సాక్షి, కర్నూలు: కర్నూలు శివారులో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన బస్సు ప్రమాదంలో తీవ్ర అస్వస్థతకు గురైన గుణసాయి అనే ప్రయాణికుడు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో కోలుకుంటున్నాడు. మచిలీపట్నంకు చెందిన ఈయన ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో ఉంటున్నాడు. బస్సులో ప్రయాణిస్తుండగా మంటలు రావడంతో ఆ పొగ పీల్చి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.
ఈ క్రమంలో అతని ఊపిరితిత్తులు ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యాయి. దీంతో అతన్ని కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చేరి్పంచారు. వైద్యులు అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఆర్‌ఐసీయులో ఉంచి వైద్యం అందిస్తున్నారు. శనివారం వరకు విషమంగా ఉన్న అతని ఆరోగ్యం వైద్యుల కృషి ఫలితంగా ఆరోగ్యం మెరుగుపడింది.
ఆస్పత్రిలో చేరిన ఎర్రిస్వామి..
బస్సు ప్రమాదంలో కీలక సాక్షిగా ఉన్న ఎర్రిస్వామి శనివారం రాత్రి ప్రభుత్వాస్పత్రిలో కడుపునొప్పితో చేరాడు. బైక్ నుంచి అతను కింద పడటంతో కడుపు వద్ద గీరుకుపోయింది. దీనికితోడు పలుచోట్ల నొప్పులు ఉండటంతో కుటుంబసభ్యుల కోరిక మేరకు పోలీసులు అతన్ని ఆసుపత్రిలో చేరి్పంచారు. అతనికి అ్రల్టాసౌండ్ స్కాన్, ఎక్స్‌రే, సీటీ స్కాన్ వంటి పరీక్షలు చేసిన వైద్యులు.. లోపల ఎలాంటి గాయాల్లేవని నిర్ధారించారు. మరికొన్ని పరీక్షలు చేసి కోలుకుంటే డిశ్చార్జ్ చేయనున్నట్లు తెలిసింది.
స్వగ్రామానికి చేరిన తల్లీకుమార్తె మృతదేహాలు
మరోవైపు.. బస్సు ఘటనలో సజీవ దహనమైన తల్లీకుమార్తె మృతదేహాలు ఆదివారం అర్ధరాత్రి స్వస్థలానికి చేరుకున్నాయి. డీఎన్‌ఏ పరీక్షల నిమిత్తం శుక్రవారం రాత్రి సంధ్యారాణి తల్లి, చందన తండ్రి నుంచి నమూనాలు సేకరించగా, ఆదివారం ఉదయం ఫలితాలు రావడంతో అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా, వారు కర్నూలుకు వెళ్లారు. సాయంత్రం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించడంతో మెదక్ మండలం శివాయిపల్లికి తరలించారు. వాటిని చూసిన కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. సోమవారం అంత్యక్రియలు జరగనున్నాయి.


