ఉన్న ఊరిని... వ్యవసాయాన్ని వదిలి   | Nealry One Thousand Families Leading Life With Pani Puri Selling | Sakshi
Sakshi News home page

ఉన్న ఊరిని... వ్యవసాయాన్ని వదిలి  

Jul 31 2022 11:43 AM | Updated on Jul 31 2022 4:26 PM

Nealry One Thousand Families Leading Life With Pani Puri Selling - Sakshi

వరుణుడు కరుణించలే.. నమ్ముకున్న భూమాత  గుప్పెడు గింజలివ్వలే...ఉన్న ఊరు జానెడు పొట్టను నింపలే... చేసేదేమీ లేక పొట్ట చేత పట్టుకుని అయిన వారినంతా వదిలి బతుకు జీవుడా అంటూ వలసి వచ్చారు. ఊరుగాని ఊరులో తెలియని వ్యక్తుల మధ్య కొత్త జీవితానికి నాంది పలికారు. నేడు నలుగురు మెచ్చే స్థాయికి ఎదిగారు. మెరుగైన జీవనంతోపాటు  నాలుగు కాసులు వెనకేసుకుంటూ కన్నబిడ్డలను తమలాగా కాకుండా నాలుగు అక్షరం ముక్కలను నేర్పించుకుంటూ జీవనయానం సాగిస్తున్నారు.  

కడప ఎడ్యుకేషన్‌: అన్నమయ్య జిల్లా మదనపల్లె, తంబళ్లపల్లె నియోజక వర్గాల పరిధిలోని 50 గ్రామాలకు చెందిన దాదాపు వెయ్యి కుటుంబాల వారు పానీ పూరి బండ్లే జీవనోపాధిగా ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. వీరంతా గత 18 ఏళ్లకు పైగా కడపతోపాటు జిల్లాలో పలు నియోజకవర్గ, మండల కేంద్రాలలో పానీపూరీ బండ్లను ఏర్పాటు చేసుకుని స్థిర జీవనాన్ని సాగిస్తున్నారు. 
   
నీటి వసతి లేక ఉన్న ఊరిని వదిలి... 
మదనపల్లె, తంబళ్లపల్లె నియోజక వర్గ పరిధిలో దండోరుపల్లె, కురువపల్లె, రెడ్డింపల్లె, బాటవారికురువపల్లె, అమరేపల్లె, వాయల్పాడు, సీటీఎం, బి. కొత్తకోట, పెద్దతిప్ప సముద్రంతోపాటు దాదాపు 50 గ్రామాల పరిధిలో రైతులందరూ వ్యవసాయమే జీవనోపాధిగా జీవనం సాగించేవారు. ప్రతి రైతు రెండు నుంచి ఐదు ఎకరాల వరకు భూమి ఉన్న ఆసాములే.  అయితే రానురాను సకాలంలో వర్షాలు లేక, సరైన నీటి వసతి లేక.. పంటలు పండక ఇబ్బందులు పడాల్సి వచ్చేది. దీంతో చేసేదేమీ లేక వలసలు పోవాల్సి వచ్చేది. ఈ తరహాలో గ్రామానికి చెందిన ఓ వ్యక్తి 20 ఏళ్ల క్రితం కడపకు వలసి వచ్చి పానీపూరీ బండితో జీవనాన్ని ప్రారంభించాడు.  ఆ తర్వాత అతని బంధువులు ఇలా ఒక్కొక్కరికిగా ఎవరి అçనుకూలమై స్థావరానికి వారు వెళ్లి పానీపూరీ బండ్లను ఏర్పాటు చేసుకుని బతుకు వెళ్లదీస్తున్నారు. ఇలా వలస వచ్చిన వారే వైఎస్సార్‌ జిల్లా వ్యాప్తంగా దాదాపు వెయ్యి కుటుంబాల వారున్నారు. 

ఉదయమంతా పానీపూరి తయారీ... సాయంత్రం బండ్ల నిర్వహణ... 
వలస వచ్చిన వారంతా ఉదయాన్నే పానీపూరి నిర్వహణకు కావాల్సిన కూరగాయలు, సరకులు మార్కెట్‌ నుంచి  తెచ్చుకుని పూరీలు, పానీ, మసాలాలతోపాటు కావాల్సిన వస్తువులన్నీ వారే సొంతంగా సిద్ధం చేసుకుంటారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి నగరంలోని ప్రధాన కూడళ్లలో వారు వారు ఎంచుకున్న స్థావరాల్లో  బండ్లను ఏర్పాటు చేసుకుని వ్యాపారాన్ని సాగిస్తారు. రాత్రి 9 గంటలకంతా వ్యాపారాన్ని ముగించుకుని ఇళ్లకు చేరిపోతారు. కూలీ, ఖర్చులు పోను ఇలా ఒక్కో బండిపైన రోజుకు వెయ్యి నుంచి 15 వందల రూపాయల వరకు ఆదాయం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.  

అంతా ఒకే కులానికి చెందిన వారే... 
వలస వచ్చిన వారిలో ప్రత్యేకతేంటంటే వేరే వేరే ఊళ్లకు చెందిన వారైనా సరే  అంతా ఒకే కులానికి చెందిన వారు కావడం విశేషం. పానీపూరి బండి నిర్వహణ ను ప్రధాన వృత్తిగా మలుచుకుని జీవిస్తున్నారు.

18 ఏళ్ల క్రితం పొట్ట చేతపట్టుకుని... 

నాపేరు కొల్లె రమణయ్య. మాది దండువారిపల్లె గ్రామం. నాకు మా గ్రామంలో రెండు ఎకరాల పొలం ఉండేది. ఆ పొలం వర్షాధారంతోనే పండేది. వర్షాలు సరిగా రాకపోవడంతో ఉన్న పొలం పండక బీడుగా ఉండేది. జీవనం కష్టం కావడంతో  చేసేదేమీ లేక 18 క్రితం పొట్ట చేతపట్టుకుని కడపకు వలస వచ్చాను. అప్పట్లో పానీ పూరి బండిని ఏర్పాటు చేసుకుని ప్లేటు పానీపూరి రూపాయితో వ్యాపారాన్ని మొదలు పెట్టాను. తరువాత నా కుమారులు ఇద్దరితో కూడా ఇదే వ్యాపారాన్ని పెట్టించాను. ఇప్పుడు జీవనం బాగానే ఉంది.  

ఉన్న ఊరిలో బతకలేక... 
నా పేరు తొల్లగోర్ల శ్రీరాములు. మాది బి.కొత్తకోట మండలం రాపూరివారిపల్లె. నాకు మా గ్రామంలో 3 ఎకరాల పొలం ఉంది. కానీ నీటి వసతి లేదు. వర్షం వస్తే పంటలు పండాలి లేదంటే ఎండాలి. ఈ తరుణంలో మా బంధువులు  పానీపూరీ బండి పెట్టుకుని జీవనం సాగించేవారు. వారి ద్వారా నేను 18 ఏళ్ల క్రితం కడపకు వచ్చి  పానీపూరి బండి వ్యాపారాన్ని ప్రారంభించాను. ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు పడ్డా రానురాను మెరుగుపడి  దేవుడి దయవల్ల బాగానే ఉన్నాను. నా ముగ్గురు పిల్లలను నాలా కాకుండా బాగా చదివించుకుంటున్నాను.  

కాంట్రాక్టు ఉద్యోగాన్ని వదిలేసి... 
నాపేరు రేషమ్‌  మహేష్‌. మాది అంగళ్లు గ్రామం. నేను చదువు ముగించుకుని హైదరాబాదులో ఏపీ ట్రాన్స్‌ కోలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడిని. అప్పటో కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత ట్రాన్స్‌కోలో  కాంట్రాక్టు కింద ఉద్యోగం చేసేవారందరిని తొలగించారు. దీంతో చేసేదేమీ లేక మా బంధువుల ద్వారా  కడపకు వచ్చాను. అప్పటి నుంచి పానీ పూరి బండి ఏర్పాటు చేసుకుని జీవనం ప్రారంభించాను.  

3 ఎకరాల పొలం ఉన్నా ... 
నాపేరు గంట్ల నారాయణమ్మ, మాది దండువారిపల్లె. మాకు 3 ఎకరాల పొలం ఉండేది. నీటి వసతి లేని కారణంగా పంటలను సకాలంలో సాగు చేసుకోలేక పోయేవాళ్లం. వర్షం వచ్చినప్పుడు పంటలను సాగు చేస్తాము. తరువాత సకాలంలో వర్షం వచ్చి అన్ని అనుకూలిస్తే పంట చేతి కొస్తే వస్తుంది లేదంటే పోతుంది. ఇలా కొన్నేళ్లపాటు పోరాటం చేశాం. అయినా ఏం లాభం ఉండేదికాదు. దీంతో మా కుమారుడిని తీసుకుని కడపకు వచ్చి పానీపూరి బండి ఏర్పాటు చేసుకుని ప్లేటు రూ.3తో వ్యాపారం ప్రారంభించాను. ప్రస్తుతం ప్లేటు రూ. 20కి అమ్ముతున్నాం.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement