Mushrooms: పుట్టగొడుగులతో పుట్టెడు లాభాలు!

Mushroom Farming More Benefits To Farmers In Andhra Pradesh - Sakshi

వంటకాల్లో పెరుగుతున్న పుట్టగొడుగుల వాడకం

పోషకాహారంగా న్యూట్రిషియన్ల సిఫార్సు

సాగుతోనూ మంచి లాభాలు

నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి

శిక్షణ అందిస్తున్న వ్యవసాయ యూనివర్సిటీ

సాక్షి, అమరావతి: చిల్లీ చికెన్, పెప్పర్‌ చికెన్, పత్తర్‌ కా ఘోష్, మటన్‌ టిక్కా, అపోలో ఫిష్‌.. ఇలాంటి ప్రత్యేక వంటకాల సరసన ఇప్పుడు మష్రూమ్‌లు (పుట్టగొడుగులు) కూడా చేరిపోయాయి. ఇప్పుడు ఏ రెస్టారెంట్‌కి వెళ్లినా స్పెషల్‌ మెనూలో పుట్టగొడుగులతో చేసిన వంటకాలు ఉండటం చూడొచ్చు. ఇంకో అడుగు ముందుకేసిన చిరు వ్యాపారులు తాజాగా పుట్టగొడుగులతో పచ్చళ్లు పెట్టి అమ్మడం మొదలు పెట్టారు. అందువల్లే పుట్టగొడుగుల పెంపకం ఇప్పుడు మంచి లాభాలు తెచ్చిపెట్టే కుటీర పరిశ్రమల జాబితాలో చేరింది. ఆహార నిపుణులు కూడా వీటి వాడకాన్ని ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో పుట్టగొడుగుల లాభసాటి సాగుపై కథనం. 

4 రకాల సాగు..
ప్రపంచ వ్యాప్తంగా పుట్టగొడుగులు 4 వేల రకాల వరకు ఉన్నా 200 రకాలను మాత్రమే తినగలిగినవిగా గుర్తించారు. అయితే వీటిలో సాగు చేస్తున్నవి మాత్రం 3, 4 రకాలే. అవి.. తెల్లగుండి పుట్టగొడుగులు, ముత్యపు చిప్ప పుట్టగొడుగులు, పాల పుట్టగొడుగులు, వరిగడ్డి పుట్టగొడుగులు. వీటి పెంపకానికి వాతావరణంలో తేమని, ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించాల్సి ఉంటుంది. 85–90 శాతం తేమ, 16–18 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత, కంపోస్టు ఎరువు అవసరం. జూన్‌ నుంచి ఫిబ్రవరి వరకు వీటి పెంపకానికి అనువైన కాలం. వ్యవసాయ వ్యర్థ పదార్ధాలైన గడ్డి, చొప్ప ఇతర పదార్థాలతో పెంచవచ్చు. పుట్టగొడుగుల సాగును కుటీర పరిశ్రమగా చేపట్టవచ్చు. 35 నుంచి 40 రోజుల్లో పంట దిగుబడి వస్తుంది. పెద్దగా పెట్టుబడి లేని వ్యాపారం కనుక నిరుద్యోగ యువత స్వయం ఉపాధిగా వీటి సాగును చేపట్టవచ్చు.

విత్తనమే కీలకం..
పుట్టగొడుగులు పెంచడానికి కావల్సిన విత్తనాలను స్పాన్‌ అంటారు. స్పాన్‌ (విత్తన) తయారీ మూడు దశల్లో జరుగుతుంది. మొదటగా జొన్నల నుంచి కల్చరును తయారు చేస్తారు. దాన్ని పరిశుభ్రమైన జొన్నలతో చేర్చితే మైసీలియం తయారవుతుంది. ఈ మైసీలియం వ్యాపించిన జొన్నలను స్పాన్‌ అంటారు. స్పాన్‌ స్వచ్ఛత మీదే పంట దిగుబడి ఆధారపడి ఉంటుంది. పుట్టగొడుగుల పెంపకంలో విత్తనం తర్వాత కీలకమైన అంశం శుభ్రత. చీడపీడలను గుర్తించి సకాలంలో చర్యలు తీసుకోవడం, పెంపకానికి ఉపయోగించే బెడ్లను క్రిమికీటకాలు సోకకుండా కాపాడుకోవటం ప్రధానం. ఒకసారి పుట్టగొడుగులను కోసిన తర్వాత 24 గంటలకు మించి నిల్వ ఉండవు. నిల్వ ఉంచాలనుకుంటే తగిన విధంగా శుద్ధి చేసి ఎండబెట్టి ప్యాకింగ్‌ చేసుకోవాలి.

కృషి విజ్ఞాన కేంద్రాల్లో శిక్షణ
బాపట్ల వ్యవసాయ కళాశాలలోను, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీకి చెందిన కృషి విజ్ఞాన కేంద్రాలలోనూ పుట్టగొడుగుల విత్తన తయారీపై శిక్షణ ఇస్తున్నారు. పెంపకం కేంద్రాలను పెట్టుకునేందుకు చాలా మంది ఈ శిక్షణ తరగతులకు హాజరవుతున్నారు. యూనివర్సిటీ 8 వారాల సర్టిఫికెట్‌ కోర్సును కూడా అందజేస్తోంది. మరిన్ని వివరాలకు యూనివర్సిటీ శాస్త్రవేత్త టి.గోపీకృష్ణను 9989625239 నెంబరులో సంప్రదించవచ్చు.

శాఖాహారమా? మాంసాహారమా?
పుట్టగొడుగులు నిస్సందేహంగా శాఖాహారమేనని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్లాంట్‌ పాంథాలజిస్ట్‌ ప్రొఫెసర్‌ టి.గోపీకృష్ణ చెబుతున్నారు. శిలీంద్ర జాతికి చెందిన ఈ చిన్న మొక్కల్లో బహుళ పోషకాలున్నాయి. పౌష్టికాహార లోపంతో బాధ పడే మహిళలు, పిల్లలకు ఇవి చాలా మంచి ఆహారం. మాంసకృత్తులు, బి, సి విటమిన్లు, ఖనిజ లవణాలు, పీచు పదార్ధాలు ఎక్కువ. ప్రతి వంద గ్రాముల పుట్టగొడుగుల్లో 43 కిలో కేలరీల శక్తి లభిస్తుంది. వీటిలో పిల్లల పెరుగుదలకు కావాల్సిన లైసిన్, ట్రిప్టోఫాన్‌ అనే అమైనో ఆమ్లాలు ఉన్నాయి.

ఆహారంగా తీసుకునే పుట్టగొడుగుల్లో 89 నుంచి 91 శాతం మధ్య నీరు, 0.97 నుంచి 1.26 శాతం వరకు లవణాలు, 4 శాతం వరకు మాంసకృత్తులు, 5.3 నుంచి 6.28 శాతం వరకు పిండి పదార్ధాలు ఉంటాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. పోషకాహారంగా వీటిని న్యూట్రిషియన్లు సిఫార్సు చేస్తున్నారు. చికెన్, రొయ్యల పచ్చళ్ల మాదిరే పుట్టగొడుగులతో ప్రస్తుతం పచ్చళ్లు తయారు చేస్తున్నారు. చాలా ఫంక్షన్లలో ఫ్రెడ్‌రైస్, పులావ్, వేపుళ్లు, పకోడీలు, సమోసా, బోండా, కట్లేట్, బజ్జీ, కుర్మా తదితర వంటకాలకు పుట్టగొడుగులను ఉపయోగిస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top