సరళంగా నీట్‌ యూజీ–2026 ప్రశ్నపత్రం | NEET UG exam concluded peacefully | Sakshi
Sakshi News home page

సరళంగా నీట్‌ యూజీ–2026 ప్రశ్నపత్రం

May 4 2026 5:20 AM | Updated on May 4 2026 5:20 AM

NEET UG exam concluded peacefully

దేశవ్యాప్తంగా 5,432 కేంద్రాల్లో పరీక్ష ప్రశాంతం

గతేడాదితో పోలిస్తే ఈసారి పెరగనున్న కటాఫ్‌లు

అంచనా వేసిన సబ్జెక్టు నిపుణులు

సాక్షి, అమరావతి: దేశంలో ఎంబీబీఎస్, బీడీఎస్‌ ఇతర యూజీ వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన అర్హత పరీక్ష నీట్‌ యూజీ–2026 ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. ఈ ఏడాది నీట్‌ ప్రశ్నపత్రం సరళంగా ఉందని సబ్జెక్ట్‌ నిపుణులు తెలిపారు. గత ఏడాది పేపర్‌ కఠినంగా ఉందని, దానితో పోలిస్తే ఈ దఫా సులభంగా ఉందని పేర్కొన్నారు. దీంతో 2025తో పోలిస్తే ఈసారి కటాఫ్‌ పెరగనున్నట్టు తెలుస్తోంది. నీట్‌ యూజీ రాయడానికి దేశ వ్యాప్తంగా 22.79 లక్షల మంది విద్యార్థులు ఈ ఏడాది దరఖాస్తు చేసుకున్నారు. వీరికి దేశ వ్యాప్తంగా 5432 కేంద్రాల్లో నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) పరీక్ష నిర్వహించింది.  

ఊరటనిచ్చిన ఫిజిక్స్‌  
గత రెండేళ్లుగాఫిజిక్స్‌ విద్యార్థులను భయపెడుతుండగా, ఈసారి మాత్రం కొంత ఊరటనిచ్చింది. ఫిజిక్స్‌ విభాగంలో ప్రశ్నలు మధ్యస్థంగా ఉన్నట్టు సబ్జెక్టు నిపుణులు తెలిపారు. గతేడాది అన్ని ప్రశ్నలూ కఠినంగా రాగా, ఈ సారి పది ప్రశ్నలు మాత్రమే కఠినంగా ఉన్నట్టు చెబుతున్నారు.  జువాలజీ కూడా ఈ సారి తేలికగా ఉందని విద్యార్థులు భావిస్తున్నారు. బయాలజీలో ప్రశ్నలను సులభం నుంచి మధ్యస్థంగా వర్గీకరించారు. ప్రశ్నలన్నీ పూర్తిగా ఎన్‌సీఈఆర్టీ పరిధి నుంచే వచ్చాయి. అయితే, గతంలోలా నేరుగా అడిగే ప్రశ్నల కంటే మ్యాచింగ్, అసెర్షన్‌–రీజనింగ్‌ ప్రశ్నలు ఎక్కువగా ఉండటంతో ప్రతి ఆప్షన్‌ను నిశితంగా పరిశీలించాల్సి వచ్చిందని విద్యార్థులు వెల్లడించారు. ఇది తమ సమయాన్ని కొంత హరించిందని అభిప్రాయ పడ్డారు. కెమిస్ట్రీలో ఆర్గానిక్, ఇన్‌–ఆర్గానిక్‌ ప్రశ్నలు నేరుగా వచ్చాయి. కానీ, ఫిజికల్‌ కెమిస్ట్రీలో కొన్ని లెక్కలు సంక్లిష్టంగా ఉండటంతో సగటు విద్యార్థికి సమయం సరిపోలేదని నిపుణులు చెబుతున్నారు. మొత్తం మీద మలి్టపుల్‌ స్టేట్మెంట్‌ ప్రశ్నలు ఎక్కువగా ఉన్నాయి.  

స్వల్పంగా కటాఫ్‌లు పెరుగుతాయి 
గత ఏడాదితో పోలిస్తే పేపర్‌ తేలికగా ఉంది. ఈ క్రమంలో కటాఫ్‌లు స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది. పేపర్‌ మధ్యస్థంగా ఉన్నప్పుడు, ఎక్కువ మంది విద్యార్థులు ఒకే రకమైన మార్కులు సాధిస్తారు. దీంతో కటాఫ్‌లు పెరిగే అవకాశం ఉంది. – కె.రవీంద్ర కుమార్, నీట్‌ కో–ఆర్డినేటర్, ధనిక్‌ భారత్‌ విద్యా సంస్థలు  

ఆలస్యం.. విషం ‘నీట్‌’ రాయకుండానే వెనుదిరిగిన విద్యార్థిని 
ఏఎన్‌యూ (పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని పరీక్ష కేంద్రానికి ఆలస్యంగా చేరుకోవడంతో ఓ విద్యార్థిని పరీక్ష రాయకుండానే వెనుదిరిగింది. ఆదివారం ఉదయం 10 గంటలకే విద్యార్థిని పరీక్ష కేంద్రానికి చేరుకుంది. పరీక్ష 2 గంటలకు అని సిబ్బంది చెప్పడంతో ఇంటికి వెళ్లిపోయింది. తిరిగి ఇంటి నుంచి బయలుదేరిన విద్యార్థిని 10 నిమిషాలు ఆలస్యంగా పరీక్ష కేంద్రానికి చేరుకుంది. అప్పటికే ప్రధాన ద్వారం మూసేశారు. లోపలికి పంపాలని సిబ్బందిని ఆ విద్యార్థిని, ఆమె తండ్రి ప్రాథేయపడ్డారు. అయినప్పటికీ పరీక్షకు అనుమతించకపోవడంతో విద్యార్థిని కన్నీరుమున్నీరుగా విలపించింది.

Advertisement
 
Advertisement
Advertisement