ఎన్నికలకు పటిష్టమైన ఏర్పాట్లు చేయండి 

Make strong arrangements for elections - Sakshi

పోలింగ్‌ స్టేషన్లు, మౌలిక వసతుల ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయండి 

జిల్లా ఎన్నికల అధికారులకు  రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా ఆదేశం 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలను పటిష్టంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) ముఖేష్‌ కుమార్‌ మీనా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. ఆయన శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్పరెన్సు నిర్వహించారు. ఎన్నికల సంసిద్దత, ఓటర్ల జాబితా నవీకరణపై సమీక్షించారు.

సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు ప్రకటన, నోటిఫికేషన్‌ జారీకి ఎక్కువ సమయం లేదని, ఈ లోపే పోలింగ్‌ స్టేషన్లు, మౌలిక వసతులను పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. పోలింగ్‌ కేంద్రాల్లో దివ్యాంగులు, వయో వృద్ధుల కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, ఈ నెల 5వ తేదీకల్లా ర్యాంపుల నిర్మాణం పూర్తి  చేయాలని చెప్పారు. ఎన్నికల విధుల్లో ప్రభుత్వ ఉద్యోగులనే తప్పనిసరిగా నియమించాలని, సకాలంలో మాస్టర్‌ ట్రైనర్ల ద్వారా శిక్షణ పూర్తి చేయాలన్నారు. 

పోలింగ్‌ కేంద్రం పరిసరాల్లోనూవెబ్‌ టెలికాస్టింగ్‌ 
జిల్లాల వారీగా ఉన్న సమస్యాత్మక పోలింగ్‌ స్టేషన్ల విషయంలో ప్రత్యేక శ్రద్ద చూపాలని చెప్పారు. సున్నితమైన,  సమస్యాత్మకమైన పోలింగ్‌ స్టేషన్లలతో పాటు 1,200 మందికి పైగా ఓటర్లు ఉన్న పోలింగ్‌ స్టేషన్లకు తప్పనిసరిగా వెబ్‌ టెలీకాస్టింగ్‌ సౌకర్యాన్ని కల్పించాలన్నారు.

వెబ్‌ కాస్టింగ్‌పై తాత్కాలిక నివేదికను వెంటనే పంపాలన్నారు. ప్రతి జిల్లాలో కనీసం 50 శాతం పోలింగ్‌ స్టేషన్లు వెబ్‌ టెలీకాస్టింగ్‌లో కవర్‌ అవ్వాలని, ఇది పోలింగ్‌ స్టేషన్‌కే  పరిమితం కాకుండా చుట్టు ప్రక్కల ఉన్న ప్రాంతాలు కూడా కవర్‌ అవ్వాలని తెలిపారు. ప్రాంతాలవారీగా సమస్యాత్మక పోలింగ్‌ స్టేషన్ల మ్యాపింగ్‌ కూడా సత్వరమే పూర్తి చేయాలన్నారు.  

వచ్చే సోమవారానికల్లా ఎన్నికల నిర్వహణ ముసాయిదా పంపాలి 
ప్రతి జిల్లా ఎన్నికల నిర్వహణ ప్రణాళిక ముసాయిదా ప్రతిని వచ్చే సోమవారానికల్లా తమ కార్యాలయానికి పంపాలని సూచించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజన్సీల సమన్వయంతో అక్రమ నగదు, లిక్కరు, ఇతర నిషేధిత సామగ్రి రవాణాపై ప్రత్యేక దృష్టి ఉంచాలన్నారు. కేవలం రాష్ట్ర సరిహద్దుల్లోనే కాకుండా జిల్లాల్లోనూ అక్రమ కార్యకలాపాలపై  నిఘా ఉంచాలన్నారు.

ఇందుకు సంబందించిన నివేదికలను తమకు సకాలంలో పంపాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు సీఈవోలు పి. కోటేశ్వరరావు, ఎమ్‌.ఎన్‌. హరేంధిర ప్రసాద్, డిప్యూటీ సీఈవోలు ఎస్‌.మల్లిబాబు, కె.విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.  

whatsapp channel

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top