కమిటీ మాట... పోలవరంలో నీటి మూట | Field visit to Polavaram for three days starting today | Sakshi
Sakshi News home page

కమిటీ మాట... పోలవరంలో నీటి మూట

Aug 29 2025 2:59 AM | Updated on Aug 29 2025 2:59 AM

Field visit to Polavaram for three days starting today

అంతర్జాతీయ నిపుణుల కమిటీ గతంలో చేసిన సిఫార్సులపై చర్యల్లేవ్‌...!

నేటి నుంచి మళ్లీ మూడు రోజుల పాటు పోలవరంలో క్షేత్రస్థాయి పర్యటన 

సీడబ్ల్యూసీ అధికారులతో కలిసి ప్రాజెక్టు అథారిటీ, రాష్ట్ర జలవనరుల అధికారులతో సమీక్ష 

గత పర్యటనలో డయా ఫ్రం వాల్‌ నిర్మాణ పనుల్లో లోపాలను ఎత్తిచూపిన కమిటీ

»  పోలవరం డయాఫ్రం వాల్‌ నిర్మాణంలో వినియోగిస్తున్న కాంక్రీట్‌ మిశ్రమం ఉష్ణోగ్రత 32 కాకుండా.. 35 డిగ్రీలు ఉండడం, నీటి శాతం అధికంగా ఉండడంతో తొమ్మిది ప్యానళ్ల పరిధిలో బ్లీడింగ్‌ (సీపేజీ) అవుతోంది. 

» సీడబ్ల్యూసీ (కేంద్ర జల సంఘం) ఆమోదించిన డిజైన్‌కు విరుద్ధంగా 1.5 మీటర్ల మందంతో నిర్మించాల్సిన డయాఫ్రం వాల్‌ను 0.9 మీటర్ల మందంతో నిర్మిస్తున్నారు. దీనిపై తక్షణమే సమీక్షించి, తగిన నిర్ణయం తీసుకోవాలి. 

»  జాతీయ ప్రాజెక్టు పోలవరం నిర్మాణ పనులపై అంతర్జాతీయ నిపుణుల కమిటీ చేసిన సిఫార్సులు ఇవి. గత పర్యటనల్లో నిపుణుల కమిటీ చేసిన ఈ సూచనలపై అటు పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ), ఇటు రాష్ట్ర జల వనరుల శాఖ అధికారులు ఏం చర్యలు తీసుకోలేదు. కమిటీ ఎత్తిచూపిన లోపాలను విస్మరించారని సాగునీటి రంగ నిపుణులు విమర్శిస్తున్నారు. కమిటీ సిఫార్సుల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం మీనవేషాలు లెక్కిస్తోందని ఆక్షేపిస్తున్నారు.  

సాక్షి, అమరావతి : పోలవరం నిర్మాణంపై సూచనలు సలహాలకు సియాన్‌ హించ్‌బెర్గర్, మెస్సర్స్‌ సీ రిచర్డ్‌ డొన్నెళ్లి, గియానోఫ్రాంకో డి క్యాప్పో, డేవిడ్‌ పాల్‌ సభ్యులుగా కేంద్రం నియమించిన అంతర్జాతీయ కమిటీ ఐదోసారి ప్రాజెక్టును పరిశీలించడానికి గురువారం రాత్రి రాజమహేంద్రవరానికి చేరుకుంది.

శుక్రవారం నుంచి ఈ నెల 31 వరకూ ప్రాజెక్టు పనులను తనిఖీ చేయనుంది. గత పర్యటనల్లో తాము చేసిన సిఫార్సుల అమలును పీపీఏ, రాష్ట్ర అధికారులు, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులతో సమీక్షించనుంది. ఈ కమిటీ ఇప్పటికే నాలుగుసార్లు ప్రాజెక్టును పరిశీలించింది. పనులపై కేంద్రానికి నివేదిక ఇచ్చింది. 

అంతర్జాతీయ నిపుణుల కమిటీ మే 5 నుంచి 9 వరకు పోలవరం ప్రాజెక్టును క్షేత్ర స్థాయిలో పరిశీలించింది.  జూన్‌ 4న పీపీఏ, సీడబ్ల్యూసీలకు నివేదిక ఇచ్చింది. ప్రాజెక్టు పనుల్లో లోపాలను ఎత్తిచూపుతూ.. చేపట్టాల్సిన చర్యలను నివేదికలో సిఫార్సు చేసింది. 

» పోలవరం భద్రత దృష్ట్యా ప్రధాన డ్యాం గ్యాప్‌–2లో దెబ్బతిన్న డయా ఫ్రం వాల్‌ స్థానంలో కొత్త డయా ఫ్రం వాల్‌ నిర్మించడం శ్రేయస్కరమని ఈ కమిటీ చేసిన సూచనను సీడబ్ల్యూసీ కూడా ఆమోదించింది.   

సబ్‌ కాంట్రాక్టు సంస్థ నిర్వాకం 
రూ.990 కోట్ల వ్యయంతో చేపట్టిన కొత్త డయా ఫ్రం వాల్‌ పనులను బావర్‌ సంస్థ సీడబ్ల్యూసీ ఆమోదించిన డిజైన్‌ను తుంగలో తొక్కి 1.5 మీటర్ల (1,500 మిల్లీమీటర్లు) మందంతో కాకుండా 0.9 మీటర్ల (900 మిల్లీమీటర్లు) మందంతో చేస్తోందని అంతర్జాతీయ నిపుణుల కమిటీ తప్పుబట్టింది. దీనిపై తక్షణమే సమీక్షించి.. మందం తగ్గించినందున ఎలాంటి పరిణామాలు జరుగుతాయన్నది విశ్లేషించి, సముచిత నిర్ణయం తీసుకోవాలని పీపీఏకు అంతర్జాతీయ నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది.  

» ఏప్రిల్‌ వరకు డయా ఫ్రం వాల్‌ పనుల్లో 373 ప్యానళ్లు వేయాల్సి ఉండగా, 52 ప్యానళ్ల పరిధిలోనే పనులు పూర్తయ్యాయి. ఇందులో 9 ప్యానళ్ల పరిధిలో డయాఫ్రం వాల్‌ పైభాగంలో 1 నుంచి 2 మీటర్ల లోతు వరకు నీటి బుడగలు బయటకు వస్తున్నట్లు (సీపేజీ) అంతర్జాతీయ నిపుణుల కమిటీ గుర్తించింది. డయాఫ్రం వాల్‌లో వినియోగించే ప్లాస్టిక్‌ కాంక్రీట్‌ మిశ్రమం 32 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద నాణ్యంగా ఉంటుందని గతంలో అధికారులకు చెప్పామని, కానీ, పోలవరంలో వినియోగిస్తున్న ప్లాస్టిక్‌ కాంక్రీట్‌ ఉష్ణోగ్రత 35 డిగ్రీలు ఉన్నట్లుగా గుర్తించింది.

అందువల్లే డయాఫ్రం వాల్‌లో సీపేజీ వస్తోందని అభిప్రాయపడింది. సీపేజీ తీవ్రతను తేల్చడానికి తక్షణమే డయాఫ్రం వాల్‌పై రెండు మీటర్ల లోతు వరకు వరుసగా రంధ్రాలు వేసి.. పరీక్షలు చేయాలని పీపీఏకు సూచించింది. ప్రాజెక్టు భద్రత దృష్ట్యా సీపేజీ ఉన్నచోట్ల డయా ఫ్రం వాల్‌ పైభాగం 1 నుంచి 2 మీటర్ల లోతు వరకూ తొలగించి.. దానిపై కొత్తగా డయాఫ్రం వాల్‌ వేయాలని సిఫార్సు చేసింది. వీటిపై పీపీఏ, రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని సాగునీటి రంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు.  

» పోలవరం ప్రధాన (ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌–ఈసీఆర్‌ఎఫ్‌) డ్యాం గ్యాప్‌–1ను డీ–హిల్‌.. జీ–హిల్‌ మధ్య 564 మీటర్ల పొడవున, గ్యాప్‌–2లో జీ–హిల్, కుడి వైపున ఉన్న కొండ మధ్య 1,750 మీటర్ల పొడవున.. స్పిల్‌ వేకు ఎడమవైపు రెండు కొండల మధ్య గ్యాప్‌–3లో 153.50 మీటర్ల పొడవున మొత్తం 2,467.50 మీటర్ల పొడవున 52 మీటర్ల ఎత్తుతో ప్రధాన డ్యాంను నిర్మించాలి. 

ప్రధాన డ్యాం గ్యాప్‌–1 నిర్మాణంలో మట్టి, రాళ్లు, కోర్‌ (నల్లరేగడి మట్టి)తో 40 మీటర్ల వెడల్పు, 60 మీటర్ల పొడవుతో ప్రాజెక్టుకు సమీపంలో మోడల్‌ (నమూనా) డ్యాంను నిర్మించాలని పీపీఏ(పోలవరం ప్రాజెక్టు అథారిటీ), రాష్ట్ర జల వనరుల శాఖ అధికారులకు అంతర్జాతీయ నిపుణుల కమిటీ (పీవోఈ) ఆదేశించింది. మోడల్‌ డ్యాంను ఎలా నిర్మించారన్నది రికార్డు చేయాలని సూచించింది. ఆ డ్యాం నిర్మాణ విధానాన్ని... దాని పనితీరును విశ్లేషించాకే ప్రధాన డ్యాం గ్యాప్‌–1 డిజైన్‌ను ఖరారు చేస్తామని స్పష్టం చేసింది. కానీ, ఇప్పటివరకు మోడల్‌ డ్యాం నిర్మించకపోవడంపై నిపుణులు నిలదీస్తున్నారు.  

పార్లమెంటుకు నీటి కేటాయింపుల అధికారం లేదు: తెలంగాణ సర్కార్‌ వాదన 
ఇదిలా ఉంటే నీటి కేటాయింపులు చేసే అధికారం పార్లమెంటుకు లేదని బ్రిజేష్ కుమార్‌ ట్రిబ్యునల్‌ ఎదుట తెలంగాణ ప్రభుత్వం వాదించింది. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం–2014లో 11వ షెడ్యూల్‌ సెక్షన్‌–10లో మిగులు నీటి ఆధారిత ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేయాలని ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలు సమరి్పంచడాన్ని ఆక్షేపించింది. 

ఏపీ, తెలంగాణలకు కృష్ణా జలాల పునఃపంపిణీపై జస్టిస్‌ బ్రిజేష్‌కుమార్‌ చైర్మన్‌గా జస్టిస్‌ రామ్మోహన్‌రెడ్డి, జస్టిస్‌ ఎస్‌.తాళపత్ర సభ్యులుగా ఏర్పాటైన కేడబ్యూడీటీ–2 విచారణ జరుపుతోంది. ఇందులో భాగంగా గురువారం తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది సీఎస్‌ వైద్యనాథన్‌ వాదనలు వినిపించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement