ష్‌.. ఆ ఫిష్‌ తిన్నారో.. ఆరోగ్య సమస్యలు వద్దన్నా వస్తాయ్‌!

Nellore: Cat Fish Health Issues Rise - Sakshi

కోవూరు నియోజకవర్గంలో నిషేధిత చేపల పెంపకం  

చేపలకు మేతగా కోళ్ల వ్యర్థాలు  

పర్యావరణానికి విఘాతం 

చెన్నై, బెంగళూరుల్లో విక్రయాలు 

కొర్రమీను పేరుతో క్యాట్‌ ఫిష్‌ 

ఆహార పదార్థాలు విక్రయం తెలిసినా పట్టించుకోని అధికార యంత్రాంగం

కొందరి స్వార్థం సమాజానికి హానికరంగా మారింది. తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు గడించాలన్న దురాశ ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారుతోంది. ఎంతో హానికరమైన క్యాట్‌ ఫిష్‌ను ప్రభుత్వం నిషేధించినా.. చాటు మాటుగా పెంపకాలు జరుగుతూనే ఉన్నాయి. కొర్రమీను పేరుతో హోటల్స్‌లో ఆహార పదార్థాల విక్రయాలు చేస్తున్నారు. వీటికి ఆహారంగా కోళ్ల వ్యర్థాలు వినియోగిస్తుండటం అనేక అనార్థాలకు దారి తీస్తోంది. మరో వైపు చెరువు పరిసర ప్రాంతాలు, భూగర్భ జలాలు కలుషితమై పర్యావరణానికి విఘాతం కలుగుతోంది. చెరువుల గట్లపై పడిన చికెన్‌ వ్యర్థాలను పక్షులు తీసుకెళ్లడంతో వ్యాధులు ప్రబలే అవకాశాలు లేకపోలేదు. 

సాక్షి, నెల్లూరు: క్యాట్‌ ఫిష్‌.. ఇది కుళ్లిన మాంసాన్ని తిని పెరిగే చేప. కేవలం ఆరు నెలల్లోనే ఇరవై కేజీల బరువు వరకు పెరుగుతుందటే అర్ధం చేసుకోవచ్చు. ఈ చేపల పెంపకంతో పర్యావరణం దెబ్బతినడమే కాకుండా భూగర్భ జలాలు, వాతావరణం కలుషితమవుతుంది. చేపల చెరువుల మధ్యలో చిన్న చిన్న చెరువుల్లో వీటి పెంపకాన్ని చేపట్టి కొందరు కాసులు వెనకేసుకుంటున్నారు. చేపల్లో బాగా డిమాండ్‌ ఉండే కొర్రమీనును పోలి ఉండే ఈ చేపలను మీసాలు పీకేసి కొర్రమీను పేరుతో ఎక్కువ ధరలకు అమ్మేస్తున్నారు. కిలో కోరమీను రూ.700 నుంచి రూ.1000 వరకు పలుకుతుంది. క్యాట్‌ ఫిష్‌ను కిలో రూ.150లకే యథేచ్ఛగా అమ్మేస్తున్నారు. 

కోవూరు నియోజకవర్గంలోనే.. 
జిల్లాలోని పెన్నాపరీవాహక ప్రాంతంలోని కోవూరు నియోజకవర్గంలో నిషేధిత క్యాట్‌ఫిష్‌ పెంపకం చేస్తోన్నారు. కోవూరు, ఇనమడుగు, దామరమడుగు, బుచ్చిరెడ్డిపాళెం, పెనుబల్లి ప్రాంతాల్లో దాదాపు 1,500 ఎకరాల్లో మంచినీటి చేపల పేరుతో క్యాట్‌ఫిష్‌ పెంపకం చేస్తున్నట్లు తెలిసింది. వీటిని దొడ్డిదారిన జిల్లాతో పాటు చెన్నై, బెంగళూరు నగరాలకు రవాణా చేస్తున్నారు.  

కొర్రమీను పేరుతో.. 
క్యాట్‌ ఫిష్‌ చూసేందుకు కొర్రమీనును పొలి ఉంటుంది. కొర్రమీనులో ఒకే ముల్లు ఉంటుంది. కానీ క్యాట్‌ ఫిష్‌లో ముళ్లే ఉండవు. చేపలు తినడం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తాయనే వైద్యులు, డైటిషియన్ల సూచనలతో చాలా మంది చేపలను తమ ఆహారంలో భాగం చేసుకుంటున్నారు. అయితే పెద్ద పెద్ద నగరాల్లో దుకాణాల్లోనే కాకుండా సాధారణ, స్టార్‌ హోటళ్లలో కొర్రమీను పేరుతో క్యాట్‌ ఫిష్‌ను విక్రయిస్తున్నారు. 

ఖర్చు తగ్గుతుందని.. 
చేపలకు ఆహారంగా తవుడు, సోయాబీన్‌ తదితర వాటితో ఉత్పత్తి చేసిన మేతను వాడతారు. ఇది కిలో ధర రూ.28 నుంచి రూ.30 వరకు మధ్య ఉంటుంది. మేత ద్వారా కిలో చేపను పెంచడానికి సుమారు రూ.55 వెచ్చించాల్సి ఉంటుంది. అదే కోళ్ల వ్యర్థాలు చికెన్‌ సెంటర్ల నుంచి కిలో రూ.10 వంతున కోనుగోలు చేసి వీటి ద్వారా చేప పెంచడానికి రూ.25 సరిపోతుండడంతో కోళ్ల వ్యర్థాలను వాడుతున్నారు. ముఖ్యంగా క్యాట్‌ ఫిష్‌లు త్వరగా పెరగాలన్నా.. బరువు రావాలన్నా.. మాంసం వ్యర్థాలనే వినియోగిస్తున్నారు. మాంసం వ్యర్థాలనే క్యాట్‌ ఫిష్‌లు బాగా తింటాయి కాబట్టి ఆహారంగా వేస్తున్నారు.  

వ్యర్థాలే మేత
ఈ చేపలకు కోళ్ల వ్యర్థాలే మేతగా ఉపయోగిస్తున్నారు. జిల్లాలో లభించే వ్యర్థాలతో పాటు చిత్తూరు, తిరుపతి, చెన్నై, బెంగళూరు ప్రాంతాల నుంచి వ్యర్థాలు అతి తక్కువ ధరకు కొనుగోలు చేసి ప్లాస్టిక్‌ డమ్ముల్లో నింపి ఆటోలు, లారీల్లో చేపల గుంతల వద్దకు తరలించి మేతగా వేస్తున్నారు. కిలో వ్యర్థాన్ని రూ.8 నుంచి రూ.10 వంతున కొనుగోలు చేసి మేతగా వినియోగిస్తున్నారు. 2016 లో రాష్ట్ర ప్రభుత్వం కోళ్ల వ్యర్థాలను చేపల చెరువులకు మేతగా వేయడాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు 
ఇచ్చింది.    

క్యాట్‌ ఫిషతో అనర్థాలు
ఈ చేపలను తింటే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. క్యాట్‌ ఫిష్‌లో ఉండే ఒమేగా ఫ్యాట్‌ 6 ఆమ్లాలతో నరాల వ్యవస్థ దెబ్బతినడమే కాకుండా కేన్సర్‌ ముప్పు పొంచి ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ రకం చేప దవడ కింద ఉండే ముల్లు తింటే ప్రాణాలకే ప్రమాదమని చెబుతున్నారు. అయితే అధికారుల పర్యవేక్షణ లోపంతో వీటి పెంపకం, అమ్మకాలు జరిగిపోతున్నాయి. ఒక వైపు కరోనా విపత్కర పరిస్థితుల్లో రోగనిరోధక వ్యవస్థను పెంపొందించేందుకు చేపలను తినాలని వైద్యులు చెబుతుండగా ఇలా కొర్రమీను పేరుతో క్యాట్‌ ఫిష్‌ను విక్రయాలు భారీగా పెరిగాయి. 

అధికారులకు తెలిసినా
నిషేధిత క్యాట్‌ ఫిష్‌ సాగు చేస్తున్నారని, కోళ్ల వ్యర్థాలు వినియోగిస్తున్నట్లు తరచూ పోలీసు దాడులు ద్వారా తెలిసినా మత్స్యశాఖ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. కోవూరు ప్రాంతంలో జరుగుతున్న క్యాట్‌ ఫిష్‌ సాగు పక్కా సమాచారం ఉన్నా.. వారు తెలియనట్లు నటి స్తున్నారన్న ఆరోపణలున్నాయి. క్యాట్‌ ఫిష్‌ సాగుదారులు అధికారులకు మామూళ్లు సమర్పించుకుంటున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. 

చర్యలు తీసుకుంటాం
క్యాట్‌ ఫిష్‌ సాగు చేస్తున్నట్లు మా దృష్టికి తీసుకొస్తే తప్పక చర్యలు తీసుకుంటాం. చేపల పెంపకానికి కోళ్ల వ్యర్థాలు వాడకూడదనే  ఆదేశాలున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కోళ్ల వ్యర్థాలు వాడితే గరిష్టంగా రూ. 50 వేలు వరకు జరిమానా విధించే అధికారం మత్స్యశాఖ అధికారులకు ఉంది. రెండో సారి పునరావృతం చేస్తే సాగుదారుల లైసెన్స్‌ రద్దు చేసి సరుకు స్వాధీనం చేసుకుంటారు. ఎక్కడైనా క్యాట్‌ ఫిష్‌ సాగవుతున్నట్లు మా దృష్టికి తీసుకొస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.   
–  నాగేశ్వరరావు, జేడీ, మత్స్యశాఖ  

చదవండి: స్వతంత్ర భారతదేశ చరిత్రలో ప్రప్రథమం... భూవివాదాలకు చెక్‌..!

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top