AP: ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌

MLC Election in Andhra Pradesh From 13th March 2023 - Sakshi

Live Updates:

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. మూడు గ్రాడ్యుయేట్‌, 2 టీచర్‌, 4 స్థానిక సంస్థలకు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్‌ ముగిసింది. 16న ఓట్ల లెక్కింపు ఉంటుంది.

►ఏలూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సజావుగా సాగుతోంది.
►మధ్యాహ్నం 12 గంటల వరకు 80.63% శాతం పోలింగ్‌ నమోదైంది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 1105 ఓట్లు ఉండగా, అందులో పోలైనవి 891 ఓట్లు. పోలింగ్ శాతం 80.63% నమోదైంది.
►జంగారెడ్డిగూడెం లో మొత్తం ఓట్లు :184 ,పోలైన ఓట్లు:153 ,...  83.15% పోలింగ్ శాతం నమోదు
కొవ్వూరులో మొత్తం ఓట్లు: 242, పోలైన ఓట్లు: 225,...  92.98 నపోలింగ్ శాతం నమోదు
నర్సాపురంలో మొత్తం ఓట్లు: 229 పోలైన ఓట్లు: 179,... 78.17 పోలింగ్ శాతం నమోదు
ఏలూరులో మొత్తం ఓట్లు :249, పోలైన ఓట్లు:153,.. 61.45 పోలింగ్ శాతం నమోదు
భీమవరం లో మొత్తం ఓట్లు : 201 పోలైన ఓట్లు:181 .. 90.05 పోలింగ్ శాతం నమోదు
► ఏలూరు జిల్లా: జంగారెడ్డిగూడెం మండల పరిషత్ కార్యాలయం లో ఎమ్మెల్సీ ఓటు ఉపయోగించుకున్న ఎమ్మెల్యే తెల్లం బలరాజు.

► తిరుపతి జిల్లా: నాయుడుపేట జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల పోలింగ్ స్టేషన్లో పోలింగ్ సరళిని పరిశీలించిన సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య.

► నెల్లూరు జిల్లా: కావలి జడ్పీ హైస్కూల్లో గ్రాడ్యుయేట్ ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి.

► విశాఖ నగరంలోని మద్దిలపాలెం కృష్ణా డిగ్రీ కళాశాల, ఎవిఎన్ కళాశాలలో పోలింగ్ కేంద్రాలని పరిశీలించిన  విశాఖ సిపి శ్రీకాంత్.

► శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో గ్రాడ్యుయేట్  MLC ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి.

► అనంతపురం: ఉరవకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉరవకొండ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు.

► పశ్చిమగోదావరి జిల్లా: భీమవరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో  ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, ఎమ్మెల్సీ అభ్యర్థి వంకా రవీంద్ర నాథ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

► తిరుపతి జిల్లా: వెంకటగిరిలో ఎమ్మెల్సీ ఓటు హక్కును వినియోగించుకున్న నెల్లూరు జిల్లా గ్రంధాలయ సమస్త చైర్మన్ దొంతు శారద.

► ప్రకాశం జిల్లా: ఒంగోలు సెయింట్ థెరిసా స్కూల్ పోలింగ్ బూత్ వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. మహిళపై టీడీపీ కార్యకర్త దురుసుగా ప్రవర్తించాడు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు తిరగబడటంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. గుంపులు గుంపులు గా ఉన్న జనాన్ని పోలీసులు చెదర గొట్టారు.

► శ్రీ సత్యసాయి జిల్లా: నల్లమాడ మండల కేంద్రంలో పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి దంపతులు గ్రాడ్యుయేట్  MLC ఓటు హక్కును వినియోగించుకున్నారు.

► అనంతపురం: కేఎస్ఆర్ కళాశాలలో ఎంపీ తలారి రంగయ్య ఎమ్మెల్సీ ఎన్నికల ఓటు హక్కు వినియోగించుకున్నారు.

► అనంతపురం జిల్లా: కళ్యాణదుర్గంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంత్రి ఉషశ్రీచరణ్ పట్టభద్ర ఓటు హక్కును వినియోగించుకున్నారు.

► అనంతపురం నగరంలోని  విద్యారణ్య పాఠశాలలో మున్సిపల్ మేయర్ మహమ్మద్ వసీం ఓటు హక్కును వినియోగించుకున్నారు.

► తిరుపతి టి.పి.పి.ఎం .కార్పొరేషన్ హైస్కూల్ లో మేయర్ డాక్టర్ శిరీష ,డాక్టర్ ముని శేఖర్ దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

► పశ్చిమగోదావరి జిల్లా: నర్సాపురం ఎండిఓ  కార్యాలయంలో  మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ అభ్యర్థి కౌరు శ్రీనివాస్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

► నెల్లూరు:DKW లోని పోలింగ్ కేంద్రంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

► తిరుపతి: సత్యనారాయణ పురం జడ్పీ హైస్కూల్ వద్ద టిడిపి నేత మబ్బు  దేవనారాయణ రెడ్డిని పోలీసులుఅరెస్ట్ చేశారు. పోలింగ్ కేంద్రం వద్ద ఘర్షణ పడటంతో అలిపిరి పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.

► తిరుపతి: నగరంలోని సత్యనారాయణపురంలోని జడ్పీ హైస్కూల్ లో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

► అనంతపురం: రాజేంద్ర మున్సిపల్ పాఠశాలలో పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

► అనంతపురం: నెహ్రూ మున్సిపల్ పాఠశాలలో ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

► నెల్లూరు: DKWలో ఏఎస్పీ హిమవతి పోలింగ్ కేంద్రాలను పరిశీలించిచారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాలపై నిరంతర నిఘా ఉంచామని వెల్లడించారు.

► ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది.

► మొత్తం 1,538 పోలింగ్‌ స్టేషన్లలో ఎమ్మెల్సీ ఎన్ని­కలు కొనసాగుతున్నాయి. 

► సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరిగేందుకు పటిష్టమైన ఏర్పాట్లుచేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్‌కుమార్‌ మీనా తెలిపారు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సోమవారం జరగ­నున్న తొమ్మిది ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉ.8 గంటల నుంచి సా.4 గంటల వరకు పోలింగ్‌ జరిగేందుకు పటిష్టమైన ఏర్పాట్లుచేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్‌కుమార్‌ మీనా తెలిపారు. ఆదివారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్ని­కల కోసం మొత్తం 1,538 పోలింగ్‌ స్టేషన్లను సిద్ధంచేసినట్లు తెలిపారు. మూడు పట్టభద్రులు.. రెండు టీచర్లు, మూడు స్థానిక సంస్థల నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం 9 ఎమ్మెల్సీ స్థానాలకు సంబందించిన అభ్యర్థుల భవిష్యత్తును 10,59,420 మంది ఓటర్లు నిర్ణయించనున్నారు.

ప్రతీ పోలింగ్‌ స్టేషన్‌లోను వెబ్‌కాస్టింగ్‌ ఏర్పాటుచేశామని, పోలింగ్‌ హాల్‌లోకి పోలీసులు, జర్నలిస్టులతో పాటు ఎవ్వరూ లోపలికి వెళ్లడానికి అనుమతిలేదని మీనా స్పష్టంచేశారు. 584 పోలింగ్‌ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించామని, ఇక్కడ మైక్రో అబ్జర్వర్లతోపాటు బయట వీడియోగ్రాఫర్‌ను కూడా ఏర్పాటుచేసినట్లు తెలిపారు.

కడప–అనంతపురం–కర్నూలు పట్టభద్రుల నియోజకవర్గంలో అత్యధికంగా 49 మంది పోటీపడుతుండటంతో ఇక్కడ జంబో బ్యాలెట్‌ బాక్సులను తెలంగాణ నుంచి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఉ.7.30కు ఏజెంట్లు సమక్షంలో బ్యాలెట్‌ బాక్సుల సీలింగ్‌ జరుగుతుందని, 8 గంటలకు పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభమై సా.4 గంటల వరకు కొనసాగుతుందన్నారు. 

ఐదు స్థానాల్లో ఏకగ్రీవం..
మొత్తం 9 స్థానిక సంస్థల అభ్యర్థులకు ఎన్నికల నోటిఫికేషన్‌ జారీకాగా.. అందులో ఐదుచోట్ల కేవలం వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు వేశారు. దీంతో అనంతపురం లోకల్‌ అథారిటీ నుంచి ఎస్‌.మంగమ్మ, కడప పి. రామసుబ్బారెడ్డి, నెల్లూరు మేరిగ మురళీధర్, తూర్పుగోదావరి కుడుపూడి సూర్యనారాయణరావు, చిత్తూరు నుంచి సుబ్రమణ్యం సిపాయిల ఎన్నిక ఏకగ్రీవం అయినట్లు ప్రకటించామన్నారు.

శ్రీకాకుళం లోకల్‌ అథారిటీ నుంచి ఇద్దరు, పశ్చిమ గోదావరిలో రెండు స్థానాలకు ఆరుగురు, కర్నూలులో ముగ్గురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక పట్టభద్రుల నియోజకవర్గాల్లో శ్రీకాకుళం–విజయనగరం–విశాఖ నుంచి 37 మంది, ప్రకాశం–నెల్లూరు–చిత్తూరు నుంచి 22, కడప–అనంతపురం–కర్నూలు నుంచి 49 మంది పోటీపడుతున్నారు. ప్రకాశం–నెల్లూరు–చిత్తూరు టీచర్ల నియోజకవర్గంలో 8మంది, కడప–అనంతపురం–కర్నూలు టీచర్ల నియోజకవర్గం నుంచి 12 మంది పోటీలో ఉన్నారు.

వయొలెట్‌ పెన్ను మాత్రమే ఉపయోగించాలి
మరోవైపు.. ఓటర్లకు స్లిప్పుల పంపిణీ ఇప్పటికే పూర్తయిందని, వీటితోపాటు ఎన్నికల సంఘం గుర్తింపు కార్డు లేదా, ఆథార్, పాన్, ప్రభుత్వ ఐడీ కార్డు, పాస్‌పోర్టు వంటి పది గుర్తింపు కార్డులు ఉంటేనే ఓటింగ్‌కు అనుమతించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్‌కుమార్‌ మీనా స్పష్టంచేశారు. బ్యాలెట్‌ పేపర్‌ విధానంలో ఎన్నికలు జరుగుతాయని.. పోటీలోని అభ్యర్థులకు ఎదురుగా వారి ప్రాధాన్యతా క్రమంలో నెంబర్లు మాత్రమే నమోదు చేయాల్సి ఉంటుందని, టిక్‌ లేదా ఇంటూ మార్కులు, సంఖ్యను పదాల్లో రాసినా, సంతకాలు చేసినా వాటిని చెల్లని ఓట్లుగా పరగణిస్తారని స్పష్టంచేశారు.

పంపిణీ చేసిన ఓటరు స్లిపుల వెనుక ఓటు ఏ విధంగా వేయాలో వివరంగా పేర్కొన్నట్లు ఆయన తెలిపారు. అదే విధంగా.. బ్యాలెట్‌ పేపర్‌తోపాటు ఇచ్చే వయొలెట్‌ కలర్‌ పెన్నుతో మాత్రమే అంకెలు వేయాలని, ఇతర రంగులు, సొంత పెన్నులు వినియోగిస్తే ఆ ఓట్లను చెల్లని వాటిగా పరగణిస్తామని మీనా స్పష్టంచేశారు.

బోగస్‌ ఓట్ల ఆరోపణలపై చర్యలు
ఇక ఎన్నికల ప్రచార సమయంలో ఇప్పటివరకు రూ.77.48 లక్షల నగదు, 1,02,819.05 లీటర్ల మద్యాన్ని పట్టుకున్నట్లు మీనా తెలిపారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన కేసుల్లో 75 మందిని అరెస్టుచేశామన్నారు. అలాగే, మొత్తం 663 ఓట్లకు సంబంధించి మాత్రమే టీడీపీ అధినేత చంద్రబాబుతో సహా ఇతర పార్టీల నుంచి ఫిర్యాదులు వచ్చాయని, ఇవన్నీ కూడా అత్యధికంగా తిరుపతి పట్టణ ప్రాంతం నుంచే ఉన్నట్లు తెలిపారు.

ఇక్కడ మొత్తం ఓటర్లు 87వేలకు పైగా ఉంటే 663 ఓట్లపై అభ్యంతరాలు వచ్చాయని.. ఇప్పటికే వాటిలో 500కు పైగా ఫిర్యాదులను పరిశీలించి చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఇక ఒకే ఇంటి చిరునామాతో చాలామందిని ఓటర్లు నమోదు చేశారన్న ఆరోపణలను పరిశీలించగా.. ఓటర్లు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉన్నారని.. నమోదు సమయంలో అధికారులు చిరునామా ఒకటే పేర్కొనడంతో ఈ గందరగోళం తలెత్తిందని.. సంబంధింత అధికారులపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. 

ఎనిమిదిచోట్ల స్ట్రాంగ్‌ రూమ్‌లు..
పోలింగ్‌ ముగిసిన తర్వాత బ్యాలెట్‌ బాక్సులను భద్రపర్చడానికి ఎనిమిది చోట్ల స్ట్రాంగ్‌ రూమ్‌లను ఏర్పాటుచేసినట్లు మీనా తెలిపారు. ఈనెల 16వ తేదీ ఉ.8 గంటలకు ఓట్ల లెక్కింపు జరుగుతుందని, సాధారణ ఎన్నికలతో పోలిస్తే ఈ ఓట్ల లెక్కింపు భిన్నమైనది కావడంతో దానికి తగ్గట్లుగా అధికారులకు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఇది సుదీర్ఘ ప్రక్రియని.. ఫలితాల ప్రకటనకు రెండు మూడు రోజులు సమయం కూడా పట్టే అవకాశం ఉందన్నారు. ఫలితాలను సాధ్యమైనంత త్వరగా ప్రకటించడానికి వీలుగా 40 వరకు టేబుల్స్‌ ఏర్పాటుచేశామన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top