AP: గణనీయంగా తగ్గిన మాతృ మరణాలు

Maternal Infant Mortality Rate Decreased In Andhra Pradesh - Sakshi

జాతీయ సగటు కంటే తక్కువే దేశంలో సగటున లక్ష 

ప్రసవాల్లో 112 మాతృ మరణాలు..రాష్ట్రంలో 65

శిశు మరణాల్లోనూ అదే పరిస్థితి 

దేశంలో వెయ్యి జననాలకు 30 

శిశు మరణాలు కాగా.. ఏపీలో 25

సామాజిక ఆర్థిక సర్వే వెల్లడి

సాక్షి, అమరావతి: నవమాసాలూ మోసి కన్న బిడ్డలను చూసుకొని తల్లి ఎంతో మురిసిపోతుంది. బిడ్డను ప్రేమతో సాకుతుంది. విద్యాబుద్ధులు నేర్పించి, ప్రయోజకులను చేస్తుంది. కానీ, ఆ తల్లికే ప్రమాదం వాటిల్లుతోంది. పురిటి సమయంలోనే తల్లులు, బిడ్డలు కన్నుమూస్తున్న విషాద ఘటనలు అనేకం. పలు కారణాల వల్ల సంభవిస్తున్న ఈ మరణాలకు అడ్డుకట్ట వేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకుంది. మాతా శిశు మరణాల తగ్గింపునకు పలు చర్యలు చేపట్టింది. ఇవి సత్ఫలితాలనిస్తున్నాయి.

రాష్ట్రంలో మాతా, శిశు మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది. మాతా, శిశు మరణాల రేటు జాతీయ సగటుతో పోలిస్తే రాష్ట్ర సగటు తక్కువగా ఉంటోంది. ఈ విషయాన్ని సామాజిక ఆర్థిక సర్వే 2021–22 తేటతెల్లం చేసింది. ప్రతి లక్ష ప్రసవాలకు తల్లుల మృతుల సంఖ్య 70కి మించకూడదనేది నిబంధన. అయితే జాతీయ స్థాయిలో సగటున ప్రతి లక్ష ప్రసవాలకు ప్రసూతి మరణాలు రేటు (ఎంఎంఆర్‌) 112 గా ఉంది. రాష్ట్రంలో మాత్రం లక్ష ప్రసవాలకు ఇది 65గా నమోదైంది. అదే విధంగా సగటున వెయ్యి ప్రసవాల్లో జాతీయ స్థాయిలో 30 మంది శిశువులు మరణిస్తున్నారు. రాష్ట్రంలో ఈ సంఖ్య 25 గా ఉంది.

అనేక చర్యలు  
మాతృ మరణాలు తగ్గించడం కోసం ప్రభుత్వం అనేక రకాల చర్యలు చేపడుతోంది. ప్రతి నెలా 9వ తేదీన అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రత్యేక వైద్య పరీక్షలు చేస్తున్నారు. గర్భం దాల్చిన మూడు నెలల్లోపు ఒకసారి, ఆరు నెలల్లోపు మరోసారి అల్ట్రాసౌండ్‌ పరీక్షలు చేసి, బిడ్డ ఎదుగుదల, తల్లి ఆరోగ్యాన్ని తెలుసుకుని, దానికి అనుగుణంగా వైద్యం అందిస్తున్నారు.

ఎంఎస్‌ఎస్‌ యాప్‌ ద్వారా ప్రతి పీహెచ్‌సీ పరిధిలోనూ హైరిస్కు గర్భిణులను గుర్తించి వారికి సుఖ ప్రసవాలు అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. గర్భిణులు, చిన్నారుల్లో పౌష్టికాహార లోపం వల్ల రక్తహీనత, ఇతర సమస్యలు వస్తాయి. వీరికి అంగన్‌వాడీల ద్వారా పాలు, గుడ్లు, ఇతర పౌష్టికాహారాన్ని ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. ప్రసూతి మరణాలు మరింత తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న స్టాఫ్‌ నర్సులకు ‘నర్స్‌ ప్రాక్టీషనర్‌ ఇన్‌ మిడ్‌వైఫరి (ఎన్‌పీఎం)’ శిక్షణను ప్రభుత్వం ప్రారంభించింది. నర్సుల్లో నైపుణ్యాలు పెంపొందించేందుకు తొలివిడతగా 60 మందికి శిక్షణ ఇస్తున్నారు.

శిశువుకు ఆరోగ్య రక్ష
శిశువుల ఆరోగ్య రక్షణకూ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో 27 స్పెషల్‌ న్యూ బోర్న్‌ కేర్‌ యూనిట్‌(ఎస్‌ఎన్‌సీయూ), 23 మినీ ఎస్‌ఎన్‌సీయూ, 21 న్యూట్రిషన్‌ రీహాబిలిటేషన్‌ సెంటర్లు, 163 న్యూ బోర్న్‌ స్టెబిలైజేషన్‌ యూనిట్‌లు (ఎన్‌బీఎస్‌యూ), 1,306 న్యూ బోర్న్‌ కేర్‌ కార్నర్స్‌ (ఎన్‌బీసీసీఎస్‌) ద్వారా చిన్నారులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. చిన్నారులు రోగాల బారిన పడకుండా టీకాల పంపిణీపైన వైద్య శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. హెపటైటిస్‌ బి, పోలియో, టీబీ సహా పలు 10 రకాల టీకాలు అందిస్తోంది.

2021–22లో డిసెంబర్‌ నాటికే ఏడాది లోపు పిల్లలకు 101.38 శాతం టీకాలు పంపిణీ చేశారు. అదే విధంగా 1 నుంచి ఐదేళ్ల వయసున్న పిల్లలకు 100.44 శాతం టీకాలు పంపిణీ చేశారు. 14 రకాల సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలతో రాష్ట్రంలోనే తొలిసారి తిరుపతిలో పీడియాట్రిక్‌ కార్డియాక్‌ ఆసుపత్రిని ప్రభుత్వం ప్రారంభించింది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు ఇక్కడ కార్పొరేట్‌ తరహా వైద్యం ఉచితంగా అందుతోంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top