
సాక్షి,నెల్లూరు జిల్లా : బుచ్చిరెడ్డిపాళెం పట్టణంలోని ఇస్కపాళెం పంచాయతీ వడ్డిపాళెంలో నివాసం ఉంటున్న మాజీ వలంటీర్ రుక్మిణి ఇంటిపై డ్రోన్‌ను కొందరు వ్యక్తులు సోమవారం ఉదయం ఎగురవేసి వీడియోలు చిత్రీకరించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి కథనం మేరకు.. తన తల్లిదండ్రులు, అక్క, ఆమె కుమార్తెలు ఇంట్లో ఉండగా, డ్రోన్ ఎగురవేయడాన్ని గమనించామని చెప్పారు. వెంటనే బయటకొచ్చి చూడగా, ఓ వ్యక్తి రిమోట్ కంట్రోల్‌తో డ్రోన్‌ను ఆపరేట్ చేస్తుండటాన్ని గుర్తించామని వివరించారు. ఆ సమయంలో తన అక్క కుమార్తె స్నానం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
డ్రోన్‌ను ఆపరేట్ చేస్తున్న వ్యక్తిని గ్రామానికి చెందిన జనార్దన్‌గా గుర్తించామన్నారు. దీనిపై ప్రశ్నించగా.. రామకృష్ణ, శంకరయ్య చెప్తే తాను వీడియోలు తీస్తున్నానని తెలిపారన్నారు. ఈ విషయమై 112కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయానికి వెళ్లి డీఎస్పీ శ్రీనివాసులుకు విషయాన్ని మంగళవారం తెలియజేయగా, ఆయన ఆదేశాలతో బుచ్చిరెడ్డిపాళెం పోలీస్‌స్టేషన్లో నిందితులపై ఫిర్యాదు చేశామన్నారు. గతంలోనూ వీరు తమ కుటుంబాన్ని అనేక ఇబ్బందులకు గురిచేశారని, ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని నిందితులపై కఠిన చర్యలు చేపట్టాలని కోరారు.