పోలవరంలో  రెండు రకాలుగా ఎన్‌హెచ్‌పీసీ బృందం పరీక్షలు.. 

NHPC Team Tests On Diaphragm Wall In Polavaram - Sakshi

సాక్షి, అమరావతి: గత సర్కారు నిర్వాకాలతో గోదావరి వరదలకు దెబ్బతిన్న పోలవరం ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ (ఈసీఆర్‌ఎఫ్‌) డ్యామ్‌ గ్యాప్‌–2 పునాది అయిన డయాఫ్రమ్‌ వాల్‌ సామర్థ్యాన్ని తేల్చే పరీక్షలు శుక్రవారంతో పూర్తయ్యాయి. ఈ డేటాను ఎన్‌హెచ్‌పీసీ (నేషనల్‌ హైడ్రో పవర్‌ కార్పొరేషన్‌) బృందం సమగ్రంగా విశ్లేషించి డయాఫ్రమ్‌ వాల్‌ భవితవ్యంపై రెండు వారాల్లోగా పోలవరం ప్రాజెక్టు అథారి­టీ(పీపీఏ), కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ), రాష్ట్ర జలవనరుల శాఖకు నివేదిక ఇవ్వనుంది. దాని  ఆధారంగా సీడబ్ల్యూసీ మార్గదర్శకాల మేరకు డయాఫ్రమ్‌ వాల్‌ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేయనుంది. డయాఫ్రమ్‌ వాల్‌ పటిష్టంగానే ఉన్నట్లు ఎన్‌హెచ్‌పీసీ తేల్చితే ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ పనులకు మార్గం సుగమం అవుతుంది.  

స్పిల్‌ వే, స్పిల్‌ చానల్, కాఫర్‌ డ్యామ్‌లను పూర్తి చేయకుండా..  
గోదావరి వరదను మళ్లించేలా స్పిల్‌ వే, స్పిల్‌ చానల్, ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లను పూర్తి చేయకుండానే టీడీపీ సర్కార్‌ ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ గ్యాప్‌–2లో 1,750 మీటర్ల పొడవున డయాఫ్రమ్‌ వాల్‌ను నిర్మించింది. గోదావరికి 2019లో భారీ వరదలు రావడం.. ఎగువ కాఫర్‌ డ్యామ్‌ ఖాళీ ప్రదేశాల గుండా అధిక ఉద్ధృతితో ప్రవహించడం వల్ల డయాఫ్రమ్‌ వాల్‌ దెబ్బతింది. డయాఫ్రమ్‌ వాల్‌ భవితవ్యం తేలితేగానీ ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ నిర్మించలేని దుస్థితి నెలకొంది. చంద్రబాబు సర్కారు నిర్వాకాల వల్ల పోలవరం పనుల్లో జాప్యం చోటు చేసుకుంటోంది.  

16 రోజులు.. రెండు రకాల పరీక్షలు 
డయాఫ్రమ్‌ వాల్‌ భవితవ్యాన్ని తేల్చే పరీక్షలను నిర్వహించడంపై రాష్ట్ర ప్రభుత్వం 2020 నుంచి పీపీఏ, డీడీఆర్పీ (డ్యామ్‌ డిజైన్‌ రివ్యూ ప్యానల్‌), సీడబ్ల్యూసీ అధికారులు, ఐఐటీ ప్రొఫెసర్లతో చర్చించింది. సీడబ్ల్యూసీ 2022లో చేసిన సూచనల మేరకు ఈ బాధ్యతను ఎన్‌హెచ్‌పీసీకి అప్పగించింది. ఈ ఏడాది జనవరి 26వ తేదీన నేషనల్‌ హ్రెడ్రోపవర్‌ కార్పొరేషన్‌(ఎన్‌హెచ్‌పీసీ) ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఎస్‌.ఎల్‌.కపిల్‌ నేతృత్వంలో జియో ఫిజిక్స్‌ విభాగంలో నిపుణులైన సంస్థ సీనియర్‌ మేనేజర్లు ఎ.విపుల్‌ నాగర్, ఎన్‌.కె.పాండే, ఎంపీ సింగ్‌లతో కూడిన బృందం పోలవరానికి చేరుకుంది. డయాఫ్రమ్‌ వాల్‌ సామర్థ్యాన్ని తేల్చేందుకు హై రిజల్యూషన్‌ జియోఫిజికల్‌ రెసిస్టివిటీ ఇమేజింగ్‌ విధానం, సెస్మిక్‌ టోమోగ్రఫీ విధానం ప్రకారం ఒకే సారి పరీక్షలను ప్రారంభించింది. ఇవి తాజాగా పూర్తయ్యాయి. మొత్తం 16 రోజులపాటు ఈ పరీక్షలు నిర్వహించినట్లు 
స్పష్టమవుతోంది.   

పరీక్షలు నిర్వహించారు ఇలా..
ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ గ్యాప్‌–2లో డయాఫ్రమ్‌ వాల్‌ సామర్థ్యాన్ని తేల్చేందకు ఎన్‌హెచ్‌పీసీ బృందం రెండు రకాల పరీక్షలు నిర్వహించింది. వాటిని ఎలా నిర్వహించారంటే.. 
హై రిజల్యూషన్‌ జియో ఫిజికల్‌ రెసిస్టివిటీ విధానం ఈసీఆర్‌ఎఫ్‌ గ్యాప్‌–2లో నిర్మించిన 1,750 మీటర్ల డయాఫ్రమ్‌ వాల్‌ పొడవునా ప్రతి మీటర్‌కు ఒకచోట 20 మిల్లీమీటర్లు (ఎంఎం) వ్యాసంతో 1.5 అడుగుల లోతుతో వేసిన రంధ్రాల్లోకి ఎలక్ట్రోడ్‌లను పంపి వాటి ద్వారా విద్యుత్‌ తరంగాలను ప్రసారం చేసి హైరిజల్యూష్‌ జియో ఫిజికల్‌ రెసిస్టివిటీ ఇమేజింగ్‌ విధానంలో ఎన్‌హెచ్‌పీసీ బృందం పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షల ద్వారా తీసిన 3–డి చిత్రాలను విశ్లేషించి డయాఫ్రమ్‌ వాల్‌ సామర్థ్యాన్ని తేల్చనుంది.  

సెస్మిక్‌ టోమోగ్రఫీ పరీక్ష.. 
ఈసీఆర్‌ఎఫ్‌ గ్యాప్‌–2లో 1,750 మీటర్ల పొడవున డయాఫ్రమ్‌ వాల్‌కు ఒక మీటర్‌ ఎగువన, ఒక మీటర్‌ దిగువన 60 మి.మీ. వ్యాసంతో 30 నుంచి 40 అడుగుల లోతు వరకూ ప్రతి 40 మీటర్లకు ఒక బోరు బావిని జిగ్‌ జాగ్‌ విధానంలో తవ్వారు. అందులోకి ఎలక్ట్రోడ్‌లను పంపి విద్యుత్‌ తరంగాలను ప్రసారం చేసి పరీక్షలు నిర్వహించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top