ఆంధ్రప్రదేశ్‌లో బర్డ్‌ ఫ్లూ లేదు: అమరేంద్ర కుమార్‌

No Case Of Bird Flu In Andhra Pradesh: Amarendra Kumar - Sakshi

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో బర్డ్‌ ఫ్లూ లేదని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్‌ డా.అమరేంద్ర కుమార్‌ స్పష్టం చేశారు. కేరళ, రాజస్ధాన్, హిమాచల్‌ ప్రదేశ్, మధ్యప్రదేశ్ లాంటి కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే బర్డ్ ఫ్లూ ఉందని, ఇప్పటివరకు ఏపీలో ఎక్కడా బర్డ్‌ఫ్లూ కేసులు నమోదు కాలేదని పేర్కొన్నారు. కాబట్టి ప్రజలు నిరభ్యంతరంగా చికెన్‌ తినొచ్చని చెప్పారు. అన్ని జిల్లాల్లో పశు సంవర్ధక శాఖ అధికారులతో సమీక్షించామని తెలిపారు. పౌల్ట్రీ పరిశ్రమ పరిశ్రమ కూడా అప్రమత్తంగానే ఉందన్నారు. (చదవండి: దేశంలో విస్తరిస్తున్న కొత్త కరోనా)

బుధవారం నాడు ఆయన 'సాక్షి'తో మాట్లాడుతూ "ఏపీలో ఏటా సుమారు లక్షకు పైగా పక్షులు వలస వస్తుంటాయి. కొల్లేరు, పులికాట్‌, నేలపట్టు, కోరంగి ప్రాంతాలకి పక్షులు ఎక్కువ వలస వస్తుంటాయి. వలస పక్షుల ద్వారా బర్డ్‌ ఫ్లూ వ్యాప్తి చెందే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో అటవీ, వైద్య ఆరోగ్య శాఖలతో కలిసి పర్యవేక్షణ చేస్తున్నాం. బర్డ్‌ ఫ్లూ లక్షణాలతో పక్షులు, కోళ్లు చనిపోతే మా దృష్టికి తీసుకురావాలని అటవీ శాఖని కోరాం. ఏవైనా కేసులు వస్తే భోపాల్‌లోని‌ ల్యాబ్‌కు పంపి నిర్ధారణ చేసుకోవాల్సి ఉంటుంది. పరిస్ధితులను బట్టి జిల్లా స్ధాయిలో కలెక్టర్ల అధ్యక్షతన టాస్క్ ఫోర్స్ కమిటీలు ఏర్పాటు చేస్తాం" అని అమరేంద్ర కుమార్‌ తెలిపారు. (చదవండి: బర్డ్‌ ఫ్లూ మనుషులకు సోకుతుందా?)

బర్డ్‌ ఫ్లూపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్‌
హైదరాబాద్: ఇప్పటికే కరోనాతో హడలెత్తిపోనున్న జనాలకు బర్డ్‌ ఫ్లూ భయం పట్టుకుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పశుగణాభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి వెటర్నరీ, పశు సంవర్ధక శాఖలోని ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి రాష్ట్రంలో బర్డ్‌ ఫ్లూ రాకుండా చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. వలస పక్షుల రాకపై ఆరా తీసి అప్రమత్తం కావాలని సూచించారు. ప్రతిరోజు ఫౌడ్రీ ఫారాల్లో చనిపోయే కోళ్ల శాంపిల్స్‌ను వీబీటీఐకి పంపి పరీక్షించాలని ఆదేశించారు.

సమావేశం అనంతరం మంత్రి తలసాని మీడియాతో మాట్లాడుతూ..బర్ద్ ఫ్లూ విషయంలో ప్రభుత్వం అనేక జాగ్రత్తలు తీసుకుంటోందన్నారు. 1300 మందితో ఉన్న టీమ్స్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఫామ్‌లలో తిరుగుతూ సూచనలు తీసుకుంటున్నారని చెప్పారు. వలస పక్షుల ద్వారా కొన్ని ప్రాంతాల్లో ఎఫెక్ట్ ఉండొచ్చే తప్ప ఫ్లూ ఎఫెక్ట్ ఏమాత్రం ఉండదని స్పష్టం చేశారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, అధికారులంతా అలర్ట్‌గా ఉన్నారని తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top