది. రుణాల కోసం ధనలక్ష్మి బ్యాంక్, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాతో ఒప్పందం కుదుర్చుకుంది. వడ్డీ రేటు కేవలం 9 శాతం మాత్రమే. కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాల్లో ఇప్పటికే పథకాన్ని ప్రారంభించింది. ఒక ఈవీ టూ వీలర్‌ వల్ల ఏటా సగటున రూ.42,300 వరకు ఆదా అవుతుందని అంచనా. 

ఆటోలతోనే మార్పు మొదలు 
ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం పెరగాలంటే అపార్ట్‌మెంట్లు, పార్కులు, సినిమాహాళ్లు, షాపింగ్‌ మాల్స్, పెట్రోల్‌ బంకులు, జాతీయ రహదారుల్లో చార్జింగ్‌ స్టేషన్లు అందుబాటులో ఉండాలి. బ్యాటరీని కూడా అక్కడే మార్చుకునే (స్వాపింగ్‌) వీలుండాలి. దీనికోసమే నెడ్‌కాప్‌ రాష్ట్రంలో 4వేల స్థలాలను గుర్తించింది. ఈవీ స్టేషన్ల ఏర్పాటుకు 10 మంది డెవలపర్స్‌ను నమోదు చేసింది. ప్యాసింజర్‌ ఆటోలను రెట్రోఫిట్టింగ్‌ చేసి ఎలక్ట్రిక్‌ వాహనాలుగా మార్చాలని నిర్ణయించింది. అంటే ప్రస్తుతం నడుస్తున్న పెట్రోల్, డీజిల్‌ ఆటోల్లోని ఐసీ ఇంజన్‌ను తొలగించి, దాని స్థానంలో ఎలక్ట్రిక్‌ మోటార్‌ అమరుస్తారు. బ్యాటరీ సాయంతో ఆ మోటార్‌ పనిచేస్తుంది.

తిరుపతిలో మూడు ఆటోలను ప్రయోగాత్మకంగా ఇలా మార్చి ఇప్పటికే నడిపిస్తున్నారు. దీనికి రూ.2.50 లక్షల ఖర్చు కానుండగా.. వాహనదారుడు కేవలం రూ.10 వేలు మాత్రమే డౌన్‌ పేమెంట్‌ కడితే సరిపోతుంది. మిగతా రూ.2.40 లక్షల్లో రూ.80 వేలు ఏపీఎస్‌ఈసీఎం అందజేస్తుంది. మిగిలిన మొత్తాన్నీ ప్రైవేటు డెవలపర్స్‌ ద్వారా నెడ్‌కాప్‌ సమకూరుస్తుంది. ఈ మొత్తం రుణాన్ని వాహనదారుడు ప్రతిరోజూ ఆటో చార్జింగ్‌ పెట్టుకోవడానికి ఈవీ స్టేషన్‌కు వెళ్లినపుడు చెల్లించాల్సి ఉంటుంది. ఆ రోజుకి ఈవీ వల్ల ఆదా అయిన పెట్రోల్, డీజిల్‌ ఖర్చునే వాయిదాగా కడితే సరిపోతుంది. 

అవగాహన కోసం ‘గో ఎలక్ట్రిక్‌’ ప్రచారం 
రాష్ట్రంలో ఎలక్ట్రిక్‌ వాహనాల విప్లవాన్ని తీసుకురావాలనే లక్ష్యంతో, ఈవీల వినియోగంపై అవగాహన కల్పించడానికి ‘గో ఎలక్ట్రిక్‌’ ప్రచారాన్ని నెడ్‌కాప్, ఏపీఎస్‌ఈసీఎంలు శుక్రవారం విజయవాడలోని విద్యుత్‌ సౌధలో ప్రారంభించాయి. కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) సహకారంతో ఈవీ టూ వీలర్స్, త్రీ వీలర్స్, ఫోర్‌ వీలర్స్, సైకిల్‌ ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేశాయి. అనంతరం ఈవీ వాహనాలతో రోడ్‌ షో నిర్వహించాయి. ఏపీ ట్రాన్స్‌కో జేఎండీ బి.మల్లారెడ్డి, డైరెక్టర్లు ఓ ముత్తుపాండియన్, ఎ.చంద్రశేఖరరాజు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top