నాలుగు దశాబ్దాల తర్వాత విరామం | Lockdown for the first time in SHAR History | Sakshi
Sakshi News home page

నాలుగు దశాబ్దాల తర్వాత విరామం

Jul 26 2020 5:23 AM | Updated on Jul 26 2020 5:26 AM

Lockdown for the first time in SHAR History - Sakshi

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ మనుషుల జీవన గమనంతో పాటు మనదేశ సాంకేతిక అభివృద్ధిని కూడా అడ్డుకుంది. నాలుగు దశాబ్దాల చరిత్ర కలిగిన సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లో కనీవినీ ఎరుగని రీతిలో రాకెట్‌ ప్రయోగాలకు అంతరాయం ఏర్పడింది. తాజాగా షార్‌ కేంద్రంలోనూ కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవడంతో లాక్‌డౌన్‌ ప్రకటించారు. అన్ని ఉపగ్రహ ప్రయోగాలూ వాయిదా పడ్డాయి. రెండు దశాబ్దాల నుంచి రాకెట్‌ ప్రయోగం జరగని సంవత్సరం లేదు. అయితే, ఈ ఏడాది మొత్తం మీద ఒకే ఒక్క ప్రయోగం జరిగింది. వచ్చే ఏడాది కల్లా వైరస్‌ ప్రభావం తగ్గితే ప్రయోగాలు పునఃప్రారంభమవుతాయని, ఈ ఏడాదికి ఇక ప్రయోగాలు ఉండకపోవచ్చని ఇస్రో అధికారులు చెబుతున్నారు. 

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఈ ఏడాది జనవరి 17న ఫ్రెంచి గయానా కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి జీశాట్‌–30 ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించారు. మార్చి 5న జీఎస్‌ఎల్‌వీ మార్క్‌2 రాకెట్‌ ద్వారా జీఐశాట్‌–1 అనే సరికొత్త ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు సన్నాహాలు పూర్తి చేసిన తరువాత కొన్ని అవాంతరాలతో ఆ ప్రయోగాన్ని వాయిదా వేసుకున్నారు. మార్చి నెలాఖరులోపే రెండు పీఎస్‌ఎల్‌వీలను నింగిలోకి పంపేందుకు సిద్ధం చేశారు. మొదటి ప్రయోగవేదికలోని మొబైల్‌ సర్వీస్‌ టవర్‌లో పీఎస్‌ఎల్‌వీ సీ49 రాకెట్‌కు సంబంధించి నాలుగు దశల రాకెట్‌ పనులు పూర్తి చేశారు. ఈ రాకెట్‌ ద్వారా కార్టోశాట్‌–3 ఉపగ్రహంతో పాటు 9 విదేశీ ఉపగ్రహాలను పంపేందుకు ఏర్పాట్లు చేశారు. ఎస్‌ఎస్‌ఏబీ బిల్డింగ్‌లో పీఎస్‌ఎల్‌వీ సీ50 రాకెట్‌ మూడు దశల అనుసంధానం పనులు పూర్తి చేశారు. ఈ రాకెట్‌ ద్వారా రిశాట్‌–1 అనే ఉపగ్రహాన్ని పంపేందుకు సన్నాహాలు పూర్తి చేసి విరమించుకున్నారు.  

విరామ మెరుగని ప్రయోగాలకు బ్రేక్‌ 
► 1980లో ప్రారంభమైన రాకెట్‌ ప్రయోగాల పరంపర తొలినాళ్లలో సంవత్సరానికి ఒక ప్రయోగం లేదంటే రెండు సంవత్సరాలకు ఒక ప్రయోగాన్ని చేసేవారు.  
► పెరిగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని 1999 నుంచి 2019 దాకా రాకెట్‌ ప్రయోగాల సంఖ్య పెరగడమే కాకుండా ఒక్క సంవత్సరం కూడా విరామం లేకుండా ప్రయోగాలు చేశారు.  
► 2020 సంవత్సరాన్ని విజన్‌–2020గా తీసు కుని 12 ప్రయోగాలు చేయాలనుకున్నారు. అయితే ఒక్క ప్రయోగం కూడా చేయలేని సంవత్సరంగా 2020 మిగిలిపోయింది.  
► ఈ ఏడాది గగన్‌యాన్‌ ప్రయోగానికి సంబంధించి ఎక్స్‌పరమెంటల్, చంద్రయాన్‌–2 ప్రయోగాన్ని కూడా చేయాలనుకున్నారు.  
► 2020 ఏప్రిల్‌లోపు జీఎస్‌ఎల్‌వీ మార్క్‌–2, పీఎస్‌ఎల్‌వీ సీ49, పీఎస్‌ఎల్‌వీ సీ50 ప్రయోగాలను పూర్తి చేయాలనుకున్నారు. కానీ వీటన్నింటికి కరోనా బ్రేక్‌ వేసింది.  

రెండు వేల మందికి పైగా ఉద్యోగులు  
► షార్‌ కేంద్రంలో రాకెట్‌ ప్రయోగాలకు సంబంధించి ప్రత్యక్షంగా ఇస్రోకు సంబంధించిన వారు 2 వేల మంది 
పనిచేస్తున్నారు.  
► కాంట్రాక్టు పద్ధతిన మరో రెండు వేలమంది పని చేస్తున్నారు.  
► కాంట్రాక్టు పద్ధతిలో పనిచేసే వారంతా ఉత్తర భారతదేశానికి చెందిన వలస కూలీలు.  
► లాక్‌డౌన్‌ మెదలైన తర్వాత వారందరూ స్వరాష్ట్రాలకు వెళ్లిపోయారు. దీంతో షార్‌లో పనులు నిలిచిపోయాయి.  
► తాజాగా గత వారంలో షార్‌ కేంద్రంలోనూ కేసులు నమోదైన క్రమంలో లాక్‌డౌన్‌ ప్రకటించారు.  
► ప్రస్తుతం షార్‌ కేంద్రంలో ఉన్న రాకెట్లకు, మూడు ఉపగ్రహాలకు కాపలా కాసే పనిలో ఉన్నారు.

కార్టోశాట్‌ ఉపగ్రహాలు భద్రం 
► లాక్‌డౌన్‌కు ముందు శ్రీహరికోట రాకెట్‌ కేంద్రంలో ప్రయోగ వేదికలపై అనుసం« దానం పూర్తి చేసుకున్న జీఎస్‌ఎల్‌వీ మార్క్‌2, పీఎస్‌ఎల్‌వీ సీ49, పీఎస్‌ఎల్‌వీ సీ50 అనే మూడు రాకెట్‌లను శుక్రవారం విప్పదీసి విడిభాగాలను షార్‌లోని క్లీన్‌ రూంలో జీఐశాట్, రిశాట్, కార్టోశాట్‌ అనే ఉపగ్రహాలను కూడా భద్రపరిచారు.  
► వెహికల్‌ అసెంబ్లింగ్‌ బిల్డింగ్‌లో ఉన్న జీఎస్‌ఎల్‌వీ మార్క్‌2 రాకెట్‌ను పూర్తిగా విప్పదీసి తొలగించారు. 
► పీఎస్‌ఎల్‌వీ సీ50 రాకెట్‌ వాణిజ్యపరమైన ప్రయోగం కావడంతో దీన్ని ఆగస్టు 15 లోపు ప్రయోగించాలని వెహికల్‌ అసెంబ్లింగ్‌ బిల్డింగ్‌కు తరలించి అనుసంధాన ప్రక్రియ చేపట్టారు.  
► ఈ రాకెట్‌కు సంబంధించి రెండోదశ ప్రక్రియ కేరళలోని తిరువనంతపురంలో ఉన్న విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెం టర్‌ నుంచి రావాల్సి ఉండగా కరోనా ప్రభావంతో రాకపోకలకు అంతరాయం కలిగింది.  
► దేశంలోని ఇస్రో కేంద్రాలున్న కేరళ, తమిళనాడు, గుజరాత్, కర్ణాటకలో కరోనా వైరస్‌ విజృంభణతో ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement