ప్రసవాలకు ఏటా రూ.వెయ్యి కోట్లు

Most caesareans are in private hospitals - Sakshi

ఏటా 4 లక్షలకు పైగా ప్రసవాలు ప్రైవేటు ఆస్పత్రుల్లోనే 

సగటున ఒక్కో కాన్పునకు రూ.23 వేలకు పైగా వ్యయం 

ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎక్కువ సిజేరియన్‌లే 

ప్రభుత్వాస్పత్రుల్లో 3 లక్షల ప్రసవాలు.. 40.68 శాతమే 

సగటు కంటే తక్కువ ప్రసవాలు జరుగుతున్న జిల్లాలపై అధికారుల దృష్టి 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఏటా ప్రైవేటు ఆస్పత్రుల్లో కాన్పులకు రూ.వెయ్యి కోట్ల వరకు వెచ్చిస్తున్నారు. అనేక కుటుంబాలు భారమైనా ప్రైవేటు ఆస్పత్రుల్లో కాన్పులకే మొగ్గు చూపుతున్నాయి. దీన్ని అవకాశంగా తీసుకుని ఎక్కువ ప్రైవేటు ఆస్పత్రులు భారీగా సొమ్ము వసూలు చేస్తున్నాయి. ఎక్కువమందికి సిజేరియన్‌ చేస్తున్నాయి. రాష్ట్రంలో ఏడాదికి ఏడులక్షలకుపైగా ప్రసవాలు జరుగుతుండగా.. అందులో  40.68 శాతం ప్రసవాలు మాత్రమే ప్రభుత్వాస్పత్రుల్లో జరుగుతున్నాయి. మిగతావన్నీ ప్రైవేటు ఆస్పత్రుల్లోనే. ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రసవాల్లో సగటున ఒక్కోదానికి రూ.23,200 ఖర్చవుతున్నట్టు అంచనా. ప్రైవేటు ఆస్పత్రుల్లో జరుగుతున్న ప్రసవాల్లో 66 శాతం వరకు కోతల కాన్పులే. ప్రభుత్వాస్పత్రుల్లో జరిగే ప్రసవాల్లో సిజేరియన్ల శాతం చాలా తక్కువగా ఉంది. ప్రభుత్వాస్పత్రుల్లో కాన్పుల సంఖ్య పెంచాలని సర్కారు కసరత్తు చేస్తోంది. మూడేళ్ల కిందట 30 శాతం మాత్రమే ఉండగా ఇప్పుడు 40.68 శాతానికి పెరిగింది. 

ప్రభుత్వాస్పత్రులకు ఎందుకు రావడం లేదు? 
► ప్రభుత్వాస్పత్రుల్లో సకాలంలో డాక్టర్లు అందుబాటులో ఉండరు అనే భావన ఇంకా ఉంది.
► సరిగా చూడటం లేదని పేషెంట్లలో అనుమానాలున్నాయి.
► రాత్రిపూట ప్రైవేటుకు వెళ్లగానే ఫోన్‌చేస్తే డాక్టరు వచ్చి ప్రసవం చేస్తారని భావన ఉంది.
► పారిశుధ్యం నిర్వహణ సరిగా ఉండదనేది మెజారిటీ పేషెంట్ల అభిప్రాయం. 
► గైనకాలజీ, మత్తు వైద్యులు, పిల్లల వైద్యులు అన్ని చోట్లా లేరు.  
► నర్సులు, ఇతర సిబ్బంది పేషెంట్లను సరిగా పట్టించుకోవడం లేదనే భావన ఉంది. 

ప్రభుత్వాస్పత్రులకు వెళితే లాభాలేమిటి ?
► ప్రభుత్వాస్పత్రుల్లో ఎక్కువగా సాధారణ ప్రసవానికే పెద్దపీట వేస్తారు. 
► ప్రసవం అయిన వెంటనే బిడ్డకు బర్త్‌ రిజి్రస్టేషన్‌ చేస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే ఆర్థికసాయం అందుతుంది. 
► రూపాయి ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. డిశ్చార్జి అయ్యేవరకు మందులతో సహా ఉచితమే. 
► రవాణా భారం ఉండదు. ఫోన్‌ చేయగానే 108 వాహనం ఆస్పత్రికి చేరుస్తుంది. తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ ఇంటిదగ్గర దించుతుంది. 
► పుట్టగానే బిడ్డకు వ్యాధినిరోధక టీకాలన్నీ ఉచితంగానే వేస్తారు. ప్రతి ప్రసవం విషయంలోనూ అధికారుల బాధ్యత ఉంటుంది. 

ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు 
► వైద్యులు 24 గంటలు అందుబాటులో ఉండేలా చేయడం. 
► సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ముగ్గురు వైద్యనిపుణుల బృందం ఉండేలా చూడటం. 
► ప్రసవానికి వచ్చేవారిని గౌరవంగా చూసేలా సిబ్బందికి ఆదేశాలు. 
► ఆస్పత్రుల్లో ప్రసూతి గదులను ఉన్నతీకరించడం. 
► కొన్ని ఆస్పత్రుల్లో హెచ్‌డీయూ (హై డిపెండెన్సీ యూనిట్‌)ల ఏర్పాటు. 
► ప్రసూతితో పాటు నవజాత శిశువులకు ప్రత్యేక గదుల ఏర్పాటు  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top